ఫ్యాన్స్ పేజీల‌ను బ్లాక్ చేస్తే 'హీరోయిన్‌'లు గుహ‌లోకి వెళ్లిన‌ట్టే.. హైకోర్టు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు!

జాన్వీ కపూర్ తన పేరు, రూపం, గొంతును అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారంటూ దాదాపు 5000 పైగా వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలపై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు.

Update: 2026-08-12 04:16 GMT

అందాల‌ నటి జాన్వీ కపూర్ పర్సనాలిటీ రైట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకంపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిని ఇటీవలి తీర్పు డిజిటల్ యుగంలో భావప్రకటన స్వేచ్ఛకు, వ్యక్తిగత హక్కులకు మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చూపిస్తోంది. AI సాంకేతికతతో రూపొందించిన అసభ్యకర కంటెంట్, అనుమతి లేని వ్యాపార ప్రకటనలను అరికడుతూనే.. మరోవైపు సెలబ్రిటీల అభిమానుల స్వేచ్ఛను కోర్టు సమర్థించింది. సాంకేతికత పెరిగిన వేళ సైబర్ చట్టాలు, సెలబ్రిటీల డిజిటల్ భద్రతపై ఈ తీర్పు చర్చనీయాంశంగా మారింది.

జాన్వీ కపూర్ తన పేరు, రూపం, గొంతును అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారంటూ దాదాపు 5000 పైగా వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలపై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు. వీటిలో ముఖ్యంగా ఏఐ తో క్రియేట్ చేసిన మార్ఫింగ్ -డీప్‌ఫేక్ అశ్లీల ఫోటోలు, వీడియోలు.. త‌న‌ పేరుతో సాగుతున్న నకిలీ బుకింగ్ ఏజెన్సీలు ... కమర్షియల్ చాట్‌బాట్‌లను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాళ్లు తన ఇమేజ్‌ను వాడుకుని వ్యాపారాలు చేస్తున్నారని.. దీనివల్ల తన వ్యక్తిత్వ హక్కులకు తీవ్ర భంగం కలుగుతోందని జాన్వీ తరఫు న్యాయవాదులు వాదించారు.

అయితే ఈ విజ్ఞప్తిపై విచారణ జరిపిన జస్టిస్ అనూప్ జైరామ్ భంభానీ పూర్తి స్థాయిలో అన్ని ఖాతాలపై నిషేధం విధించేందుకు నిరాకరించారు. జాన్వీ దాఖలు చేసిన పిటిషన్ పరిధి చాలా పెద్దదిగా ఉందని.. కేవలం అసభ్యకరమైన, డీప్‌ఫేక్ .. ఆమోదయోగ్యం కాని వాణిజ్య ప్రకటనల లింకులను మాత్రమే ప్రత్యేకంగా పట్టిక రూపంలో అందజేయాలని ఆదేశించారు. ఆ పరిమిత కేటగిరీలోని వెబ్‌సైట్లు, పోస్టులను వెంటనే తొలగించేందుకు కోర్టు సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేసింది.

అదే సమయంలో ఫ్యాన్ పేజీలు, పేర‌డీ ఖాతాలపై నిషేధం విధించాలన్న విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. సెలబ్రిటీల జీవితంలో అభిమానుల పేజీలు కీలక పాత్ర పోషిస్తాయని.. కొందరు ప్రశంసించవచ్చు.. మరికొందరు విమర్శించవచ్చు లేదా సరదాగా వ్యాఖ్యానించవచ్చని కోర్టు పేర్కొంది. మేము దేశానికి నైతిక పరిరక్షకులం కాదు! అని వ్యాఖ్యానించిన న్యాయమూర్తి... డిజిటల్ ప్రపంచంలో జీవిస్తూ ఫ్యాన్ పేజీలన్నింటినీ మూసివేయమనడం పబ్లిక్ ఫిగర్లను ఒక `గుహలో బందీలుగా` ఉంచడమే అవుతుందని స్పష్టం చేశారు.

అంతేకాకుండా... ముందస్తుగా భవిష్యత్తులో వచ్చే కొత్త లింకులను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసే `డైనమిక్ ఇంజంక్షన్` ఇవ్వడానికి కూడా కోర్టు నిరాకరించింది. ఇంటర్నెట్‌లో ఒక ప్రముఖ వ్యక్తి గురించి ప్రజలు ఎలా మాట్లాడుకోవాలో అంతిమంగా నియంత్రణ కోరడం ఆచరణాత్మకం కాదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. చివరికి సైబర్ వేధింపుల నుంచి సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కులను కాపాడుతూనే... సాధారణ అభిమానుల భావప్రకటన స్వేచ్ఛను దెబ్బతీయకూడదనే ఒక సమతుల్యమైన తీర్పును ఢిల్లీ హైకోర్టు వెలువరించింది.

Tags:    

Similar News