'కల్కి-2' ఆడిషన్ల పేరుతో మోసం: అమాయక కళాకారులకు ఎర వేస్తున్న కేటుగాళ్ళు!
మరోవైపు ఈ ప్రతిష్టాత్మక సీక్వెల్ చిత్రీకరణకు సంబంధించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
సినిమా గ్లామర్ ప్రపంచంలో మెరవాలని, వెండితెరపై ఒక్క ఫ్రేమ్‌లోనైనా కనిపించాలని ఆశపడే వర్ధమాన నటుల బలహీనతలే ఇప్పుడు మేక వన్నె తోడేళ్లకు వ్యాపారంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఫిలింనగర్, కృష్ణానగర్ వీధుల్లో అవకాశాల కోసం వెతుకులాడే అమాయక కళాకారులకు కాస్టింగ్ ఏజెంట్ల పేరుతో కొందరు `బిస్కెట్లు` వేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పెద్ద స్టార్ సినిమాల్లో ఆఫర్లు ఇప్పిస్తామంటూ అబద్ధపు మాయమాటలతో అవసరంలో ఉన్న ఆర్టిస్టుల నుంచి వేలకు వేలు గుంజడం పరిపాటిగా మారింది. మోసపోయామని గ్రహించేలోపే ఆ మాయగాళ్ళు మాయమవ్వడంతో కళాకారుల జీవితాలు రోడ్డున పడుతున్నాయి.
ఇటీవల పాన్-ఇండియా సంచలనం సృష్టించిన ప్రభాస్ `కల్కి 2898 AD` సీక్వెల్ కల్కి-2 పేరును వాడుకుని ఇలాంటి తప్పుడు వ్యవహారం సాగుతోందని నిర్మాతలు గుర్తించారు. కల్కి సీక్వెల్‌లో నటించే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో ఆడిషన్స్ పేరిట సాగుతున్న ప్రచారంపై వైజయంతీ మూవీస్ సంస్థ తీవ్రంగా స్పందించింది. తాము ఏ థర్డ్-పార్టీ ఏజెన్సీకి గానీ... కాస్టింగ్ ప్రతినిధికి గానీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. నకిలీ ఏజెంట్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ పర్సనల్ వివరాలు, ఆడిషన్ వీడియోలు లేదా డబ్బులు ఇచ్చి మోసపోవద్దని... అధికారిక సామాజిక మాధ్యమాల సమాచారాన్ని మాత్రమే నమ్మాలని హెచ్చరించింది.
మరోవైపు ఈ ప్రతిష్టాత్మక సీక్వెల్ చిత్రీకరణకు సంబంధించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దుల్కర్ సల్మాన్ `ఐ యామ్ గేమ్` ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన ఇప్పటివరకు `కల్కి-2`కి సంబంధించి కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే పూర్తయిందని తెలిపారు. ప్రభాస్ డేట్స్ అందుబాటులోకి రాగానే సుదీర్ఘమైన షూటింగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నామని వివరించారు. దీంతో ప్రస్తుతం ఆడిషన్ల పేరిట సాగుతున్న ప్రచారమంతా పక్కా ఫేక్ అని స్పష్టమవుతోంది.
ఈ భారీ సీక్వెల్‌పై అంచనాలను పెంచుతూ అమితాబ్ బచ్చన్ ఇటీవల కమల్ హాసన్‌తో కలిసి సెట్స్‌లో ఉన్న బిహైండ్ ద సీన్స్ (బీటీఎస్) గ్లింప్స్ ని షేర్ చేసారు. మొదటి భాగంలో ముఖాముఖి తలపడిన ఈ ఇద్దరు దిగ్గజ నటులు.. రెండవ భాగంలో పూర్తిస్థాయిలో స్క్రీన్ స్పేస్ పంచుకోబోతున్నారని ప్రచారం సాగుతోంది. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం కంటే మరింత అద్భుతమైన విజువల్ వండర్‌గా, ఊహించని విశాల ప్రపంచాన్ని ఆవిష్కరించబోతోందని ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి.
సినిమా అనే ఈ మాయా ప్రపంచంలో అవకాశాల పేరుతో ఆశలు చూపే కేటుగాళ్ళ నుంచి నిజమైన నటులను కాపాడాల్సిన బాధ్యత మన దర్శకులు, నిర్మాతలపైనా ఉంది. కాస్టింగ్ కాల్స్ ఇచ్చే సమయంలో అధికారిక ప్రకటనలతో పాటు పారదర్శకమైన ప్రక్రియను అనుసరిస్తేనే అమాయక ఆర్టిస్టులు మోసపోకుండా ఉంటారు. అదే సమయంలో అవకాశాల కోసం ఆరాటపడే కళాకారులు కూడా ఏజెన్సీల ప్రామాణికతను చెక్ చేసుకోకుండా రూపాయి కూడా చెల్లించకూడదని గ్రహించాలి.