500 కోట్ల క్ల‌బ్‌పై క‌న్నేసిన సూప‌ర్‌గాళ్

చాలా సాదాసీదా న‌టిగా మొద‌లై, అక‌స్మాత్తుగా సూప‌ర్‌గాళ్‌గా మారిపోయింది క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్.;

Update: 2026-02-19 03:30 GMT

చాలా సాదాసీదా న‌టిగా మొద‌లై, అక‌స్మాత్తుగా సూప‌ర్‌గాళ్‌గా మారిపోయింది క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్. ఇది నిజంగా ఊహించ‌నిది. సింపుల్ గా ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపించిన క‌ళ్యాణి.. మెగా మేన‌ల్లుడు సాయితేజ్ `చిత్రలహరి`లో ఎలా క‌నిపించిందో చూసాం. కానీ ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా యాక్షన్ మోడ్‌లోకి మారిపోవడం షాకిస్తోంది. ఆ క‌ళ్యాణి ఈ క‌ళ్యాణి ఒక‌రేనా? అనే డౌట్ కూడా పుట్టింది.

లోక మ్యాజిక్ మామూలుగా వ‌ర్క‌వుట్ కాలేదు. లోక‌-1 బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, కళ్యాణికి ఒక కొత్త ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. కేవ‌లం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఛాన్స్ దొరికితే థ్రిల్లింగ్ స్టంట్స్ చేసి అంద‌రినీ ఆక‌ట్టుకోగ‌ల‌నని క‌ళ్యాణి నిరూపించింది. చెడు శ‌క్తుల నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడే అతీంద్రియ శ‌క్తులు క‌లిగిన సూప‌ర్ గాళ్ గా అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అయితే లోకా -1 ఘ‌న‌విజ‌యం నేప‌థ్యంలో సీక్వెల్‌లో అంతకు మించిన హై-వోల్టేజ్ యాక్షన్ తో సీక్వెల్ లో ర‌క్తి క‌ట్టించ‌బోతోందని సమాచారం. `లోక 2`(సీక్వెల్) కోసం క‌ళ్యాణి అన్నివిధాలా సిద్ధమవుతోంద‌ని స‌మాచారం.

ఇది ఎలా సాధ్యం?

ఈ ప్ర‌శ్న‌కు ఏకైక స‌మాధానం.. కళ్యాణికి తన స్నేహితుడు దుల్కర్ సల్మాన్ నుండి కావాల్సినంత‌ సపోర్ట్ ఉంది. దీని కార‌ణంగానే లోక లాంటి ప్ర‌యోగానికి క‌ళ్యాణి సిద్ధ‌మైంది. విభిన్నమైన జోనర్లను ప్రయత్నించమని అత‌డు ఇచ్చిన సలహాతోనే క‌ళ్యాణి ఈ ప్రయోగాత్మక చిత్రంలో నటించి మెప్పించింది. తాజా స‌మాచారం మేర‌కు `లోకా -2` సినిమా షూటింగ్ సెప్టెంబర్ 2026లో ప్రారంభం కానుంది. చంద్ర అనే తన పవర్‌ఫుల్ పాత్రను కొన‌సాగించేందుకు క‌ళ్యాణి ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు స్వయంగా ధృవీకరించారు.

మ‌ల‌యాళంలో అరుదైన రికార్డ్:

2025లో విడుదలైన `లోక: చాప్టర్ 1: చంద్ర` మలయాళ చిత్ర పరిశ్రమలో 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో సీక్వెల్ పైనే అంద‌రి దృష్టి. ఈ సీక్వెల్ గురించి ప్ర‌శ్నించ‌గా, నేను ఈ సినిమాలో భాగమే.. వేచి చూడండి అని చెబుతూ తన పునరాగమనాన్ని క‌ళ్యాణి ఖరారు చేశారు. స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయని, 2026 సెప్టెంబర్ నుండి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. సీక్వెల్ ని క‌ళ్యాణి క‌న్ఫామ్ చేసేసింది. క‌చ్ఛితంగా ఈసారి 500కోట్ల క్ల‌బ్ అందుకోవాల‌నే క‌సితో ప‌ని చేయ‌నుంద‌ట‌. లోకా- మొద‌టి భాగం విజ‌యం నేప‌థ్యంలో రెండో భాగంపై బోలెడంత హైప్ నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే.

టోవినో ఎంట్రీ..

మొదటి భాగాన్ని తెరకెక్కించిన డొమినిక్ అరుణ్ ఇప్పుడు సీక్వెల్‌ను కూడా డైరెక్ట్ చేయనున్నారు. సీక్వెల్ కోసం అత‌డు గ‌ట్టి ప్ర‌ణాళిక‌లో ఉన్నాడు. రెండో భాగంలో టోవినో థామస్ లాంటి ప్ర‌తిభావంతుడిని మైఖేల్ పాత్ర(ప్రధాన పాత్ర)లో చూపించ‌నున్నారు. చార్లీ లేదా ఒడియ‌న్ అనే పాత్ర‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ క‌నిపిస్తార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. లోకః సినిమాటిక్ యూనివర్స్ (LCU) పేరుతో ఈ సిరీస్ మునుముందు మ‌రింత ర‌క్తి క‌ట్టించ‌బోతోంద‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది.

ముందుంది ముస‌ళ్ల పండ‌గ‌..

ఒకప్పుడు తెలుగులో హోమ్లీగా కనిపించిన అమ్మాయేనా? అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్న‌వారికి మునుముందు కళ్యాణి ఇంకా మ‌రిన్ని షాక్ లు ఇచ్చేందుకు ఆస్కారం ఉంది. ఇప్పుడు 500 కోట్ల క్లబ్ లక్ష్యంగా ఇలాంటి భారీ యాక్షన్ సినిమా సీక్వెల్‌తో దూసుకురావాల‌ని క‌ళ్యాణి ప్లాన్ చేస్తోంద‌ట‌. అయితే తెలుగు ప్రేక్షకులు కూడా క‌ళ్యాణి లాంటి ట్యాలెంటెడ్ హీరోయిన్ ని మళ్ళీ టాలీవుడ్‌లో చూడాలని కోరుకుంటున్నారు. ఈ సూపర్ గాళ్ కోసం ఎవ‌రైనా తెలుగు ద‌ర్శ‌కుడు `అవ‌తార్ వ‌ర్సెస్ లోక క‌ళ్యాణి` అనే సినిమాని క్రియేట్ చేస్తారేమో చూడాలి.

Tags:    

Similar News