మోక్షజ్ఞ ఎంట్రీ.. డైరెక్టర్ మారినా జోన్ మారలేదా!
మోక్షజ్ఞ ఎంట్రీపై ఎట్టకేలకు మరోసారి అధికారిక క్లారిటీ వచ్చింది. ఈసారి వశిష్ఠ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా చేయబోతోంది
మోక్షజ్ఞ ఎంట్రీపై ఎట్టకేలకు మరోసారి అధికారిక క్లారిటీ వచ్చింది. ఈసారి వశిష్ఠ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా చేయబోతోంది. పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణతో కలిసి దర్శకుడు, నిర్మాతలు ఉన్న ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. కానీ ఈ అనౌన్స్‌మెంట్‌లో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. రెండేళ్ల కిందట మోక్షజ్ఞను లాంచ్ చేయాల్సిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు వశిష్ఠ. ఇద్దరి సినిమాల జోన్ చూస్తే మాత్రం సెలక్షన్ పూర్తిగా మారినట్టు లేదు.
ప్రశాంత్ వర్మతో అనుకున్న తొలి సినిమా రెగ్యులర్ లవ్ స్టోరీ మాస్ ఎంటర్‌టైనర్ కాదు. మైథాలజీ టచ్ ఉన్న సోషియో ఫాంటసీ కథగా అప్పట్లో టాక్ వచ్చింది. ‘హనుమాన్’ తర్వాత ప్రశాంత్ వర్మ చేతిలో మోక్షజ్ఞ ఎంట్రీ అంటే ఆ ప్రపంచం ఎలా ఉంటుందన్న క్యూరియాసిటీ కూడా వచ్చింది. సినిమా అనౌన్స్ అయినా తర్వాత ముందుకు వెళ్లలేదు.
ఇప్పుడు వచ్చిన వశిష్ఠ కూడా దాదాపు అదే జోన్ లో వెళ్ళే దర్శకుడు. మొదట ‘బింబిసార’ చేశాడు. టైమ్ ట్రావెల్, ఫాంటసీని కమర్షియల్ కథలో పెట్టి కళ్యాణ్ రామ్‌కు మంచి హిట్ ఇచ్చాడు. ప్రస్తుతం చిరంజీవితో ‘విశ్వంభర’ చేస్తున్నాడు. ఇది కూడా ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ. అంటే మోక్షజ్ఞ కోసం మళ్లీ పూర్తిగా రెగ్యులర్ జోన్‌లో ఉన్న దర్శకుడిని తీసుకోలేదు. పెద్ద ప్రపంచాన్ని కథలో హైలెట్ చేయగల దర్శకుడినే బాలయ్య ఎంచుకున్నాడు.
ఇక్కడ మోక్షజ్ఞ వయసు కూడా ఒక పాయింట్. ఇప్పుడు 32 ఏళ్లు. టీనేజ్ లవ్ స్టోరీతోనో, కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌తోనో హీరోగా పరిచయం చేసే అవసరం లేదు. మొదటి సినిమాకే కొంచెం మెచ్యూర్ క్యారెక్టర్, బలమైన ప్రపంచం ఉంటే ఆయనకు సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే లాంచ్ ఆలస్యమైనా కథ సెలక్షన్ మాత్రం మరింత ఇంపార్టెంట్ అయింది.
పైగా ఈసారి నిర్మాణ బాధ్యత మైత్రీ చేతికి వెళ్లింది. పెద్ద హీరోల సినిమాలతో పాటు కొత్త కాంబినేషన్లను కూడా హ్యాండిల్ చేసిన బ్యానర్ ఇది. మోక్షజ్ఞ మొదటి సినిమా కాబట్టి భారీగా చూపించాలనే ఒత్తిడి సహజం. కానీ స్కేల్ కోసం కథను పెంచడం కంటే, మొదటి సినిమాతోనే ఒక క్యారెక్టర్ గుర్తింపు ఇవ్వాలి. ప్రశాంత్ వర్మ నుంచి వశిష్ఠకు డైరెక్టర్ మారిపోయాడు. కానీ ఇద్దరిలోనూ ఫాంటసీ, మైథాలజీ, పెద్ద కథా ప్రపంచాల అనుభవం ఉండటం మాత్రం కామన్. అందుకే మోక్షజ్ఞ మొదటి సినిమాపై ఎనౌన్స్ మెంట్ తోనే బజ్ పెరిగింది. ఇక చివరకు ఏ జానర్‌లోకి వెళ్తుందన్నది ఇప్పుడు చూడాల్సిన అసలు పాయింట్. మైత్రీ త్వరలో కాస్ట్, టెక్నికల్ టీమ్ వివరాలు ప్రకటించనుంది.