అమెరికాలో 'కన్నప్ప' బిగ్ ప్లాన్!

లేటెస్ట్ గా మంచు విష్ణు వేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం, మొదటి దశ ప్రచార కార్యక్రమాల్ని అమెరికాలో నిర్వహించబోతున్నారు.;

Update: 2025-04-28 12:45 GMT

పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కిన సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఈసారి అలాంటి ఓ మైథలాజికల్ ఎపిక్‌గా 'కన్నప్ప' మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'కన్నప్ప'ను జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం సిద్ధమవుతోంది.

ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. మోహన్‌బాబు స్వయంగా నిర్మాణ బాధ్యతలు వహించగా, మంచు విష్ణు కథ, స్క్రీన్‌ప్లేను అందించారు. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా విజువల్స్‌, గ్రాఫిక్స్ పరంగా కొత్త స్థాయిలో ప్రేక్షకులకు అనుభూతి అందించనుంది. ఇక సినిమా ప్రమోషన్ పనులలో కూడా స్పీడ్ పెంచారు.

లేటెస్ట్ గా మంచు విష్ణు వేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం, మొదటి దశ ప్రచార కార్యక్రమాల్ని అమెరికాలో నిర్వహించబోతున్నారు. మే 8 నుంచి అమెరికాలో వరుసగా ఈవెంట్లు, రోడ్ షోలు ప్లాన్ చేశారు. న్యూజెర్సీలో మొదలుపెట్టి, డల్లాస్‌, లాస్ ఏంజిల్స్‌ వంటి ప్రధాన నగరాల్లో 'కన్నప్ప' స్పెషల్ ప్రమోషన్స్ జరుగనున్నాయి. అమెరికాలో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ పెరిగిన నేపథ్యంలో, అక్కడ ప్రత్యేకంగా ఫ్యాన్స్‌ని టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతోంది.

ఇక మే నెలలో అమెరికాలో ప్రమోషన్ కార్యక్రమాల్ని పూర్తి చేసి, తిరిగి భారత్‌కు వచ్చి, ఇక్కడ దేశవ్యాప్తంగా మిగిలిన ఈవెంట్లు చేయబోతున్నారు. జూన్ 27 విడుదల తేది వరకు నెల రోజుల పాటు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు జరుగనున్నాయి. ముఖ్యంగా భారతీయ ప్రధాన నగరాల్లో, ప్రత్యేకమైన ఈవెంట్లు, మీడియా ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేస్తున్నారు. విదేశీ ప్రచారానికి మద్దతుగా అక్కడి తెలుగు సంఘాలతో కలిసి కార్యక్రమాలు కూడా నిర్వహించేలా సన్నాహాలు సాగుతున్నాయి.

'కన్నప్ప' సినిమాలో నటీనటుల లిస్టు కూడా భారీగానే ఉంది. మోహన్‌బాబు, శరత్‌కుమార్, ముకేశ్ రుషి, రఘుబాబు, బ్రహ్మానందం వంటి టాప్ యాక్టర్స్ కీలక పాత్రలు పోషించారు. అంతేకాదు, ప్రభాస్‌, మోహన్‌లాల్‌, కాజల్ అగర్వాల్‌, అక్షయ్ కుమార్ వంటి స్టార్ సెలబ్రిటీస్ గెస్ట్ రోల్స్‌లో కనిపించనున్నారు. వీరి హైప్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ తీసుకురాబోతోంది. ఇది తెలుగు ఇండస్ట్రీలో విభిన్నమైన స్థాయిలో ప్లాన్ చేసిన పాన్ ఇండియా ఎఫర్ట్ అని చెప్పొచ్చు.

Tags:    

Similar News