ఎన్టీఆర్ సినిమాకు యంగ్ రైటర్
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.;

దేవర బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సప్త సాగారాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అటు ఎన్టీఆర్, ఇటు ప్రశాంత్ నీల్ కు మాస్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న కారణంతో వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
ఈ సినిమాకు మేకర్స్ డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తుండగా, ప్రస్తుతం డ్రాగన్ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. నీల్ చెప్పిన కథకు ఎన్టీఆర్ కొన్ని మార్పులను సూచించగా, నీల్ దాన్ని పలుమార్లు మార్చి తారక్ కు చెప్పినప్పటికీ ఆ కథ ఎన్టీఆర్ కు పెద్దగా ఎక్కలేదని, దీంతో నాగేంద్ర కాసి అనే ఓ యంగ్ రైటర్ ను ఈ సినిమా కోసం రంగంలోకి దింపారని సమాచారం.
నీల్ రాసిన కథను నాగేంద్ర కొంచెం మార్చి ఫైనల్ వెర్షన్ రెడీ చేయగా, ఆ కథకు నీల్ కూడా విపరీతంగా ఇంప్రెస్ అయ్యాడట. అందుకే నాగేంద్ర కాసి డెవలప్ చేసిన వెర్షన్ తోనే నీల్ ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడని తెలుస్తోంది. ఇక నాగేంద్ర కాసి విషయానికొస్తే అతను గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2, రామ్ చరణ్ పెద్ది సినిమాలకు రైటింగ్ విభాగంలో వర్క్ చేశాడు. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ సినిమాకు కూడా నాగేంద్ర వర్క్ చేసి కథా రచనలో కీలక పాత్ర పోషించాడు.
ప్రస్తుతం ఎన్టీఆర్‌నీల్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాలో మలయాళ యాక్టర్ టోవినో థామస్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ ఆర్ట్స్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, వచ్చే ఏడాది జూన్ 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.