అశ్లీల‌త‌- డీప్‌ఫేక్ దుర్మార్గంపై కోర్టులో క‌పూర్ సిస్ట‌ర్స్ అపూర్వ విజ‌యం!

బాలీవుడ్ నటీమణులు, దివంగత శ్రీదేవి-బోనీ కపూర్ కుమార్తెలైన జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది.

Update: 2026-08-13 08:41 GMT

బాలీవుడ్ నటీమణులు, దివంగత శ్రీదేవి-బోనీ కపూర్ కుమార్తెలైన జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. సోషల్ మీడియాల‌లో కొన్ని అసాంఘీక వెబ్ పోర్ట‌ల్స్ లో ఆ ఇద్ద‌రి అశ్లీల- అస‌భ్య‌క‌ర ఫోటోలు, ఏఐ వీడియోలు అప్‌లోడ్ అయి ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ వ్య‌వ‌హారంలో కోర్టులో విచార‌ణ సాగ‌గా జాన్వీ-ఖుషి అపూర్వ‌మైన మ‌ద్ధ‌తును ద‌క్కించుకున్నారు. వారి పేరు, ఫోటోలను ఉపయోగించి ప్రసారం చేస్తున్న అశ్లీల, అవమానకరమైన కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని.. అనుమతి లేకుండా వారి పేర్లతో వ్యాపార ప్రకటనలు చేయడాన్ని నిరోధించాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను కోర్టు ఆదేశించింది. ఖుషీ కపూర్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ జ్యోతి సింగ్... భవిష్యత్తులో అనామక వ్యక్తులు ఎవరైనా ఈ హక్కులను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునేలా `జాన్ డో` ఉత్తర్వులను జారీ చేశారు. సోద‌రి జాన్వీక‌పూర్ కోర్టులో విజ‌యం సాధించిన అనంత‌రం ఖుషీక‌పూర్ కూడా ఇదే త‌ర‌హా తీర్పును త‌న‌కు అనుకూలంగా సాధించ‌డం గ‌మ‌నార్హం.

అయితే ఇదే సమయంలో సెలబ్రిటీ పర్సనాలిటీ రైట్స్ .. సోషల్ మీడియా ఫ్యాన్ పేజీల సరిహద్దులపై జస్టిస్ అనూప్ జైరామ్ భాంబానీ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. కపూర్ సోదరీమణులు అశ్లీల కంటెంట్‌తో పాటు తమ పేర్లతో ఉన్న అన్ని రకాల ఫ్యాన్ పేజీలను, క్లబ్‌లను కూడా నియంత్రించాలని కోరగా కోర్టు దానికి నిరాకరించింది. చట్టపరంగా ఒక హద్దు రేఖను గీయడం అవసరమని... పబ్లిక్ డొమైన్‌లో ఉన్న ప్రజాప్రతినిధులు లేదా సినీ నటులపై వచ్చే విమర్శలు, సటైర్లు లేదా సాధారణ ఫ్యాన్ క్లబ్‌లను పూర్తిగా మూసివేయడం సాధ్యం కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

న్యాయమూర్తి తన వ్యాఖ్యలలో... మనం చట్టపరంగా ఎంతవరకు సరిహద్దు రేఖను గీయగలమో ఆలోచించాలి. అశ్లీలత.. వాణిజ్యపరమైన దుర్వినియోగం లేదా వ్యక్తిగత హక్కుల భంగాన్ని కోర్టులు ఏమాత్రం సహించవు. కానీ కేవలం సెలబ్రిటీ హోదాను అడ్డుపెట్టుకుని తమపై వచ్చే విమర్శలను లేదా అన్ని ఫ్యాన్ పేజీలను నిరోధించాలనుకోవడం సరికాదు. ఈ రోజుల్లో పబ్లిక్ లైఫ్‌లో ఉన్న ఎవరికైనా... ఆఖరికి న్యాయమూర్తులకు కూడా ఆన్‌లైన్ విమర్శలు తప్పడం లేదు! అని పర్సనాలిటీ రైట్స్ దుర్వినియోగాన్ని ఎత్తిచూపారు.

ఈ విచారణ ద్వారా బాలీవుడ్‌లో నటీనటుల `ప్రైవసీ`, `డిజిటల్ హక్కుల` పై సరికొత్త చర్చ మొదలైంది. ఒక వైపు నటీనటుల రూపాన్ని.. స్వరాన్ని... పేర్లను అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు లేదా అశ్లీల కంటెంట్‌కు ఉపయోగించకుండా రక్షణ కల్పిస్తూనే... మరో వైపు అభిమానుల హక్కులకు.. ఆరోగ్యకరమైన విమర్శలకు... సటైర్లకు అడ్డంకి లేకుండా కోర్టు భరోసానిచ్చింది. ఇటీవల వీరి సోదరి అన్షులా కపూర్ వివాహ వేడుకల్లో కలిసి కనిపించిన ఈ సోదరీమణులు ప్ర‌స్తుతం గ్లామ‌ర్ ప్ర‌పంచంలో బిజీ నాయిక‌లుగా మెరిసిపోతున్నారు. ఆ ఇద్దరూ తమ వ్యక్తిగత గౌరవానికి భంగం కలగకుండా ఈ చట్టపరమైన పోరాటాన్ని సాగించి చివ‌రికి విజ‌యం సాధించారు.

Tags:    

Similar News