'సెవెంథ్ సెన్స్' విలన్‌ని గుర్తు పట్టగలరా?
జానీ ట్రై గుయెన్ వియత్నాంలో గొప్ప మార్షల్ ఆర్ట్స్ సంప్రదాయం కలిగిన కుటుంబంలో జన్మించాడు. 9 ఏళ్లకే అతడు అమెరికాకు వలస వచ్చాడు.;
సూర్య కథానాయకుడిగా ఏ.ఆర్ మురుగదాస్ తెరకెక్కించిన `సెవెంథ్ సెన్స్` భారతదేశంలో ఎక్కువ చర్చించిన సినిమాల్లో ఒకటి. బోధి ధర్మ సిద్ధాంతం- బౌద్ధ గురువును పరిచయం చేస్తూనే, సైన్స్ ఫిక్షన్ కథలోకి తీసుకెళ్లి మురుగదాస్ భారతీయ తెరపై మొదటిసారి ఒక విభిన్నమైన ప్రయత్నం చేసాడు. ఇందులో పాత్రలు పాత్రధారులతో చాలా మ్యాజిక్ చేసేందుకు ప్రయత్నించాడు. ముఖ్యంగా సూర్య ద్విపాత్రాభినయం, హాలీవుడ్ నటుడు జానీ ట్రై గుయెన్ భీకరమైన విలనీ, శ్రుతిహాసన్ అందచందాలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా ఈ సినిమా కోసం మురుగదాస్ ఎంపిక చేసుకున్న కథాంశం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు తెర తీసింది.
`సెవెంథ్ సెన్స్` కొన్ని లోపాల కారణంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా ఈ సినిమాలో పాత్రలు పాత్రధారుల గురించి, వారి నట ప్రదర్శనల గురించి చాలా చర్చ సాగింది. సూర్య బౌద్ధ గురువుగా, సర్కస్ వాలాగా ఈ చిత్రంలో అద్భుతంగా నటించాడు. అయితే అతడితో పోటీపడుతూ విలన్ పాత్రధారి సాగించే విధ్వంశం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. భారతదేశంలో ప్రజాజీవనాన్ని కకావికలం చేసేందుకు ప్రయత్నించే విలన్ గా జానీ ట్రై గుయెన్ అద్భుత నటనతో కట్టి పడేసాడు.
కంటి చూపుతోనే శత్రువును మట్టి కరిపించే సూపర్ పవర్స్ ఉన్న విలన్ గా అతడి అభినయం అందరినీ ఆకట్టుకుంది. జానీ గుయెన్ సహజంగానే మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్ట్. అతడు నటుడు మాత్రమే కాదు, స్టంట్ కొరియోగ్రాఫర్ గాను చెప్పుకోదగ్గ హాలీవుడ్ చిత్రాలకు పని చేసాడు.
జానీ ట్రై గుయెన్ వియత్నాంలో గొప్ప మార్షల్ ఆర్ట్స్ సంప్రదాయం కలిగిన కుటుంబంలో జన్మించాడు. 9 ఏళ్లకే అతడు అమెరికాకు వలస వచ్చాడు. 90వ దశకంలో మార్షల్ ఆర్ట్స్‌లో గుయెన్ ప్రతిభకు సహచరులు ఆశ్చర్యపోయేవారు. అతడు పిన్న వయసులో పలు ఛాంపియన్‌షిప్‌లలో రకరకాల అవార్డులను గెలుచుకున్నాడు. అలాగే జాతీయ జట్టులో యుఎస్ కు ప్రాతినిధ్యం వహించాడు.
ఆ తర్వాత హాలీవుడ్‌లో నటుడిగా, స్టంట్ కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించాడు. మోర్టల్ కోంబాట్ సిరీస్ (1998) కోసం స్టంట్‌మ్యాన్‌గా పని చేసాడు. అది అతడి కెరీర్ తొలి సినిమా. స్పైడర్‌మ్యాన్ 2 (2004)లో డబుల్ స్పైడర్‌మ్యాన్‌గా కనిపించాడు. ది ప్రొటెక్టర్ (2005)లో టోనీ జా తో పాటు గుయెన్ నటించాడు. అప్పటి నుంచి తన కెరీర్‌ను నటన వైపు మళ్లించాడు. ది రెబెల్ (2007) తర్వాత జానీ ట్రై గుయెన్ వియత్నాంలో త్వరగా స్టార్‌డమ్ సాధించాడు. ఈ చిత్రానికి అతడు రచయితగా పని చేయడమే గాక, నిర్మాతగాను నిధులు సమకూర్చాడు. క్లాష్ (2009) చిత్రం జానీ ట్రై గుయెన్ ను సౌత్ ఈస్ట్ ఆసియా ప్రీమియర్ యాక్షన్ స్టార్‌గా స్థిరపరిచింది. థాయిలాండ్‌లో గుయెన్ `ఫోర్స్ ఆఫ్ ఫైవ్` (2009)లో చేరాడు. ఆ తర్వాత 2011లో దక్షిణ భారతదేశంలో భారీ చిత్రాలలో ఒకటైన సెవెంథ్ సెన్స్ (7ఏఎం ఆరివు)లో నటించాడు. జానీ ట్రై గుయెన్ పలు వియత్నామీస్ హిట్ సినిమాల్లోను నటించాడు. స్పైక్ లీ `5 బ్లడ్స్` (2020) చిత్రంలోను అతడు నటించాడు.
నిజానికి జానీ ట్రై గుయెన్ మొదట టాలీవుడ్‌లో రామ్ చరణ్ `చిరుత`(2007) చిత్రంలో నటించాడు. ఆ తర్వాత ప్రభాస్ తో ఏక్ నిరంజన్, మహేష్ తో బిజినెస్‌మేన్ చిత్రాల్లోను అతడు నటించాడు. కానీ అవన్నీ అతడికి అంత పెద్ద గుర్తింపును తేలేదు. సూర్య `సెవెంథ్ సెన్స్` చిత్రంలో డాంగ్లీ పాత్రలో అతడి నటనకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. సెవెంథ్ సెన్స్ విడుదలై ఇప్పటికి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి జానీ ట్రై గుయెన్ ని ఆడియెన్ గుర్తు చేసుకుంటున్నారు. అతడు అప్పటికి ఇప్పటికి ఎలా మారాడో చూడాలనుకుంటున్నారు. అయితే ఈ ఏడేళ్లలో అతడి రూపంలో చాలా మార్పులు వచ్చాయి. అతడి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.