''ఇంకా నయం అమరేంద్ర బాహుబలి జై అనలేదు''.. జాన్వీపై పంచ్‌లు!
ఈ ఏడాది ఎప్పటిలానే శ్రీకృష్ణ జన్మాష్ఠమి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా సాగాయి.;
ఈ ఏడాది ఎప్పటిలానే శ్రీకృష్ణ జన్మాష్ఠమి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా సాగాయి. ఆగస్టు 15-17 మధ్య మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో ఆగస్టు 16న ప్రధానమైన జన్మాష్ఠమి పండగ. ఆరోజు ప్రత్యేకంగా వెన్నకుండ (బటర్ పాట్ బ్రేకింగ్) పగులగొట్టడం, పెరుగు కుండ (దహీ హండి) పగులగొట్టడం సహా సాంస్కృతిక కార్యక్రమాలు, కీర్తన్స్, భజన్స్, విద్యార్థుల కోసం కాంపిటీషన్స్ వంటి ఆచారాలతో దేవాలయాల్లో సందడి నెలకొంది. పిల్లలు పెద్దలు అందరూ సరదాగా ఈ ఉత్సవాలను ఆనందించారు. అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ, షాహిద్ కపూర్- మీరా రాజ్ పుత్, హేమమాలిని కుటుంబం, ఉత్తరాదిన ఉన్న సింధీ కుటుంబాలు సహా చాలా మంది సెలబ్రిటీలు శ్రీకృష్ణ జన్మాష్ఠమిని ప్రత్యేకంగా జరుపుకుంటారు.
అయితే శ్రీకృష్ణ జన్మాష్ఠమి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాల్లో పరిమితంగా కనిపించినా కానీ, మెట్రో అర్బన్ ప్రాంతాల్లో దీనికి అంతో ఇంతో ప్రాధాన్యత అయితే ఉంది. స్కూల్, కాలేజెస్ లో ఈ ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. జన్మాష్ఠమి భారతీయ సాంప్రదాయం సంస్కృతిని అత్యుత్తమ రీతిలో ప్రదర్శించే ఒక ఉత్సవం.
ఇప్పుడు మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన 'దహి హండి' కార్యక్రమంలో జాన్వీ కపూర్ అతిథిగా పాల్గొన్నారు. ఆగస్టు 29 న విడుదల కానున్న తన సినిమా `పరమ్ సుందరి` ప్రచారంలో భాగంగా ఈ ఉత్సవాల్లో జాన్వీ సందడి చేసారు. వేడుకలో దహీ హండి మట్కీని పగులగొట్టే అవకాశం తనను వరించింది. కానీ ఆ సమయంలో జాన్వీ పండగ ప్రాశస్త్యంతో సంబంధం లేకుండా, `భారత్ మాతా కీ జై` అంటూ నినదించడం ఆన్‌లైన్ లో మీమ్ ఫెస్ట్ కి దారి తీసింది. చాలామంది జాన్వీ కపూర్ నినాదాన్ని విమర్శించారు.
ముంబైలోని ఘాట్కోపర్‌లో జరిగిన ఎమ్మెల్యే రామ్ కదమ్ దహి హండి కార్యక్రమంలో ఈ నినాదం హాస్యాస్పదం అయింది. కొబ్బరికాయను ఉపయోగించి మట్కిని పగులగొట్టిన తర్వాత 'భారత్ మాతా కీ జై' అని జాన్వీ నినదించింది. అయితే ఈ నినాదం స్వాతంత్య్ర దినోత్సవ నినాదమా? మీరు స్వాతంత్య్ర దినోత్సవానికి హాజరయ్యారా? అంటూ కొందరు జాన్వీని ఆటపట్టించారు. ఆ సమయంలో ఏమి చెప్పాలో తెలియక జాన్వీ అలా నినదించింది. ఇందులో ఎలాంటి వివాదం లేదు. అయినా నెటిజనులు మాత్రం యువనటిని ఆటపట్టించడంలో నిమగ్నమయ్యారు.
''అచ్ఛా హువా అమరేంద్ర బాహుబలి నహీ బోలి'' అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించాడు. అమరేంద్ర బాహుబలి జై అని నినదిస్తే బావుండేది! అని ఒక నెటిజన్ కామెంట్ చేసాడు. అయితే ఈ వ్యాఖ్యలను జాన్వీ పట్టించుకునే మూడ్ లో లేదు. ప్రస్తుతం పరమ్ సుందరి ప్రమోషన్స్ మాత్రమే తన లక్ష్యం. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దినేష్ విజన్ నిర్మాత. ఇందులో జాన్వీ కపూర్ - సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన జంటగా నటించారు.