పెళ్లిపై యువతకు జయాబచ్చన్ సలహా.. పెళ్లి ఢిల్లీ లడ్డూ వంటిదంటూ!
తాజాగా "వి ది విమెన్"అనే కార్యక్రమంలో పాల్గొన్న జయా బచ్చన్ తన మనవరాలు నవ్యా నవేలి నందా పెళ్లి గురించి మాట్లాడారు.;
జయాబచ్చన్.. ప్రముఖ నటిగా, రాజకీయ నాయకురాలిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు రకాల విషయాలపై స్పందిస్తూ ఉంటారు. అంతేకాదు సమాజానికి సంబంధించిన పలు అంశాలపై కూడా స్పందించే ఈమె.. తాజాగా పెళ్లి గురించి యువతకు ఇచ్చిన సలహాలు విని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి అనేది ఢిల్లీ లడ్డూ వంటిది అని.. తిన్నా తినకపోయినా సమస్యే అంటూ చెప్పి అందరిని ఆలోచింపజేశారు జయాబచ్చన్. మరి జయాబచ్చన్ యువతకు పెళ్లి విషయంలో ఏ విధంగా సలహాలు ఇచ్చారు అనే విషయం ఇప్పుడు చూద్దాం.
తాజాగా "వి ది విమెన్"అనే కార్యక్రమంలో పాల్గొన్న జయా బచ్చన్ తన మనవరాలు నవ్యా నవేలి నందా పెళ్లి గురించి మాట్లాడారు. జయా బచ్చన్ మాట్లాడుతూ.."నేటితరం పిల్లలకు మనం ఎలాంటి సలహాలు ఇవ్వలేము. ఒకప్పటితో పోల్చుకుంటే పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా పిల్లలు ప్రతి ఒక్కరు కూడా చాలా తెలివైన వారు. అన్ని విషయాలలో చాలా చక్కగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా వివాహం విషయంలో ఇలాగే ఉండాలి అని చట్టబద్ధమైన నిర్వచనాలు లేవు. పైగా అలా నిర్వచించాల్సిన అవసరం కూడా లేదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలు.
ముఖ్యంగా పెళ్లి అనేది ఢిల్లీ లడ్డు వంటిది. తిన్నా తినకపోయినా సమస్యే. అందుకే యువతకు ఇప్పుడే పెళ్లి చేసుకోమని మాత్రం నేను సలహా ఇవ్వను. ముఖ్యంగా నా మనవరాలు నవ్య ఇప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలి. ఆమెకు మరికొన్ని రోజుల్లో 28 సంవత్సరాలు నిండుతాయి.. ముందు జీవితాన్ని ఎంజాయ్ చేయమని మాత్రమే చెబుతాను" అంటూ జయాబచ్చన్ పెళ్లిపై యువతకు సలహాలు ఇచ్చింది. ఇక ప్రస్తుతం జయా బచ్చన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
నవ్య నవేలి విషయానికి వస్తే.. అమితాబ్ బచ్చన్ - జయా బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్ కూతురైన నవ్య.. ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. జెండర్ ఈక్వాలిటీ కోసం పనిచేస్తోంది. ఐఐఎం అహ్మదాబాద్ లో బిజినెస్ డిగ్రీ పూర్తి చేసిన నవ్య.. తన తాత, తండ్రి స్థాపించిన.. అగ్రికల్చర్ పరికరాలు తయారు చేసే Escorts Kubota limited అనే తమ కంపెనీలో మూడేళ్ల పాటు ఇంటర్న్ షిప్ కూడా పూర్తి చేసింది. ముఖ్యంగా తండ్రి , తాత లాగే అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేయాలని.. బిజినెస్ లో ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.
ఇప్పటికే బిజినెస్ లో పలు అవార్డు కూడా అందుకున్న నవ్య తన తండ్రి కంపెనీలో 0.02% స్టాక్స్ కూడా కలిగి ఉంది. దీని విలువ సుమారుగా ఏడున్నర కోటికి పైగానే ఉంటుందని సమాచారం. అంతేకాదు ఈమె తండ్రి ఫార్మా ట్రాక్టర్స్ అనే కంపెనీని కూడా నిర్వహిస్తున్నారు.