జాన్వీ ఆవేదనలో అర్థం ఉంది..!

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-12-02 12:30 GMT

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఆకట్టుకునే అందంతో పాటు ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉండటంతో జాన్వీ కపూర్ కి సినిమా ఆఫర్లకి కొదవలేదు. బాలీవుడ్ నుండి ఇప్పటి వరకు ఆమెకి సక్సెస్ దక్కలేదు, అయినప్పటికీ వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. అయితే కేవలం నెపోకిడ్ కావడం వల్లే కాకుండా ఆమె తన అందంతో ఆకట్టుకుంటున్న కారణంగా కూడా అవకాశాలు వస్తున్నాయి అనేది కొందరి అభిప్రాయం. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ సమాంతరంగా సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్తో కలిసి బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమంలో ఇటీవల జాన్వీ కపూర్ పాల్గొంది. జాన్వీ కపూర్ గతంలో మీడియాపై అసహనం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి జాన్వీ కపూర్ మీడియాపై అసహనం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.

బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర...

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఇటీవలే మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణ వార్తలను కొన్ని మీడియా వర్గాల వారు ప్రముఖంగా ప్రచారం చేశాయి. అయితే అందులో తప్పేం లేదు కానీ ఆయనకి సంబంధించిన కొన్ని తప్పుడు విషయాలను మీడియాలో ప్రముఖంగా ప్రచారం చేశారు అనేది ఇండస్ట్రీ వర్గాల వారి ఆరోపణ. తాజాగా జాన్వీ కపూర్ అదే విషయాన్ని లేవనెత్తింది. తన తల్లి శ్రీదేవి చనిపోయిన సమయంలో తప్పుడు వార్తలతో జనాలను తప్పు ద్రోవ పట్టించే ప్రయత్నం చేశారు, ఇప్పుడు అదే విధంగా ధర్మేంద్ర గారు చనిపోయిన విషయంలోనూ మీడియా తప్పుడు వార్తలను వండి వడ్డించే ప్రయత్నాలు చేస్తుందని జాన్వీ కపూర్ ఆరోపించింది. ఒకవైపు వ్యక్తి చనిపోయిన బాధలో కుటుంబం ఉంటే మరోవైపు మీడియాలో వచ్చిన కథనాలతో వారు తీవ్ర ఆవేదనకి గురవుతున్నారని జాన్వీ తన ఆవేదనని వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఎవరికి తోచిన విధంగా వారు చనిపోయిన వారి గురించి మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్ కాదని ఆమె సీరియస్ గా కామెంట్ చేసింది.

శ్రీదేవి చనిపోయిన సమయంలో...

జాన్వీ కపూర్ ఇంకా మాట్లాడుతూ.. నా తొలి సినిమా విడుదల కాకముందే అమ్మ చనిపోయింది. ఆమె గురించి సినిమా ప్రమోషన్ సమయంలో మాట్లాడినా కూడా కొందరు విమర్శించారు. ఆ ట్రోల్స్ నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. నేను ఇండస్ట్రీలోకి రావడానికి కొన్ని నెలల ముందు అమ్మ చనిపోవడంతో ఆమె గురించి ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవడం జరిగింది, దాన్ని కూడా కొందరు తప్పుపడుతూ విమర్శలు చేయడం చాలా బాగా అనిపించింది. అప్పుడు నేను ఏం మాట్లాడినా కూడా కొందరు విమర్శించడానికి రెడీగా ఉండేవారు. దాంతో నేను కొన్నాళ్ల పాటు మీడియాకి దూరంగా ఉన్నాను. సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా ఉండేదాన్ని కాదు. ఆ కారణాల వల్ల నేను ఆ బాధని తప్పించుకోగలిగాను. ఒక తల్లి చనిపోతే కూతురు బాధపడితే దాన్ని కూడా కొందరు ట్రోల్ చేయడం దారుణం అనిపించింది. అప్పుడు అమ్మ చనిపోయినప్పుడు ఎలా అయితే మీడియా వ్యవహరించిందో ఇప్పుడు ధర్మేంద్ర గారు చనిపోయిన సమయంలో కూడా మీడియా అలాగే వ్యవహరిస్తుందని జాన్వీ కపూర్ అసహనం వ్యక్తం చేసింది.

సోషల్ మీడియాపై జాన్వీ కపూర్..

కేవలం శ్రీదేవి, ధర్మేంద్ర విషయంలోనే కాకుండా చాలా మంది సెలబ్రిటీల విషయంలో ఇలా జరుగుతుందని జాన్వీ కపూర్ ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడింది ఆమె మాటల్లో అర్థం ఉందని, తల్లి చనిపోయిన సమయంలో ఆమె పడ్డ మానసిక క్షోభ తో పాటు సోషల్ మీడియాలో ఆమెపై వచ్చిన ట్రోల్స్ ఆమెను మరింతగా ఇబ్బంది పెట్టాయి అని సన్నిహితులు అంటున్నారు సోషల్ మీడియాలో ఆమెకు మద్దతుగా నిలిచిన వారు ఇప్పుడు ఆమె వ్యాఖ్యలను షేర్ చేస్తూ మీడియా విషయంలో తమ అసహనం వ్యక్తం చేస్తూ సమాధానం ఇస్తున్నారు. జాన్వీ కపూర్ ఈ విషయం గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదని మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలను జనాలు నమ్మే రోజులు ఎప్పుడో పోయాయి అంటూ ఆమె అభిమానులు ఇంకా శ్రేయోభిలాషులు ఆమెకి సూచిస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల పై ఫోకస్ పెట్టాలి కానీ మీడియాలో వస్తున్న విమర్శల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రామ్ చరణ్, బుచ్చిబాబు పెద్ది సినిమా...

ఇక జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే ఈ సంవత్సరం ఆమె నుండి వరుసగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. హిందీలో ఈమె నటించిన సినిమాలు ఇంతకు ముందు మాదిరిగానే నిరాశ పరిచాయి. తప్పకుండా విజయం సాధిస్తాయి అనుకున్న సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడ్డాయి. అయినా కూడా జాహ్నవి కపూర్ ఏమాత్రం తగ్గలేదు, వరుస సినిమాలతో వచ్చే ఏడాది వచ్చేందుకు రెడీ అవుతుంది. ముఖ్యంగా ఈమె నటిస్తున్న రామ్ చరణ్ పెద్ది సినిమా విషయంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఉప్పెన వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించి సక్సెస్ దక్కించుకున్న సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. పైగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్న నేపథ్యంలో పెద్ది సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసాన్ని ప్రతి ఒక్కరి వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో ఈమె నటించిన దేవర సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. పైగా ఆ సినిమాలోని పాత్ర విషయంలోనూ విమర్శలు ఎదుర్కొంది. కనుక పెద్ది సినిమా పై జాన్వీ కపూర్ మరియు ఆమె అభిమానులు చాలా ఆశలు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News