కంగనా 'క్వీన్ 2' పై 250 కోట్ల భారీ దావా.. ఎట్టకేలకు స్ప‌ష్ఠ‌త‌!

ఈ క్రమంలో ఏకంగా రూ. 250 కోట్ల భారీ దావా దాఖలు కావడం బాలీవుడ్‌లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ వివాదంపై చిత్ర నిర్మాణ భాగస్వామి అయిన జియోస్టార్ ఎట్టకేలకు స్పందిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Update: 2026-07-08 02:36 GMT

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `క్వీన్ 2` చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద కాపీరైట్ వివాదం నడుస్తోంది. 2014లో విడుదలై సంచలన విజయం సాధించిన `క్వీన్` చిత్ర మేధో సంపత్తి హక్కులను ఈ కొత్త సినిమా ఉల్లంఘించిందంటూ ఫాంటమ్ స్టూడియోస్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఏకంగా రూ. 250 కోట్ల భారీ దావా దాఖలు కావడం బాలీవుడ్‌లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ వివాదంపై చిత్ర నిర్మాణ భాగస్వామి అయిన జియోస్టార్ ఎట్టకేలకు స్పందిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఈ దావాపై జియోస్టార్ గట్టి కౌంటర్ ఇచ్చింది. కంగనా రనౌత్‌తో తాము నిర్మిస్తున్న ఈ కొత్త చిత్రం పూర్తిగా ఒక ఒరిజినల్, స్వతంత్రమైన కథతో కూడుకున్న ప్రాజెక్ట్ అని స్పష్టం చేసింది. గతంలో జాతీయ అవార్డు గెలుచుకున్న `క్వీన్` చిత్ర కథతో గానీ.. అందులోని క్రియేటివిటీతో గానీ.. పాత్రలతో గానీ ఈ సరికొత్త సినిమాకు ఎలాంటి సంబంధం లేదని నిర్మాణ సంస్థ తేల్చిచెప్పింది. ఇది ఏ రకమైన సీక్వెల్ లేదా ప్రీక్వెల్ కాదని... కేవలం ఒక స్వతంత్రమైన కథాంశంతో తెరకెక్కుతోందని స్పష్టం చేస్తూ ఫాంటమ్ స్టూడియోస్ ఆరోపణలను పూర్తిగా ఖండించింది.

అంతేకాకుండా సినిమాలో `క్వీన్` అనే పదాన్ని టైటిల్‌గా ఉపయోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదని జియోస్టార్ వాదించింది. `క్వీన్` అనేది ఆంగ్ల భాషలోని ఒక సాధారణ నామవాచకం. ఒక సాధారణ పదంపై ఏ ఒక్కరో లేదా ఏ ఒక్క సంస్థో ప్రత్యేకమైన హక్కులను క్లెయిమ్ చేయలేరు! అని సంస్థ పేర్కొంది. చట్టప్రకారం ఇటువంటి క్లెయిమ్‌లకు ఎలాంటి ఆధారం లేదని.. కోర్టులో ఉన్న ఈ వ్యాజ్యంపై తాము చట్టపరమైన ప్రక్రియ ద్వారానే గట్టిగా పోరాడతామని... తమ వాదనపై తమకు పూర్తి నమ్మకం ఉందని జియోస్టార్ ధీమా వ్యక్తం చేసింది.

వాస్తవానికి 2014లో విడుదలైన `క్వీన్` చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులో అద్భుతమైన నటనకు గానూ కంగనా రనౌత్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును సైతం అందుకుంది. అప్పట్లో ఈ చిత్రాన్ని వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ - ఫాంటమ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. అయితే 2018లో రద్దయిన ఫాంటమ్ ఫిల్మ్స్ తిరిగి 2021లో `ఫాంటమ్ స్టూడియోస్`గా రీలాంచ్ అయింది. ఒరిజినల్ సినిమా ఐపీ హక్కులలో తమకు 50 శాతం వాటా ఉందని.. తమ అనుమతి లేకుండా సీక్వెల్స్ చేయడం కుదరదని ఫాంటమ్ స్టూడియోస్ కోర్టులో వాదిస్తోంది.

ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ సరికొత్త `క్వీన్ 2` ప్రాజెక్ట్ కోసం కంగనా రనౌత్ మళ్లీ ఒరిజినల్ చిత్ర దర్శకుడు వికాస్ బహ్ల్‌- జియో స్టార్‌తో చేతులు కలిపారు. ఈ ఏడాది ప్రారంభంలోనే సెట్స్ పైకి వెళ్లిన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ దశలోకి ప్రవేశించినట్లు సమాచారం. ఒకవైపు సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ రూ. 250 కోట్ల లీగల్ నోటీసుల వ్యవహారం కోర్టులో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News