CM విజయ్‌పై అప్పుడలా- ఇప్పుడిలా..హీరో విశాల్‌కి ఏమైంది?
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ రసవత్తర సమరానికి వేదికగానే ఉంటాయి. వెండితెరపై ఒకప్పుడు కలిసి అలరించిన కథానాయకులే.. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో అధికార, ప్రతిపక్ష పాత్రల్లో తలపడుతున్నారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ రసవత్తర సమరానికి వేదికగానే ఉంటాయి. వెండితెరపై ఒకప్పుడు కలిసి అలరించిన కథానాయకులే.. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో అధికార, ప్రతిపక్ష పాత్రల్లో తలపడుతున్నారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, ప్రస్తుత సీఎం జె. విజయ్.. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మధ్య రేగిన రాజకీయ పోరు ఇప్పటికే కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాలను తీవ్రంగా వేడెక్కిస్తోంది. అయితే ఈ పొలిటికల్ డ్రామాలోకి నటుడు, దర్శకుడు విశాల్ అనూహ్యంగా ఎంట్రీ ఇవ్వడం సరికొత్త మలుపు తిరిగింది. విజయ్, ఉదయనిధి ఇద్దరితోనూ తనకున్న పాత అనుబంధాన్ని గుర్తుచేస్తూనే విశాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర విశ్లేషణకు దారితీస్తున్నాయి.
తంజావూరులో జరిగిన రైతు నిరసన ప్రదర్శనలో సీఎం విజయ్‌ను విమర్శిస్తున్న క్రమంలో.. ఉదయనిధి స్టాలిన్ నటి త్రిషను ఉద్దేశించి చేసిన ద్వంద్వార్థ కామెంట్లు పెను తుఫానునే సృష్టించాయి. దీనిపై స్పందించిన విశాల్ ఉదయనిధి త్రిషపై అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని అన్నారు. చైన్నైలోని లోయోలా కాలేజీలో విజయ్ తమకు సీనియర్ అని.. ఉదయనిధి తన బ్యాచ్‌మేట్ అని గుర్తుచేసుకున్న విశాల్... తమ సీనియర్ (విజయ్) ఏకంగా తన బ్యాచ్‌మేట్‌ను (ఉదయనిధి) జైలుకు పంపుతాడని ఎన్నడూ ఊహించలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాట తీరులో జాగ్రత్త అవసరమని హితవు పలికారు.
ఇక్కడ గమనించాల్సిన ప్రధాన అంశం విశాల్‌లోని రాజకీయ వైఖరి మార్పు. గతంలో విజయ్ రాజకీయ అరంగేట్రంపై వ్యాఖ్యానిస్తూ ``విజయ్‌కు రాజకీయం వంటపట్టదు`` అని కొంత నెగెటివ్‌గా వ్యాఖ్యానించిన విశాల్ ఇప్పుడు రూట్ మార్చారు. నేడు విజయ్‌కి ``రాజకీయం వంట పట్టింది.. పరిణతి వచ్చింది`` అని వ్యాఖ్యానిస్తూ... ప్రతిపక్ష విమర్శలపై పోలీస్ కేస్ పెట్టి అరెస్ట్ చేయించే స్థాయికి విజయ్ వచ్చారని విశ్లేషించారు. ఒకప్పుడు విజయ్ రాజకీయ సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడిన వ్యక్తి నేడు ఆయనను పవర్‌ఫుల్ పొలిటీషియన్‌గా చిత్రీకరించడం వెనుక ఉన్న మార్పును సినీ రాజకీయ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి.
అయితే ఒకే అంశంపై లేదా వ్యక్తులపై సమయానుకూలంగా తన మాట మార్చడంపై సినీ, రాజకీయ అభిమానుల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదయనిధి తప్పు చేశాడని చెబుతూనే అది రాజకీయాల్లో సహజమని సర్థుకుపోవడం.... విజయ్ సాధించిన అధికార బల ప్రయోగాన్ని నర్మగర్భంగా మెచ్చుకుంటూనే సీనియర్-బ్యాచ్‌మేట్ కార్డ్ వాడటం ఏమిటో అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. నిజానికి విశాల్ మొదటి నుంచి విజయ్ కి మద్ధతుగానే ఉన్నా.. చాలా అరుదుగా విజయ్ కి వ్యతిరేకంగా ఒక కామెంట్ మాత్రమే చేసారు. ఎప్పటికీ తన కాలేజ్ సీనియర్ కి అతడు రెస్పెక్ట్ ఇస్తూనే ఉన్నాడు.
తన దర్శకత్వంలో వస్తున్న `మగుడం` సినిమా విడుదల ముంగిట ఉన్న నేపథ్యంలో ఇరు వర్గాల అభిమానులను సంతృప్తి పరచడానికే విశాల్ ఇలాంటి దౌత్యపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని కొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా వ్యక్తిగత అనుబంధాలను, ప్రస్తుతం విశాల్ వ్యాఖ్యలపై విజయ్, ఉదయ్ నిధి అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.