TFPC ఎన్నికల్లో 'మ‌న ప్యానెల్' హ‌వా.. న‌ట్టి కుమార్ విశ్లేష‌ణ‌

ఇప్పటికే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా సీనియర్ నిర్మాత సి. కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా, మిగిలిన ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు- ఈసీ సభ్యుల పదవుల కోసం తీవ్ర ఉత్కంఠ నడుమ ఎన్నికలు నిర్వహించారు

Update: 2026-09-06 17:02 GMT

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటికే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా సీనియర్ నిర్మాత సి. కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా, మిగిలిన ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు- ఈసీ సభ్యుల పదవుల కోసం తీవ్ర ఉత్కంఠ నడుమ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సీ. కళ్యాణ్, ప్రసన్న కుమార్‌ల నేతృత్వంలోని `మన ప్యానెల్` అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయాన్ని సాధించిందని, ప్రత్యర్థి వర్గంపై క్లీన్ స్వీప్ చేసిందని ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ వెల్లడించారు.

ఎన్నికల ఫలితాల అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన నట్టి కుమార్.. గత మూడున్నర సంవత్సరాలుగా తామందరం కౌన్సిల్ అభివృద్ధి కోసం జాయింట్ సెక్రటరీగా వివిధ బాధ్యతల్లో శ్రమించామని తెలిపారు. ఈసారి `మన ప్యానెల్`, `ప్రోగ్రెసివ్ ప్యానెల్`ల మధ్య పోటీ `నువ్వా-నేనా` అనే రీతిలో అత్యంత ఆసక్తికరంగా సాగిందని పేర్కొన్నారు. అయితే ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా అంతిమంగా నిర్మాత మండలి సంక్షేమాన్ని కాపాడుకోవడమే అందరి ప్రధాన లక్ష్యమని.. ఇక్కడ బయటి వారు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు.

ఫలితాల సరళిని వివరిస్తూ.. ఈ ఎన్నికల్లో సభ్యులందరూ `మన ప్యానెల్` వైపే స్పష్టమైన తీర్పునిచ్చారని నట్టి కుమార్ చెప్పారు. ప్రత్యర్థి `ప్రోగ్రెసివ్ ప్యానెల్` నుంచి కేవలం నలుగురు (ఒక వైస్ ప్రెసిడెంట్, ముగ్గురు ఈసీ మెంబర్లు) మాత్రమే విజయం సాధించగా.. మిగిలిన అన్ని కీలక పదవులను తమ ప్యానెల్ అభ్యర్థులే క్లీన్ స్వీప్ చేశారని స్పష్టం చేశారు. ప్రసన్న కుమార్, సీ. కళ్యాణ్ బృందం సాధించిన ఈ విజయంలో ట్రెజరర్‌గా విజయం సాధించిన శ్రీనివాసరావుకు.. గెలిచిన ప్రతినిధులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

మండలి సభ్యుల సంక్షేమం..హెల్త్ అండ్ మెడిక్లెయిమ్ ఇన్స్యూరెన్స్ సదుపాయాలు .. ఇతర సమస్యల పరిష్కారంలో గెలిచిన ప్రతినిధులకు పూర్తి అవగాహన ఉందన్నారు. సీనియర్ నాయకుడు సి. కళ్యాణ్‌కు కౌన్సిల్ వ్యవహారాలన్నీ సుపరిచితమే కాబట్టి.. ఆర్గనైజేషన్‌ను బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం తమకు ఉందన్నారు. సభ్యుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా కొత్త కార్యవర్గం పనిచేస్తుందని.. ఏవైనా హామీలు నెరవేర్చకపోతే మీడియా ముందే ప్రశ్నించడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.

చివరిగా ప్రోగ్రెసివ్ ప్యానెల్‌పై సభ్యుల్లో ఉన్న అసంతృప్తి వల్లే వారు ఓటమి పాలయ్యారని.. సాధారణ సభ్యుల సంక్షేమానికి పట్టం కట్టాలనే ఉద్దేశంతోనే నిర్మాతలందరూ ప్రసన్న కుమార్, సీ. కళ్యాణ్ నేతృత్వంలోని `మన ప్యానెల్`ను గెలిపించారని నట్టి కుమార్ ముగించారు. మునుముందు రోజుల్లో తెలుగు చలనచిత్ర నిర్మాత మండలిని మరింత బలోపేతం చేసేందుకు గెలిచిన కార్యవర్గం కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గెలుపోటములు స‌హ‌జం.. ఇక్క‌డ అంద‌రూ ఒక‌టేన‌ని అన్నారు.

Tags:    

Similar News