నిర్మాత‌ల మండ‌లి కొత్త అధ్య‌క్షుడి ముందు పెను స‌వాళ్లు!

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (TFPC) 2026-28 నూతన కార్యవర్గ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా జ‌ర‌గ‌గా సాయంత్రం 5 గంట‌ల త‌ర్వాత ఫ‌లితాలు వెలువ‌డ్డాయి.

Update: 2026-09-06 17:21 GMT

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (TFPC) 2026-28 నూతన కార్యవర్గ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా జ‌ర‌గ‌గా సాయంత్రం 5 గంట‌ల త‌ర్వాత ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 1168 మంది సభ్యులకు గాను 643 మంది నిర్మాతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత చేపట్టిన ఓట్ల లెక్కింపులో `మన ప్యానల్`, `ప్రోగ్రెసివ్ ప్యానల్` మధ్య గట్టి పోటీ నెలకొన్నా కీలక పదవుల్లో `మన ప్యానల్` స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఘన విజయాన్ని సాధించింది.

ఇప్పటికే అధ్యక్షుడిగా సి.కల్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా.. తాజాగా వెలువడిన ఫలితాల్లో ట్రెజరర్‌గా చదలవాడ శ్రీనివాసరావు విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్లుగా `మన ప్యానల్` నుంచి మోహన్ వడ్లపట్ల, `ప్రోగ్రెసివ్ ప్యానల్` నుంచి దామోదర్ ప్రసాద్ గెలుపొందారు. జాయింట్ సెక్రటరీలుగా అమ్మిరాజు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఈసీ సభ్యుల విభాగంలోనూ `మన ప్యానల్` దానయ్య, ఏషియన్ సునీల్, శివలెంక కృష్ణప్రసాద్‌ సహా 12 స్థానాలను కైవసం చేసుకోగా, `ప్రోగ్రెసివ్ ప్యానల్` మైత్రీ రవి సహా 3 స్థానాలు పొందింది. అయితే జనరల్ సెక్రటరీ పదవి కోర్టు పరిధిలో ఉంది.

విజయం అనంతరం అధ్యక్షులు సి.కల్యాణ్ మాట్లాడుతూ.. తమ ప్యానెల్‌పై నమ్మకంతో 95 శాతం మద్దతు ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. చదలవాడ శ్రీనివాసరావు సేవా కార్యక్రమాలే ఆయన విజయంలో కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. ముఖ్యంగా సొంత డబ్బుతో సినిమాలు తీసి విడుదలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న చిన్న నిర్మాతల కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నామని... త్వరలోనే దానిని మీడియా ద్వారా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అలాగే తన ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన బండ్ల గణేష్‌కు ధన్యవాదాలు తెలిపారు.

నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ఇలాంటి ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్న చదలవాడను తామే ఒప్పించి బరిలోకి దింపామని... సభ్యులు ఆయనను భారీ మెజారిటీతో గెలిపించారని హర్షం వ్యక్తం చేశారు. ఇక ట్రెజరర్‌గా గెలిచిన చదలవాడ శ్రీనివాసరావు తన విజయానికి నందమూరి తారకరామారావు గారి ఆశీస్సులు, నందమూరి కుటుంబ సపోర్ట్ కారణమని పేర్కొన్నారు. చిన్న నిర్మాతల అభ్యున్నతికి.. ప్రభుత్వాల నుంచి అవసరమైన సహకారాన్ని తీసుకురావడానికి కృషి చేస్తామని, ఎన్నికల హామీలన్నింటినీ నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.

మొత్తానికి `మన ప్యానెల్` సాధించిన ఈ ఘన విజయం నూతన కార్యవర్గంపై ఇండస్ట్రీలో అంచనాలను పెంచింది. గత రెండున్నరేళ్లుగా ఉన్న విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా సాగాల్సిన అవసరం ఉందని నాయకులు స్పష్టం చేశారు. మునుముందు రోజుల్లో చిన్న సినిమాల విడుదల కష్టాలు, ప్రచార వ్యయాలు, నిర్మాతల సంక్షేమ సమస్యలపై ఈ కొత్త టీమ్ ముందు చాలా స‌వాళ్లే ఉన్నాయి. ఎన్నిక‌ల కోలాహాలం స‌మయంలో నేటిత‌రం నిర్మాత‌లు, ప‌రిశ్ర‌మ‌తో సంబంధం లేని నిర్మాత‌ల శ్రేయ‌స్సు, సంక్షేమం కోసం భ‌రోసాను ఇస్తూ చాలా ప్రామిస్ లు చేసిన మ‌న ప్యానెల్ విజేత‌లు వాట‌న్నిటినీ నెర‌వేర్చాల్సిన బాధ్య‌త ఉంది. అలాగే ఇండ‌స్ట్రీలో పారితోషికాలు స‌హా చాలా విష‌యాల‌లో స‌మ‌స్య‌లు అలానే ఉన్నాయి. వీట‌న్నిటినీ మించి ఏఐ (కృత్రిమ మేధ‌స్సు) రోజు రోజుకు బ‌లం పెంచుకుంటున్న ఈ స‌మ‌యంలో ఇండ‌స్ట్రీలో ఉపాధి క‌రువ‌వ్వ‌కుండా కార్మికులు, సాంకేతిక నిపుణుల ప‌నితీరు మెరుగుద‌ల కోసం ఎలాంటి ప‌థ‌కాల్ని అమ‌లు చేస్తారో చూడాలి. చిన్న నిర్మాత‌లు రోడ్డున ప‌డ‌కుండా వారి సినిమాల విష‌యంలో స్క్రిప్టు ద‌శ నుంచే అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల స‌హాయ‌స‌హ‌కారాల్ని అందించాల్సి ఉంటుంది. కొత్త కార్య‌వ‌ర్గం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News