తండ్రి చనిపోయాక మనవడికి తాత ఫుల్ క్లారిటీ.. అదే ప్లాన్ తో జయకృష్ణ..

తన తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన జయకృష్ణ, కుటుంబంలో జరిగిన ఆ ఎమోషనల్ మూమెంట్ ను గుర్తు చేసుకున్నారు.

Update: 2026-07-23 04:50 GMT

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి హీరోగా రావడం అంటే సాధారణ విషయం కాదు. ఆ ఇంటి నుంచి వచ్చే ప్రతి ఒక్కరిపై ప్రేక్షకులకు ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో తన జీవితంలో కీలక మలుపు ఎలా తిరిగిందో జయకృష్ణ తాజాగా వెల్లడించారు. తన తండ్రి రమేష్ బాబు మరణం తర్వాత తాత కృష్ణ తనకు చెప్పిన మాటలే ఇప్పుడు తన సినీ జర్నీకి బలంగా నిలిచాయని ఆయన తెలిపారు.

తన తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన జయకృష్ణ, కుటుంబంలో జరిగిన ఆ ఎమోషనల్ మూమెంట్ ను గుర్తు చేసుకున్నారు. "మా నాన్న గారు మరణించిన తర్వాత 15 రోజుల పాటు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక తాతయ్య నన్ను పిలిచారు. కూర్చుని దాదాపు అరగంట పాటు నాతో మాట్లాడారు. ఇప్పటి వరకు జీవితం ఒకలా సాగింది.. ఇకపై ఏం చేయాలనే విషయంపై స్పష్టంగా చెప్పారు" అని వెల్లడించారు.

"ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోగా రావడం చిన్న విషయం కాదని, అందుకు తగిన విధంగా సిద్ధం కావాలని చెప్పారు. కేవలం ప్రయత్నం చేస్తున్నాననే ఫీలింగ్ తో కాకుండా, పూర్తి స్థాయిలో రెడీ కావాలని సూచించారు. నీలో హీరోకు కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయని, మంచి ఫ్యూచర్ ఉంటుందని నాపై నమ్మకం కలిగించారు. అమెరికా వెళ్లి యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకోవాలని సలహా ఇచ్చారు" అని జయకృష్ణ పేర్కొన్నారు.

కృష్ణ చేసిన కామెంట్స్ ను సీరియస్‌ గా తీసుకున్న జయకృష్ణ, అనంతరం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌ కు వెళ్లి యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌ లో స్పెషల్ ట్రైనింగ్ పొందారు. అయితే ఆయన జీవితంలో ఒక బాధ మాత్రం ఎప్పటికీ మిగిలిపోయిందని చెబుతున్నారు. అమెరికాలో చదువుకుంటున్న సమయంలోనే 2022 నవంబర్‌ లో కృష్ణ కన్నుమూశారు. వీసా సమస్యల కారణంగా తాతయ్య చివరి చూపు కూడా చూడలేకపోయానని గతంలో పలుమార్లు భావోద్వేగానికి గురయ్యారు.

ఘట్టమనేని కుటుంబానికి తెలుగు సినీ హిస్టరీలో ప్రత్యేక స్థానం ఉందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమకు కౌబాయ్ సినిమాలు, ఈస్ట్‌ మన్ కలర్, 70 ఎంఎం వంటి ఎన్నో కొత్త టెక్నాలజీలను పరిచయం చేశారు. ఆ వారసత్వాన్ని ఇప్పుడు మూడో జనరేషన్ మెంబర్ గా జయకృష్ణ ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దివంగత నటుడు, నిర్మాత రమేష్ బాబు కుమారుడైన జయకృష్ణ, తన తొలి చిత్రం శ్రీనివాస మంగాపురంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఆ చిత్రం 2026 జూలై 30వ తేదీన విడుదల కానుంది. ఇక జయకృష్ణ మాటల్లో చెప్పాలంటే, తండ్రి మరణం తర్వాత తాత కృష్ణ ఇచ్చిన ధైర్యం, చూపించిన దారి తన లైఫ్ ను మార్చేశాయని చెప్పాలి. ఇప్పుడు అదే ప్లాన్‌ తో.. అదే నమ్మకంతో హీరోగా తన జర్నీ ప్రారంభిస్తున్నారు. ఘట్టమనేని వారసత్వానికి తగ్గట్టుగా ఆయన ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది.

Tags:    

Similar News