బుచ్చిబాబు ఇండియా రౌడీ డైరెక్టరా? జాన్వీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
తాజాగా ముంబైలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇప్పుడు టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ.. హిందీలో వరుస సినిమాలు చేస్తున్నారు. అదే సమయంలో తెలుగు సినిమాలపై కూడా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే దేవర సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ.. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటిస్తున్న పెద్ది సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఆ భారీ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ముంబైలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేదికపైకి వెళ్లే ముందు ఆమె నమస్కారం చేస్తూ మొక్కిన తీరు అభిమానులను ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా మాట్లాడిన జాన్వీ.. "నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ట్రైలర్ కు వస్తున్న స్పందన పట్ల చాలా ఆనందంగా ఉంది. సినిమాలో నా పాత్రకు ప్రధాన కారణం బుచ్చి సర్. ఆయన ఇండియాలో రౌడీ డైరెక్టర్ బుచ్చిబాబు. ప్రతి సీన్ విషయంలో ఎంతో ప్యాషన్ తో పనిచేస్తారు. ఈ సినిమాలో నేను నా బెస్ట్ ఇచ్చానని అనుకుంటున్నా" అని తెలిపారు.
అలాగే ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ గురించి మాట్లాడుతూ.. "రెహమాన్ సర్ తో రెండోసారి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను" అని చెప్పారు. ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. "ఆయనతో కలిసి నటించడం నా జీవితంలో బెస్ట్ మూమెంట్. ఆయన చాలా మంచి వ్యక్తి" అంటూ ప్రశంసలు కురిపించారు. తెలుగు ప్రేక్షకుల గురించి కూడా జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నేను ముంబైలో ఉన్నా కూడా నా సొంత ఇల్లు తెలుగు రాష్ట్రాల్లో ఉందనే ఫీలింగ్ కలుగుతుంది" అని చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సినిమాలో జాన్వీ అచ్చియ్యమ్మ అనే పల్లెటూరి యువతి పాత్రలో కనిపించనున్నారు. దేనికీ భయపడని ధైర్యమైన అమ్మాయి పాత్రగా ఆ క్యారెక్టర్ ను దర్శకుడు డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ పాత్ర కోసం జాన్వీ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు సమాచారం. తన కెరీర్ లో తొలిసారిగా స్వయంగా తెలుగు డబ్బింగ్ చెప్పడమే కాకుండా ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్స్ చెప్పేందుకు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసినట్టు మూవీ టీమ్ వెల్లడించింది.
కేవలం నటనకే పరిమితం కాకుండా సినిమాకు సంబంధించిన అనేక విషయాల్లో కూడా జాన్వీ ఆసక్తి చూపించారని దర్శకుడు బుచ్చిబాబు ప్రశంసించారు. ఆమె డెడికేషన్ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ ఎమోషన్స్, యాక్షన్, మాస్ అంశాలతో తెరకెక్కుతున్న ఆ సినిమా ఇప్పటికే భారీ హైప్ సొంతం చేసుకుంది. ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి జాన్వీ కపూర్ ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.