గ్లోబల్ స్టార్ కి పెరుగుతున్న డిమాండ్..ఆమె స్థానం భర్తీ చేస్తుందా?

ఇకపోతే ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఇండియన్ సినిమాలో నటిస్తోంది.;

Update: 2025-12-03 05:07 GMT

గ్లోబల్ స్టార్ అనగానే ప్రతి ఒక్కరికి వెంటనే గుర్తొచ్చే పేరు ప్రియాంక చోప్రా. ఒకప్పుడు తమిళ్ చిత్రాలతో కెరీర్ ను మొదలు పెట్టిన ఈమె, ఆ తర్వాత తెలుగులో అవకాశం అందుకుంది. కానీ ఆ సినిమా పూర్తి కాకముందే మధ్యలోనే ఆగిపోయింది. దీంతో బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడే పలు సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రాకి.. అనూహ్యంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడడం, అవకాశాలు రాకపోవడంతో ఏకంగా హాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడే సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకుంది ప్రియాంక చోప్రా.

ఇకపోతే ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఇండియన్ సినిమాలో నటిస్తోంది. అదే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య సుమారుగా 1200 కోట్ల బడ్జెట్తో 2027 సమ్మర్ టార్గెట్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా పెర్ఫార్మెన్స్ మరో లెవెల్ అన్నట్టుగా తెలుస్తోంది. ఇందులో మందాకిని పాత్రలో ఒక పవర్ఫుల్ యాక్షన్ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నట్లు.. ఇటీవల రాజమౌళి రిలీజ్ చేసిన ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూస్తే ఈ విషయం ఇట్టే తెలుస్తుంది.

ఇకపోతే ఈ సినిమాలో నటిస్తోందని తెలిసినప్పటి నుంచే ప్రియాంక చోప్రాకి వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయి. అలా బాలీవుడ్ లో ఒక అవకాశం అందుకున్నట్లు వార్తలు రాగా.. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ కల్కి 2 సినిమాలో ఈమెకు అవకాశం లభించినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా పదుకొనే కాంబినేషన్లో వచ్చిన చిత్రం కల్కి 2898AD. వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

2024లో విడుదలై ఊహించని విజయాన్ని అందించింది. అప్పుడే ఈ సినిమా సీక్వెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సీక్వెల్ లో కూడా దీపికా పదుకొనే కొనసాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనుకోకుండా వైజయంతి మూవీస్ బ్యానర్ వారు దీపికా పదుకొనేను తప్పిస్తూ అధికారికంగా ప్రకటించారు. దీంతో పలు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు నెటిజన్స్. పైగా చాలామంది దీపికా పదుకొనే పై విమర్శలు గుప్పించాడు. ఎనిమిది గంటల పని దినాలు, అత్యధిక రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి ఉంటుందని, అందుకే ఈమెను తీసేశారు అంటూ పలు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు.

ఇక ఈమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అంటూ పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా రష్మిక , కీర్తి సురేష్, అనుష్క, నయనతార ఇలా చాలామంది స్టార్ హీరోయిన్ల పేర్లు తెరపైకి రాగా.. ఇప్పుడు ప్రియాంక చోప్రా ఫైనల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ప్రియాంక చోప్రా డిమాండ్ భారీగా పెరిగిపోతుంది. మరి దీపికా స్థానాన్ని ఏ మేరకు భర్తీ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News