కూతురితో కొట్టాటకే దిగిన తల్లి!
బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ నటనతోనే కాదు ముక్కుసూటి తనంతో ఆకట్టుకోవడంలో స్పెషలిస్ట్.;
బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ నటనతోనే కాదు ముక్కుసూటి తనంతో ఆకట్టుకోవడంలో స్పెషలిస్ట్. వెండితెరపై ఎంతో చురుగ్గా కనిపించే కాజోల్ నిజ జీవితంలో కుమార్తె నైసా దేవగన్‌తో తీవ్రమైన గొడవలు పడుతుందని ఎంత మందికి తెలుసు? అవును తల్లీ కూతుళ్ల మధ్య గొడవ వచ్చిందంటే? ఆ రోజు ఇంట్లో రచ్చ మామూలుగా ఉండదన్న విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ప్రతి ఇంట్లో తల్లీకూతుళ్ల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉండటం సహజమే. కానీ కాజోల్-నీసాల మధ్య ఈ ఇగో వార్ ఒకానొక దశలో పోటాపోటీగా సాగుతుందని తాజాగా కాజోల్ స్వయంగా వెల్లడించారు.
నైసా టీనేజ్‌లోకి అడుగుపెట్టిన సమయంలో వారిద్దరి మధ్య అభిప్రాయభేదాలు ఎక్కువగా వచ్చేవిట. ఒకరు ఒకటి చెబితే? మరొకరు దానికి పూర్తి భిన్నంగా వాదించేవారట. కాజోల్ క్రమశిక్షణ విషయంలో పట్టుబట్టడం, నైసా తనకంటూ సొంత అభిప్రాయాన్ని కలిగి ఉండటంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరేదిట. కొంతకాలం పాటు పరిస్థితి అలాగే కొనసాగిందట. దీంతో ఇంట్లో వాతావరణం కూడా ఇబ్బందికరంగా మారేదని కాజోల్ గుర్తు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు గెలిచేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో గొడవలకు అంతం లేదని కాజోల్ కొంత కాలానికి గ్రహించారుట.
సమస్యకు పరిష్కారం వాదించుకోవడం లేదా ఎదుటివారిని తక్కువ చేయడం కాదని అర్దం చేసుకున్నారు. ముఖ్యంగా తల్లిగా కూతురి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో తాను విఫలమవుతున్నాననే ఆలోచన కాజోల్ లో కలిగింది. దీంతో ఇద్దరి మధ్య బంధం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో కాజోల్ ఓ అడుగు వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నారుట. `ఎంత గొడవ పడితే వారు అంత దూరమవుతారు` అనే నిజాన్ని గ్రహించి నాటి నుంచి నైసాకి స్నేహితురాలిగా మారిపోయారుట. తన అభిప్రాయాలను నైసాపై బలవంతంగా రుద్దడం మానేసి ఆమె చెప్పేది తాను వినడం మొదలు పెట్టినట్లు గుర్తు చేసుకున్నారు.
ఒక తల్లిగా గెలవడం కంటే స్నేహితురాలిగా కూతురి నమ్మకాన్ని గెలవడం ముఖ్యమని కాజోల్ బలంగా భావించారు. కాజోల్ తీసుకున్న ఈ నిర్ణయం వారి బంధంలో గొప్ప మార్పును తీసుకొచ్చినట్లు తెలుస్తొంంది. ఎప్పుడైతే కాజోల్ వెనక్కి తగ్గి నైసాను అర్థం చేసుకోవడం మొదలుపెట్టారో? అప్పటి నుంచి నైసా కూడా తల్లి పట్ల సానుకూలతను ప్రదర్శించడం ప్రారంభించిందిట. ప్రస్తుతం ఇద్దరి మధ్య గొడవలు తగ్గి చక్కని అవగాహన ఏర్పడిందిట. సోషల్ మీడియాలో కూడా ఇద్దరు కలిసి చేసే పోస్ట్‌లు వారి మధ్య ఉన్న బలమైన బంధానికి నిదర్శనంగా నిలుస్తున్నాయంటున్నారు. తల్లీకూతుళ్ల బంధం అనేది ఎంతో సున్నితమైనది. ఇగోలకు వెళ్లకుండా ఒకరు వెనక్కి తగ్గితే ఆ బంధం మరింత బలపడుతుందని కాజోల్ అనుభవం నిరూపిస్తోంది. ముఖ్యంగా నేటి తరం పిల్లలతో మెలగాలంటే పాత పద్ధతుల కంటే స్నేహపూర్వక వాతావరణమే మేలని చెప్పొచ్చు.