ఆంధ్రావాలా ఫ్లాపవుతుంద‌ని ముందే తెలుసు!

టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య విడుదలై తీవ్ర నిరాశ మిగిల్చిన సినిమాల లిస్ట్ లో జూనియర్ ఎన్టీఆర్- పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఆంధ్రావాలా పేరు ఇప్పటికీ ప్రత్యేకంగా వినిపిస్తుంటుంది.

Update: 2026-05-15 19:30 GMT

టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య విడుదలై తీవ్ర నిరాశ మిగిల్చిన సినిమాల లిస్ట్ లో జూనియర్ ఎన్టీఆర్- పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఆంధ్రావాలా పేరు ఇప్పటికీ ప్రత్యేకంగా వినిపిస్తుంటుంది. 2004లో రిలీజైన ఈ సినిమా అప్పట్లో ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత హైప్ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది. ఫస్ట్ లుక్ నుంచి ఆడియో వరకు అభిమానుల్లో విపరీతమైన అంచనాలు పెంచిన ఈ సినిమా, రిలీజ్ తర్వాత మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మారింది.

తాజాగా ఈ సినిమాపై ప్రముఖ ఎడిటర్ కె. మార్తాండ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ఆంధ్రావాలా సినిమా అండర్ ప్రొడక్షన్‌లో ఉన్నప్పుడే ఇది వర్కౌట్ కావడం కష్టమని చెప్పాను. కానీ దర్శకుడు పూరీ జగన్నాథ్ వినలేద‌ని చెప్ప‌డం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఒక పెద్ద సినిమా నిర్మాణ దశలోనే దాని ఫలితం గురించి టెక్నీషియన్లు అంచనా వేయడం ఆసక్తికరంగా మారింది.

ఇండ‌స్ట్రీలోని చాలామందికి స్క్రిప్ట్ దశలోనే ఒక ప్రాజెక్ట్ భవిష్యత్తుపై క్లారిటీ వచ్చేస్తుందని ఇండస్ట్రీలో తరచూ అంటూంటారు. కొంతమంది డైరెక్ట‌ర్లు లేదా నిర్మాతలు కథ వర్కౌట్ కాదని భావిస్తే అక్కడికక్కడే ప్రాజెక్ట్‌ను నిలిపివేస్తారు. మరికొందరు షూటింగ్ ప్రారంభమైన తర్వాత లోపాలు గుర్తించి స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తూ సినిమాను కొత్త దారిలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో పరిస్థితులు పూర్తిగా చేతిలో లేకపోవడంతో టెక్నీషియన్లు కేవలం తమ బాధ్యతను పూర్తి చేయడానికే పరిమితమవుతారు. మార్తాండ్ వ్యాఖ్యలు కూడా ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.

ఆయన చెప్పినట్లుగా, సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో తెలిసినా, ఒకసారి భారీ స్థాయిలో షూటింగ్ ప్రారంభమైన తర్వాత దాన్ని ఆపడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడుతుంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో అభిమానుల అంచనాలు, నిర్మాతల పెట్టుబడులు, మార్కెట్ ఒత్తిళ్లు కలిసి నిర్ణయాలను ప్రభావితం చేస్తుంటాయి. ఆంధ్రావాలా విషయంలో కూడా అలాంటి పరిస్థితులే నెలకొన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఆంధ్రావాలా ఫ్లాప్‌తో ముగిసిపోయిన ఈ కాంబినేషన్, దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ కలసి టెంపర్ రూపంలో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌కు కీలక మలుపుగా నిలిచింది. యాక్షన్, ఎమోషన్, డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న టెంపర్ భారీ విజయాన్ని అందుకుని ఎన్టీఆర్ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎంపిక చేసుకున్న కథలు, నటనలో వచ్చిన మార్పు ఆయన కెరీర్‌ను కొత్త దిశగా మలిచాయి. ప్రస్తుతం మార్తాండ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతుండగా, అభిమానులు మాత్రం ఆంధ్రావాలా నుంచి టెంపర్ వరకు ఈ కాంబో ప్రయాణాన్ని మరోసారి గుర్తుచేసుకుంటున్నారు.

Tags:    

Similar News