కాంతార ప్రీక్వెల్.. ఒక్కసారిగా 20 వేల నుంచి 80 వేలకు!
కాంతార సినిమాలో తన నటన, దర్శకత్వం ఆకట్టుకున్న ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి.. ప్రీక్వెల్ కు కూడా ఆయనే బాధ్యతలు తీసుకోవడంతో అనౌన్స్మెంట్ నుంచి సినీ ప్రియులంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు.;
సరిగ్గా మూడేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార మూవీ.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. అంచనాలు లేకుండా విడుదలైన ఆ సినిమా.. పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. కన్నడతోపాటు అన్ని భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ అందుకుని సత్తా చాటింది.
ఆ తర్వాత కాంతార సినిమాకు సీక్వెల్ కాకుండా.. ప్రీక్వెల్ తీస్తామని మేకర్స్ ప్రకటించగా.. ఒక్కసారిగా అందరి దృష్టి పడింది. కాంతార సినిమాలో తన నటన, దర్శకత్వం ఆకట్టుకున్న ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి.. ప్రీక్వెల్ కు కూడా ఆయనే బాధ్యతలు తీసుకోవడంతో అనౌన్స్మెంట్ నుంచి సినీ ప్రియులంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు.
కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని అంచనా వేశారు. ఇప్పుడు సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కొద్ది రోజుల క్రితం అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వగా.. అనుకున్న స్థాయిలో జరగలేదు. అసాధారణమైన ప్రీ సేల్స్ ఉంటాయని అనుకుంటే.. గంటకు 10-15 వేల టికెట్స్ సేల్ అయినట్లు ట్రెండ్స్ కనిపించాయి.
కానీ సినిమాకు ప్రీమియర్స్ పడ్డాక సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టు సినిమా ఉండడంతో ఆడియన్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఇప్పుడు నేడు సినిమా రిలీజ్ అయ్యాక.. మరింత పాజిటివ్ టాక్ అంతటా స్ప్రెడ్ అవుతోంది. సినిమా అదిరిపోయిందని అంతా ఇప్పుడు చెబుతున్నారు.
దీంతో ఇంకేముంది.. ఒక్కసారిగా టికెట్ బుకింగ్స్ ట్రెండ్స్ మారిపోయాయి. ఇప్పుడు గంటకు 80 వేలకు పైగా టిక్కెట్లు సేల్ అవుతున్నాయి. పాజిటివిటీ, మౌత్ టాక్, దసరా ఫెస్టివల్ మూడ్.. ఈ మూడు అంశాలు కాంతార ప్రీక్వెల్ గా బాగా కలిసొచ్చాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు పక్కా అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
అయితే అప్పుడు కాంతార.. ఇప్పుడు కాంతార ప్రీక్వెల్ కు ఒకటే తేడా. అప్పుడు అంచనాలు లేకుండా సినిమా రిలీజ్ అయ్యి ఆకట్టుకుని దూసుకుపోగా.. ఇప్పుడు అంచనాలతో విడుదలై వాటిని అందుకుని సందడి చేస్తోంది కాంతార ప్రీక్వెల్. మొత్తానికి కంటెంట్ కు ఫిదా అయిన ఆడియెన్స్.. కాంతార ప్రీక్వెల్ కు బ్రహ్మరథం పట్టేలా కనిపిస్తున్నారు. దసరా సీజన్ లో సినిమాను తెగ చూసేటట్లు ఉన్నారు.