కమల్ హాసన్‌కు కూడా రాని అదృష్టం నాకు వచ్చింది: జేడీ చక్రవర్తి

టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు జేడీ చక్రవర్తి. ఆయన ఒక పాత్ర చేస్తున్నారంటే అందులో ఏదో ఒక వెరైటీ ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు.;

Update: 2026-04-23 17:19 GMT

టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు జేడీ చక్రవర్తి. ఆయన ఒక పాత్ర చేస్తున్నారంటే అందులో ఏదో ఒక వెరైటీ ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ హీరోగా వస్తున్న ‘గాయపడ్డ సింహం’ చిత్రంలో జేడీ ‘బ్రూటల్ ధర్మ’ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. మే 1న ఈ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించి, సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

క్యారెక్టర్ పరంగా కమల్ హాసన్‌కు కూడా రాని అదృష్టం తనకు ఈ సినిమాతో దక్కిందని జేడీ చెప్పడం విశేషం. ఈ సినిమాలో తన పాత్ర ఎందుకు స్పెషల్ అనే దానిపై జేడీ క్లారిటీ ఇచ్చారు. సాధారణంగా ఒక పాత్రకు రెండు షేడ్స్ ఉంటే ఫస్ట్ హాఫ్‌లో ఒకటి, సెకండ్ హాఫ్‌లో మరొకటి చూపిస్తుంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం ఒకే లుక్‌లో ఉంటూనే రెండు విభిన్నమైన షేడ్స్ చూపించడం తనను బాగా ఎక్సైట్ చేసిందని తెలిపారు.

ఆ మ్యాజిక్ ఏంటో తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద చూడాల్సిందేనని అన్నారు. స్క్రిప్ట్ వింటున్నంత సేపు తాను నవ్వుతూనే ఉన్నానని, రియలిస్టిక్ హ్యూమర్‌తో సినిమా చాలా ఎంటర్‌టైనింగ్ గా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సినిమా టైటిల్ గురించి మాట్లాడుతూ.. ఇందులో తరుణ్ భాస్కర్, తాను మాత్రమే కాకుండా మరో మూడో సింహం కూడా గాయపడిందని, ఆ సస్పెన్స్ త్వరలోనే రివీల్ చేస్తామని చెప్పారు.

కథ వర్క్ అవుట్ అయితేనే పాత్రలు గుర్తుండిపోతాయని, గతంలో శివ, సత్య సినిమాల్లో తన పాత్రలు అలా నిలబడిపోయాయని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో కూడా ధర్మా క్యారెక్టర్ ప్రేక్షకులను అలరిస్తుందని, పేరు ‘బ్రూటల్’ అని ఉన్నా చేసే పనులు మాత్రం నవ్వు తెప్పిస్తాయని జేడీ వివరించారు. దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ చాలా కాన్ఫిడెంట్ గా సినిమా తీశారని ఆయన ప్రశంసించారు.

సెట్స్‌లో తరుణ్ భాస్కర్, పవన్ సాదినేని లాంటి దర్శకులు ఉన్నప్పటికీ.. తామెవరూ కథలో ఇన్ పుట్స్ ఇవ్వలేదని, కశ్యప్ చెప్పిన దానినే ఫాలో అయ్యామని జేడీ స్పష్టం చేశారు. ఓటీటీ ప్రభావంపై స్పందిస్తూ.. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ ఓటీటీ వరకు ఆగకుండా థియేటర్లకు వచ్చి చూస్తారని, అందుకు ‘లిటిల్ హార్ట్స్’ లాంటి సినిమాలే నిదర్శనమని చెప్పారు. తనకు నటన అంటే ఇష్టమని, హీరో లేదా విలన్ అని కాకుండా కొత్త కథలు వస్తే ఎక్స్‌పెరిమెంటల్ సినిమాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధమేనని ఆయన ప్రకటించారు.

ఇక జేడీ చక్రవర్తి మాటలు వింటుంటే ‘గాయపడ్డ సింహం’లో ఆయన పాత్ర చాలా కొత్తగా ఉండబోతోందని అర్థమవుతోంది. చాలా కాలం తర్వాత జేడీ తన బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే ఒక హిలేరియస్ రోల్‌లో కనిపిస్తుండటం సినిమాకు పెద్ద ప్లస్ కానుంది. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ సమ్మర్ రేసులో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. కేవలం కామెడీ మాత్రమే కాకుండా జేడీ మార్క్ పెర్ఫార్మెన్స్ చూడాలనుకునే వారికి ఈ సినిమా ఒక మంచి ఆప్షన్ అయ్యేలా ఉంది.

Tags:    

Similar News