చ‌ర‌ణ్ రియ‌ల్ హీరో.. ఆయ‌న‌కు ఋణ‌ప‌డి ఉంటాం!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన‌రోజును ఇవాళ అభిమానులు ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు.;

Update: 2026-03-27 08:24 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన‌రోజును ఇవాళ అభిమానులు ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అత‌నికి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చ‌ర‌ణ్ ఫ్యాన్స్ ఈ రోజును పండుగలా జరుపుకుంటుండగా, ఎన్నో ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

చరణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అన్నదానం, రక్తదానం లాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమ అభిమాన హీరో పుట్టినరోజును సేవా దినోత్సవంగా మార్చడం ద్వారా మెగా ఫ్యాన్స్ మరోసారి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్ర‌తీ ఏడాది లాగానే ఈ ఏడాది కూడా చ‌ర‌ణ్ బ‌ర్త్ డే ను పుర‌స్కరించుకుని స్పెష‌ల్ బ‌ర్త్ డే ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వ‌హించారు.

డ్యాన్స‌ర్ల క‌ష్టం ఆయ‌న‌కు బాగా తెలుసు

ఈ వేడుకల్లో పలువురు సినీ ప్రముఖులు, మెగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చరణ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. డ్యాన్సర్లు ఎంత కష్టపడతారో చరణ్ అన్నకు బాగా తెలుస‌ని, అందుకే వారికి ఇన్సూరెన్స్ చేయిస్తానని చెప్పి, అడిగిన వెంటనే రూ.40 లక్షలు సహాయం చేశారు. ఇది కేవలం డబ్బు కాద‌ని, 600 కుటుంబాల ఆరోగ్య భద్రత అని, ఈ రోజుల్లో రూ.40 ఇవ్వ‌డ‌మే క‌ష్టం అలాంటిది ఆయ‌న అడ‌గ్గానే ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఇచ్చి, దాదాపు 2000 మందికి ఇన్సూరెన్స్ కల్పించారంటూ చ‌ర‌ణ్ గొప్పతనాన్ని కొనియాడారు.

చ‌ర‌ణ్‌ది గొప్ప మ‌న‌సు

ప్ర‌స్తుత రోజుల్లో చిన్న సహాయం చేయడమే కష్టమైపోయిందని, కానీ చరణ్ మాత్రం అడిగిన వెంటనే సాయం చేయడం ఆయన మనసు ఎంత గొప్పదో చూపిస్తుందని జానీ మాస్టర్ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. ఈ విష‌యంలో డ్యాన్సర్స్ యూనియన్ మొత్తం చరణ్‌కు రుణపడి ఉంటుందని, చ‌ర‌ణ్ లాంటి గొప్ప‌ వ్యక్తిని అందించిన చిరంజీవి గారిని ఎప్పటికీ మర్చిపోలేమని జానీ అన్నారు.

ఏప్రిల్ 30న రిలీజ్ కానున్న పెద్ది

ఇక చ‌ర‌ణ్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం అత‌ను, డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో పెద్ది అనే విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాను చేస్తున్నారు. బాలీవుడ్ భామ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాలో క‌న్న‌డ స్టార్ శివ‌రాజ్ కుమార్, జ‌గ‌ప‌తి బాబు, దివ్యేందు శ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహ‌మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండ‌గా, ఏప్రిల్ 30న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే రెండు పాట‌లు రిలీజ‌వ‌గా, ఆ రెండు సాంగ్స్ కు జానీ మాస్ట‌రే కొరియోగ్రాఫీ చేయ‌డం విశేషం.




Tags:    

Similar News