తప్పుడు ప్రచారం: మద్యం వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన జాన్వీ కపూర్

బాలీవుడ్ యువ నటి జాన్వీ కపూర్ ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో .. కొన్ని మీడియా వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి.;

Update: 2026-05-04 05:45 GMT

బాలీవుడ్ యువ నటి జాన్వీ కపూర్ ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో .. కొన్ని మీడియా వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. తన జీవితంలోని ఒక బాధాకరమైన సంఘటన తర్వాత అప్పుడ‌ప్పుడు మద్యం సేవించేదాన్నని జాన్వీ చెప్పిన మాటలను కొన్ని మీడియా సంస్థలు త‌న‌కు మద్యం అలవాటు ఉందంటూ తప్పుగా చిత్రీకరించాయి. ముఖ్యంగా జాతీయ స్థాయి వెబ్ సైట్ల‌లో ఈ క‌థ‌నాలు రావ‌డంతో అది ప్రాంతీయ వైబ్ సైట్ల‌లోను వైర‌ల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో జాన్వీ మద్దతు ఇస్తున్న `ఆఫ్ ది రాక్స్ & అమాహా` అనే మద్యపాన వ్యసన విముక్తి సంస్థ ఆదివారం (మే 3) ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. జాన్వీ వ్యాఖ్యలను క్లిక్ బైట్ కోసం తప్పుగా ఉప‌యోగించుకోవద్దని హెచ్చరించింది.

ఈ ప్రకటనను జాన్వీ కపూర్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. అసలు విషయాన్ని స్పష్టం చేశారు. జాన్వీ ఒక సంరక్షకురాలిగా, సామాజిక బాధ్యత గల వ్యక్తిగా మాత్రమే ఈ అవగాహన కార్యక్రమంలో భాగస్వామి అయ్యార‌ని ఆ సంస్థ పేర్కొంది. జాన్వీకి వ్యక్తిగతంగా ఎలాంటి వ్యసనం లేదా మద్యపాన అల‌వాటు కార‌ణంగా సమస్యలు లేవని.. త‌ను కేవలం ఒక బాధాకరమైన సమయంలో కలిగిన భావాలను షేర్ చేసుకున్నార‌ని వివరించారు. ఇటువంటి తప్పుడు కథనాలు వ్యసనంతో పోరాడుతున్న వారి అనుభవాలను అవమానించడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అసలు ఆ పాడ్‌కాస్ట్‌లో జాన్వీ ఏమన్నారంటే.. తన జీవితంలో ఒక విషాదం జరిగినప్పుడు.. ఆ బాధ నుండి బయటపడటానికి `నేను మద్యం సేవించాలి` అని భావించాన‌ని.. ఆ సమయంలో అరుదుగా సేవించాన‌ని మాత్ర‌మే చెప్పారు. అయితే తాను ఎప్పుడూ దానికి బానిస కాలేదని స్పష్టం చేశారు. మద్యం సేవించిన మరుసటి రోజు కలిగే హ్యాంగోవర్ .. తన శరీరంలో వచ్చే మార్పులు తనకు నచ్చలేదని.. పైగా ఆ వాసన తన జీవితంలో వ్యసనంతో పోరాడిన వ్య‌క్తుల‌ను గుర్తు చేయడంతో.. తక్షణమే ఆ అలవాటును పక్కన పెట్టేశానని జాన్వీ వివరించారు. అయితే జాన్వీ చెప్పిన మాట‌ల‌ను త‌ప్పుడు అర్థంలోకి అనువ‌ర్తించి.. కొన్ని హిందీ వెబ్ సైట్లు, మీడియా సంస్థ‌లు జాన్వీకి ఆల్క‌హాల్ లేనిదే నిదుర ప‌ట్ట‌దు! అనే కోణంలో ప్ర‌చారం చేయ‌డం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలోనే మీడియా సంస్థలు, డిజిటల్ వేదిక‌లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని.. వ్యసనం వంటి సున్నితమైన అంశాల గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలను వక్రీకరించకూడదని ఈ ప్రకటనలో స‌ద‌రు సంస్థ‌ కోరింది. తప్పుడు సమాచారం సమాజానికి హానికరం.. ఇది వ్యసన విముక్తి కోసం పోరాడుతున్న కమ్యూనిటీని అగౌరవపరచడమేనని సంస్థ నొక్కి చెప్పింది. క్లిక్ బైట్ (షార్ట్ న్యూస్ వంటివి.. టీజ్ చేసేవి) వార్తల కోసం ఒక మంచి ఉద్దేశంతో సాగుతున్న సంభాషణను తప్పుదోవ పట్టించవద్దని వారు విజ్ఞప్తి చేశారు.

సినిమా కెరీర్ విషయానికొస్తే... జాన్వీ కపూర్ హిందీ చిత్ర‌సీమ‌లో స‌త్తా చాటి టాలీవుడ్ కోలీవుడ్ లోను బిజీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ స‌ర‌స‌న దేవ‌ర‌లో అద్భుత న‌ట ప్ర‌ద‌ర్శ‌న‌తో జాన్వీ ఆక‌ట్టుకున్నారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన `పెద్ది` చిత్రంలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం 2026 జూన్ 6న విడుదల కానుంది. గత ఏడాది వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన`సన్నీ సంస్కారీ కి తులసి కుమారి` చిత్రంతో అలరించిన జాన్వీ ఇప్పుడు సౌత్ సినిమాలపై కూడా దృష్టి సారించారు. `పెద్ది` త‌న కెరీర్ బెస్ట్ అవుతుంద‌ని జాన్వీ ఆస‌క్తిగా విడుద‌ల కోసం వేచి చూస్తున్నారు. వృత్తిపరంగా ఎంతో బిజీగా ఉన్నా.. సామాజిక అంశాలపై బాధ్య‌త‌తో స్పందిస్తున్న తీరు నేటిత‌రానికి నిజంగా ఒక స్ఫూర్తి. జాన్వీ త‌దుప‌రి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో `జ‌గ‌దేక వీరుడు - అతిలోక సుంద‌రి` సీక్వెల్ లో న‌టించాల‌ని మెగా ఫ్యాన్స్ బ‌లంగా కోరుకుంటున్నారు. యువ‌న‌టి `మామ్ శ్రీ‌దేవి` స్థాయిలో టాలీవుడ్ లో వెల‌గాల‌ని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

Tags:    

Similar News