'డ్రాగన్' విలన్.. తారక్ కు బీటౌన్ హీరోలు భయపడుతున్నారా?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్ పై రోజురోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.;
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్ పై రోజురోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. అధికారికంగా టైటిల్ కూడా ప్రకటించకపోయినా, ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాకపోయినా ఆ సినిమాపై క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.
ఆ సినిమాకు సంబంధించి ముఖ్యంగా విలన్ పాత్ర గురించి ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్ కు ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ పర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఒక సీన్ లో కనిపిస్తేనే దానికి ప్రత్యేక వెయిటేజ్ వస్తుంది. అలాంటి హీరోకు ఎదురు నిలబడే విలన్ పాత్ర కూడా అదే స్థాయిలో ఉండాలి. అందుకే ఆ రోల్ ఎంపిక విషయంలో చిత్రబృందం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
మొదటగా విలన్ పాత్ర కోసం మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ కు మేకర్స్ సంప్రదించారు. కానీ ఆయన ఇప్పటికే పలు చిత్రాలతో బిజీగా ఉండటంతో డ్రాగన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో చిత్రబృందం మరో సరైన ఎంపిక కోసం వెతుకుతోంది. ఇక బాలీవుడ్ నుంచి స్టార్ హీరో.. ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సినిమాలో విలన్ పాత్రకు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. భారీ పారితోషికం ఆఫర్ చేసినప్పటికీ, ఎన్టీఆర్ ఎదుట ప్రతినాయక పాత్ర చేయడానికి కొంతమంది హీరోలు వెనుకంజ వేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. దీనికి కారణం ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ నే తెలుస్తోంది. దీంతో షాహిద్ కపూర్ నిజంగానే ప్రాజెక్ట్ లో చేరుతారా లేదా అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు స్పష్టత రాదు.
కానీ ఆయన లాంటి స్టార్ సినిమాలో భాగమైతే.. బాలీవుడ్ మార్కెట్ లో మూవీకి స్ట్రాంగ్ క్రేజ్ రావడం ఖాయం. దీంతో డ్రాగన్ పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సాధించే అవకాశాలు పెరుగుతాయని చెప్పాలి. ఇక చిత్రంలో హీరోయిన్ గా రుక్మిణీ వసంత్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్, విడుదల తేదీపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఆ మూవీ కథ, క్యాస్టింగ్ విషయంలో కాకుండా ప్రతి అంశంలోనూ భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ముఖ్యంగా విలన్ పాత్రకు ఎవరిని ఎంపిక చేస్తారనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అధికారిక ప్రకటన వచ్చే వరకు సస్పెన్స్ కొనసాగనుంది.