సోగ్గాడు 2025గా జోనాథన్ బెయిలీ..

హాలీవుడ్‌ వెండితెరపై చిరునవ్వుతో.. చురుకైన వ్యక్తిత్వంతో.. సహజమైన శైలి నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటుడు జోనాథన్‌ బెయిలీ ఇప్పుడు మరో గుర్తింపును సొంతం చేసుకున్నాడు.;

Update: 2025-11-05 06:42 GMT

హాలీవుడ్‌ వెండితెరపై చిరునవ్వుతో.. చురుకైన వ్యక్తిత్వంతో.. సహజమైన శైలి నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటుడు జోనాథన్‌ బెయిలీ ఇప్పుడు మరో గుర్తింపును సొంతం చేసుకున్నాడు. అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక ‘పీపుల్‌’ 2025 సంవత్సరానికి అతన్ని ‘సెక్సియస్ట్‌ మ్యాన్‌ అలైవ్‌’ (అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తి)గా ప్రకటించింది. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎదురు చూసే ఈ టైటిల్‌ ఇప్పుడు బెయిలీ పేరుతో మరోసారి వార్తల్లో నిలిచింది.

నటుడిగా, మనిషిగా..

‘విక్‌డ్‌’, ‘బ్రిడ్జర్‌టన్‌’, ‘ఫెలో ట్రావెలర్స్‌’ వంటి టెలివిజన్‌ సీరీస్‌ల ద్వారా బెయిలీ వరల్డ్ వైడ్ లో అభిమానులను సొంతం చేసుకున్నాడు. అతని నటనలో కనిపించే నాజూకుతనం, ఆత్మవిశ్వాసం, సహజ శరీర భాష ఇవే అతన్ని మిగతా నటుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టాయి. ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్‌ పత్రికలలోనూ ఆయన తరచుగా కనిపిస్తారు. కానీ ఆయన ఆకర్షణ కేవలం రూపంలో కాదు. అది వ్యక్తిత్వంలో ఉంది. సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పే ధైర్యం, హాలీవుడ్‌లో సమానత్వం కోసం చేసే వ్యాఖ్య ప్రయోగాలు ఆయనను గ్లామర్‌తో కూడిన బుద్ధిజీవిగా నిలబెట్టాయి.

జీవితకాల గౌరవం..

‘పీపుల్‌’ ప్రకటించిన తర్వాత జోనాథన్‌ స్పందించారు.‘ఇది జీవితకాల గౌరవం. ఇలాంటి గుర్తింపు కేవలం సౌందర్యానికి మాత్రమే కాదు, మనసులో ఉన్న నిజాయితీకి కూడా వర్తిస్తుంది’ అని చెప్పారు.

ప్రతీ సంవత్సరం జార్జ్‌ క్లూనీ, హ్యూ జాక్‌మన్‌, ప్యాట్రిక్‌ డెమ్సీ, క్రిస్‌ ఎవాన్స్‌ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు బెయిలీ పేరు ఆ జాబితాలో వారి సరసన చేరడం ఆయన కెరీర్‌లో మరొక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

‘జురాసిక్‌ వరల్డ్‌: రీబర్త్‌’లో కొత్త గ్లామ్‌ ఫేస్

గత జూలైలో విడుదలైన ‘జురాసిక్‌ వరల్డ్‌: రీబర్త్‌’ చిత్రంలో ఆయన డాక్టర్‌ హెన్రీ లూమిస్‌ పాత్రలో కనిపించారు. సైన్స్‌, సస్పెన్స్‌, సాహసాన్ని కలిపిన ఆ చిత్రంలో బెయిలీ నటన ప్రాధాన్యత ఉన్న పాత్రగా నిలిచింది. ప్రేక్షకులు ఆయన స్క్రీన్‌ ప్రెజెన్స్‌ చూసి ‘ఇది సైన్స్‌ ఫిక్షన్‌లో ఒక కొత్త రొమాంటిక్‌ చాప్టర్‌’ అని అనేవారు.

ఫిజిక్‌లో కాదు, ఫీలింగ్స్‌లో..

ప్రపంచం ‘సెక్సీ’ అనే పదాన్ని కేవలం శరీరానికి మాత్రమే పరిమితం చేసింది. కానీ బెయిలీ వంటి నటులు దానిని ఆత్మవిశ్వాసం, మానవత, సున్నితత్వంతో మిళితం చేశారు. అతని ఆకర్షణ కేవలం కెమెరా ముందు కాదు.. మానవ సంబంధాల్లోనూ కనిపిస్తుంది. సహనటులతో సౌమ్యంగా, అభిమానులతో ఆత్మీయంగా వ్యవహరించడం ఆయన నిజమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది.

హాలీవుడ్‌లో గ్లామర్‌ సముద్రంలో వెలుగు వెలగడం ఒకెత్తయతే..

ఆ గ్లామర్‌ను గౌరవంగా మలచడం మరో ఎత్తు. జోనాథన్‌ బెయిలీ అందం అంటే చర్మం కాదు.. మనసు కూడా అందంగా ఉండాలి అన్న సందేశాన్ని మరోసారి నిరూపించాడు. ‘పీపుల్‌’ మ్యాగజైన్‌ ఇచ్చిన టైటిల్‌ ఆయన కెరీర్‌కే కాదు, సంపూర్ణ వ్యక్తిత్వానికి కూడా ఒక అద్దం పడుతుందన్న ఆయన వ్యాఖ్యలు ఆయన వ్యవహార శైలిని కూడా అభిమానులు ఆకట్టుకునేలా చేసింది.

Tags:    

Similar News