మనోళ్ల మాస్ ఫాలోయింగ్ చూసి షాక్ అయిన జపాన్!
తెలుగు సినిమా ఖ్యాతి ఇప్పుడు ఖండంతరాలు దాటి విస్తరిస్తోంది. ఒకప్పుడు మన సినిమాలు కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం అనుకునేవారు.;
తెలుగు సినిమా ఖ్యాతి ఇప్పుడు ఖండంతరాలు దాటి విస్తరిస్తోంది. ఒకప్పుడు మన సినిమాలు కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం అనుకునేవారు. కానీ బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా జపాన్ దేశంలో మన సినిమాలకు, మన హీరోలకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. లేటెస్ట్ గా ఒక ప్రముఖ జపాన్ వార్తా పత్రిక మన టాలీవుడ్ 'అభిమాన సంస్కృతి' మీద ఒక ప్రత్యేకమైన కథనాన్ని ప్రచురించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
అందులో వారు రాసిన విషయాలు మన స్టార్స్ స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పేలా ఉన్నాయి. ఆ పత్రికలో మన టాలీవుడ్ అగ్ర హీరోల పేర్లను కూడా ప్రస్తావించారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు అక్కడ ఉన్న ఫాలోయింగ్ చూసి వారు ఆశ్చర్యపోతున్నారు. వీరిని ఇక్కడ అభిమానులు కేవలం సినిమా నటులుగా మాత్రమే చూడరని, దాదాపు 'దైవ సమానమైన ఆదరణ' ఇస్తారని, దేవుళ్లుగా ఆరాధిస్తారని ఆ ఆర్టికల్ లో విశ్లేషించారు.
ఒక మనిషిని ఇంతలా ప్రేమించడం, పూజించడం అనేది జపాన్ వాళ్లకు ఒక కొత్త వింత అనుభూతిని కలిగిస్తోందన్నమాట. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ అభిమానం అనేది కేవలం ఒక తరం ప్రేక్షకులతో ఆగిపోలేదట. తాతల కాలం నుంచి మనవళ్ల వరకు.. ఇలా 'తరాల తరబడి' ఈ అభిమాన గణం కొనసాగుతోందని వారు గుర్తించారు. ఒక హీరో ఫ్యామిలీ నుంచి వారసుడు వస్తే, ఆ అభిమానం కూడా వారసత్వంగా బదిలీ అవ్వడాన్ని వారు ఎంతో ఆసక్తిగా గమనించారు.
ఇది మనకు అలవాటే అయినా, బయటి ప్రపంచానికి మాత్రం ఇదొక విచిత్రమైన ఎమోషన్. ఇక సినిమా విడుదల సమయాన్ని మన వాళ్ళు ప్లాన్ చేసుకునే విధానం గురించి కూడా ఆ పత్రికలో రాసుకొచ్చారు. సినిమా రిలీజ్ లను మన 'ప్రాంతీయ పండుగలతో' ముడిపెట్టి చూస్తారని పేర్కొన్నారు. అంటే సంక్రాంతి, దసరా లాంటి పండుగలకు సినిమాలు విడుదల చేయడం, ఆ సమయంలో థియేటర్ల వద్ద వాతావరణం పండుగను మించిపోవడం వారిని ఆకర్షించింది. సినిమా అంటే కేవలం వినోదం కాదు, అదొక వేడుక అని వారు అర్థం చేసుకున్నారు.
అలాగే సినిమా విడుదలకు ముందు జరిగే ప్రమోషన్ ఈవెంట్స్ గురించి కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. ఆడియో లాంచ్ ఈవెంట్స్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లు ఒక కన్నుల పండుగలా ఉంటాయని, అవి చూడటమే ఒక గొప్ప అనుభవమని కితాబిచ్చారు. వేల సంఖ్యలో అభిమానులు ఈ ఈవెంట్లకు హాజరవ్వడం, తమ హీరోని చూసి కేరింతలు కొట్టడం అనేది ఒక గ్రేట్ ఎక్స్ పీరియన్స్ గా వారు రాశారు.
చివరగా, ఎస్.ఎస్. రాజమౌళి వారణాసి ని కూడా ప్రస్తావిస్తూ, ఆయన సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ లు లేదా ఈవెంట్స్ జరిగినప్పుడు ఈ సందడి పీక్స్ లో ఉంటుందని అన్నారు. మొత్తానికి జపాన్ పేపర్లో మన హీరోల గురించి ఇలాంటి ఆర్టికల్స్ వస్తున్నాయంటే టాలీవుడ్ రేంజ్ ఏ లెవెల్లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.