ఒకే హిట్.. వందల కోట్ల వ్యాపారం.. రిషబ్ శెట్టి మోయగలడా?
దీనికి తోడు ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్న సందీప్ సింగ్ కు ఇంతవరకు అంత పెద్ద స్కేల్ లో సినిమాలు తీసిన అనుభవం అస్సలు లేదు.
కాంతార సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి. ఆ క్రేజ్ తోనే వచ్చిన కాంతార చాప్టర్ వన్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ రేంజ్ సక్సెస్ రావడంతో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ మేకర్స్ కూడా ఇప్పుడు రిషబ్ శెట్టి భుజాలపై వందల కోట్ల బడ్జెట్ పెట్టడానికి క్యూ కడుతున్నారు. దీంతో అతని ఇమేజ్ ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోయింది.
ప్రస్తుతం రిషబ్ శెట్టి లైనప్ చూస్తే ఎవరికైనా కచ్చితంగా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రాబోతున్న జై హనుమాన్ ప్రాజెక్ట్ లో హనుమాన్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. దీనితో పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్న ద ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. వందల కోట్ల భారీ బడ్జెట్ తో
సిద్దమవుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాలు 2028, 2029 సంవత్సరాల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్నాయి.
కమర్షియల్ గా చూస్తే ఈ లైనప్ చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ దీని వెనుక ఒక పెద్ద బిజినెస్ రిస్క్ కూడా దాగి ఉందనే చర్చ గట్టిగా నడుస్తోంది. మిగతా స్టార్ హీరోలు తమ కెరీర్ లో కమర్షియల్ ఎంటర్టైనర్లు, థ్రిల్లర్లు, లవ్ స్టోరీలు చేస్తూ కెరీర్ బ్యాలెన్స్ చేసుకుంటారు. కానీ రిషబ్ శెట్టి మాత్రం తన రాబోయే ఐదేళ్ల కెరీర్ ను పూర్తిగా దేవుళ్లు, చారిత్రక వీరుల కథల చుట్టూనే తిప్పుతున్నాడు. ఒకే జోనర్ లో ఇన్ని భారీ సినిమాలు చేయడం ఒక రకమైన ఛాలెంజ్ అని చెప్పాలి.
దీనికి తోడు ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్న సందీప్ సింగ్ కు ఇంతవరకు అంత పెద్ద స్కేల్ లో సినిమాలు తీసిన అనుభవం అస్సలు లేదు. అంత భారీ బడ్జెట్ ను ఒక కొత్త దర్శకుడు ఎంతవరకు పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలడనే సందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో ఉన్నాయి. ఒకవేళ ఏ చిన్న తేడా వచ్చినా ఆ నెగెటివ్ ప్రభావం మొత్తం నేరుగా హీరో మార్కెట్ మీద పడుతుంది. వందల కోట్ల బిజినెస్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఇలాంటి కాంబినేషన్లు కాస్త భయపెట్టే విషయమే.
మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే హనుమంతుడు, ఛత్రపతి శివాజీ లాంటి ఐకానిక్ పాత్రలను ప్రేక్షకులు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూడరు. ఆయా పాత్రలతో జనాలకు ఎంతో కల్చరల్, ఎమోషనల్ కనెక్షన్ ముడిపడి ఉంటుంది. స్క్రీన్ ప్లే లో ఏ చిన్న లోపం కనిపించినా సోషల్ మీడియాలో వచ్చే దారుణమైన నెగెటివిటీని తట్టుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఈ సినిమాలపై ఉండే ఎక్స్ పెక్టేషన్స్ ను మ్యాచ్ చేయడం రిషబ్ కు ఒక అతి పెద్ద సవాల్ గా మారబోతోంది.
ఇక కాంతార తెచ్చిన గుడ్ విల్ తోనే ఇండస్ట్రీ జనాలు రిషబ్ పై ఇంతటి భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఒకే ఒక్క సక్సెస్ ట్రాక్ రికార్డ్ ను నమ్ముకుని వందల కోట్ల మార్కెట్ ను మోయడం సాధారణ విషయం ఎంతమాత్రం కాదు. రాబోయే రోజుల్లో ఈ భారీ ప్రాజెక్ట్స్ గనక క్లిక్ అయితే రిషబ్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. లేదంటే ఒకే హిట్ వండర్ గా మిగిలిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. మరి ఈ కన్నడ స్టార్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.