భార్యాభ‌ర్త‌ల బ్రేక‌ప్ కాజ్.. గ్లామ‌ర్ హ‌ద్దుల‌పై కాజ‌ల్ ఒపీనియ‌న్

సినిమా రంగంలో హ‌ద్దుమీరిన‌ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. తనకంటూ కొన్ని ప్రత్యేక నైతిక విలువలను పాటిస్తున్నానని ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఇటీవల స్పష్టం చేశారు.

Update: 2026-09-21 04:12 GMT

సినిమా రంగంలో హ‌ద్దుమీరిన‌ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. తనకంటూ కొన్ని ప్రత్యేక నైతిక విలువలను పాటిస్తున్నానని ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఇటీవల స్పష్టం చేశారు. పెద్ద ప్రాజెక్ట్‌లు, భారీ రెమ్యూనరేషన్లు వదులుకోవాల్సి వచ్చినా సరే... బోల్డ్ లేదా అసౌకర్యంగా ఉండే సన్నివేశాల్లో నటించే ప్రసక్తే లేదని కాజ‌ల్ కుండబద్దలు కొట్టారు. తన వ్యక్తిగత సిద్ధాంతాలకే ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పిన కాజల్ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

కుమారుడు నీల్ జన్మించిన తర్వాత స్క్రిప్ట్‌ల ఎంపికలో మరింత బాధ్యతగా వ్యవహరిస్తున్నట్లు చంద‌మామ‌ తెలిపారు. తన తల్లిని చూసి కుమారుడు గర్వపడేలా ఉండాలన్నదే తన లక్ష్యమని కాజల్ పేర్కొన్నారు. ప్రతి నటీమణికి తెరపై తమ హద్దులను నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛ ఉంటుందని...ఇతరుల ఎంపికలను గౌరవిస్తూనే తన సిద్ధాంతాలపై తాను స్పష్టంగా ఉంటానని కాజ‌ల్ స్ప‌ష్టంగా చెప్పారు. ప్రస్తుత కాలంలో మహిళలకు ప్రాధాన్యతనిచ్చే శక్తివంతమైన పాత్రలలో అవ‌కాశాలు వస్తుండటం సంతోషకరమని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలోనే కాజల్ అగర్వాల్ కెరీర్ పరంగా విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 2026 సంవత్సరంలో త‌ను నటిస్తున్న చిత్రాల విషయానికి వస్తే... శ్రేయస్ తలపడేతో కలిసి ఆమె నటించిన రియలిస్టిక్ సోషల్ డ్రామా చిత్రం `ది ఇండియా స్టోరీ` గ‌త‌ జూలైలో విడుదలైంది. ఆహార కల్తీ, వ్యవసాయంలో పురుగుమందుల దుర్వినియోగం వంటి తీవ్రమైన అంశాల చుట్టూ సాగే ఈ చిత్రంలో కాజల్ లాయర్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

అంతేకాకుండా ఇండియన్ సినిమా తెరపై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ `రామాయణం - పార్ట్ 1` చిత్రంలోనూ కాజల్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ హంగులతో పౌరాణిక నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటు సామాజిక అంశాలతో కూడిన రియలిస్టిక్ సినిమాల్లో నటిస్తూనే... అటు భారీ బడ్జెట్ చిత్రాలతో తనదైన శైలిలో దూసుకెళ్తూ కెరీర్‌ను ఫ్యామిలీ లైఫ్ ను అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తున్నారు.

భార్యా భ‌ర్త‌ల విడాకుల‌కు కార‌ణం?

మరోవైపు నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం మనుషుల బంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని కాజల్ ఆందోళన వ్యక్తం చేశారు. డిన్నర్ డేట్స్‌కి వెళ్లినా ఫోన్లతోనే కాలం గడపడం వల్ల దంపతుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగి విడాకులకు దారితీస్తోందని హెచ్చరించారు. ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి, భాగస్వామ్యానికి సమయం కేటాయించాలని.. తన వ్యక్తిగత జీవితంలోనూ స్క్రీన్-ఫ్రీ టైమ్‌ పాటిస్తామని కాజ‌ల్ చెప్పిన విషయాలు నెటిజన్ల నుంచి విశేష స్పందనను రాబట్టుకుంటున్నాయి.

Tags:    

Similar News