జియోస్టార్ భారీ పెట్టుబడులు.. ఎంటర్టైన్మెంట్ కోసం $10 బిలియన్లకు పైగా..

భారతీయ వినోద రంగం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి చేరుకుంది. ప్రాముఖ్యత పెరుగుతున్న ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రిలయన్స్ గ్రూప్స్ జియోస్టార్ సంస్థ బిగ్ స్కేల్ ప్లాన్‌తో ముందుకు దూసుకెళ్తోంది.;

Update: 2025-05-03 14:15 GMT

భారతీయ వినోద రంగం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి చేరుకుంది. ప్రాముఖ్యత పెరుగుతున్న ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రిలయన్స్ గ్రూప్స్ జియోస్టార్ సంస్థ బిగ్ స్కేల్ ప్లాన్‌తో ముందుకు దూసుకెళ్తోంది. ముంబయిలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో ఇటీవల నిర్వహించిన WAVES (World Audio Visual Entertainment Summit) కార్యక్రమంలో జియోస్టార్ వైస్ చైర్మన్ ఉదయ్ శంకర్ చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో సంచలనంగా మారాయి.

ప్రధానమంత్రి మోదీ హాజరైన ఈ సమ్మిట్‌లో, గత 30 సంవత్సరాలలో భారతీయ మీడియా రంగంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులు గురించి ఉదయ్ శంకర్ వివరించారు. శాటిలైట్ టీవీల నుంచి కేబుల్, డిజిటల్ స్ట్రీమింగ్ వరకు వచ్చిన పరిణామాలను, ప్రత్యేకంగా జియో ప్రభావంతో వచ్చిన టెలివిజన్ వినియోగ విప్లవాన్ని ప్రస్తావించారు. టెక్నాలజీ, డేటా విస్తరణతో వినియోగదారులకు కంటెంట్ మరింత దగ్గరైంది.

ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు 700 మిలియన్ల మంది ప్రజలు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రాంతీయ భాషల్లోనూ విస్తరిస్తున్న ఈ విప్లవం, లొకల్ కంటెంట్‌కు అంతర్జాతీయ అవకాశాలను తెరలేపుతోంది. అమెరికా, చైనా తరహాలో భారత్ కూడా స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో టాప్ ప్లేయర్ అవ్వాలంటే, గ్లోబల్ ప్రమాణాలకు తగిన కంటెంట్ తయారీ కీలకమవుతుంది.


ఈ నేపథ్యంలో జియోస్టార్ సంస్థ భారీ ఎత్తున కంటెంట్‌పై పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. 2024లో రూ. 25,000 కోట్లు, 2025లో రూ. 30,000 కోట్లు ఖర్చు చేయగా, 2026 నాటికి రూ. 33,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ మూడు సంవత్సరాల్లో మొత్తం $10 బిలియన్లకు పైగా కంటెంట్ నిర్మాణంలో ఖర్చు చేయడం ద్వారా, దేశీయంగా గణనీయమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఆస్తుల పుట్టుకకు నాంది పలకనుంది.

అయితే, కంటెంట్ తయారీ పరంగా భారతదేశంలో ఎదురయ్యే సవాళ్లను కూడా ఉదయ్ శంకర్ స్పష్టంగా చెప్పారు. రచయితలు, దర్శకులు, నటులు, టెక్నీషియన్లు వంటి మానవ వనరుల సమస్యలతో పాటు, ఆడియెన్స్ అభిరుచులకు తగిన కంటెంట్ అందించడంలో పలు అడ్డంకులు ఉన్నాయని చెప్పారు. “ఇప్పుడు ప్రేక్షకులు ముందుగా ఆలోచిస్తున్నారు. వారికి సరిపోయే కంటెంట్ అందించాల్సిన బాధ్యత సృష్టికర్తలదే” అని చెప్పారు.

వెబ్‌సిరీస్‌లు, థియేటర్ సినిమాలు, లాంగ్ ఫార్మ్ కంటెంట్‌లతో పాటు, బాలీవుడ్, టాలీవుడ్, ఇతర ప్రాంతీయ పరిశ్రమల్లో కూడా ఈ పెట్టుబడులు ప్రాబల్యం చూపించనున్నాయి. జియోస్టార్ దృష్టి ఇప్పుడు క్వాలిటీ కంటెంట్‌ మీదే కాదు.. దాన్ని ఎక్కువ మందికి చేరవేయడంపైనా ఉంది. భారతదేశం సాంకేతికంగా, సృజనాత్మకంగా గ్లోబల్ స్థాయికి ఎదగాలంటే ఇలాంటి సమర్థవంతమైన ప్రణాళికలు అవసరం. 'జియోస్టార్ మోడల్' ఇప్పుడు మిగతా మీడియా కంపెనీలకు మార్గదర్శిగా మారే అవకాశం కనిపిస్తోంది.

Tags:    

Similar News