రిలీజ్ దిశ‌గా జన‌నాయ‌గ‌న్ నిర్మాత‌ల అడుగు!

కోలీవుడ్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ ఆఖ‌రి సినిమాగా వ‌స్తున్న జ‌న నాయ‌గ‌న్ రిలీజ్ విష‌యంలో స‌మ‌స్య‌లు త‌లెత్తిన విష‌యం తెలిసిందే.;

Update: 2026-01-29 06:08 GMT

కోలీవుడ్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ ఆఖ‌రి సినిమాగా వ‌స్తున్న జ‌న నాయ‌గ‌న్ రిలీజ్ విష‌యంలో స‌మ‌స్య‌లు త‌లెత్తిన విష‌యం తెలిసిందే. కోర్టులో ఉన్న వివాదాన్ని నిర్మాత‌లు కోర్టు బ‌య‌ట సాల్వ్ చేసుకోవాల‌ని డిసైడైన‌ట్టు తెలుస్తోంది. సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేష‌న్ ఈ మూవీని స‌వ‌రించిన స్క్రీనింగ్ క‌మిటీకి పంపాల‌నే డెసిష‌న్ పై కోర్టులో దాఖ‌లు చేసిన కేసును విత్‌డ్రా చేసుకోవ‌డానికి కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

విజ‌య్ ను సంప్ర‌దించిన చిత్ర యూనిట్

ఈ కార‌ణంతోనే బోర్డు, మూవీ టీమ్ మ‌ధ్య పూర్తి స్థాయి వివాదం జ‌రిగి, ఫ‌లితంగా రిలీజ్ డేట్ బాగా ఆల‌స్య‌మైంది. మ‌ద్రాస్ హైకోర్టు సింగిల్ జ‌డ్జి ఉత్త‌ర్వుల‌ను ప‌క్క‌న‌పెట్టి, రిలీజ్ డేట్ ను ఇంకా వెన‌క్కి జ‌రిపిన రిట్ పిటిష‌న్ ను తిరిగి విచార‌ణ‌కు పంపిన త‌ర్వాత చిత్ర యూనిట్ విజ‌య్ ను సంప్ర‌దించి, కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

ఇప్ప‌టికే ఆల‌స్య‌మైంద‌నే కార‌ణంతో..

సినిమా రిలీజ్ ఇప్ప‌టికే ఆల‌స్య‌మ‌వ‌డం వ‌ల్ల చాలా న‌ష్టం వాటిల్ల‌డంతో, నిర్మాత‌లు CBFCతో ఒప్పందం కుదుర్చుకుని, సెన్సార్ స‌ర్టిఫికేష‌న్ కోసం వీలైనంత త్వ‌ర‌గా రివైజింగ్ క‌మిటీని సంప్ర‌దించాల‌ని భావిస్తున్నార‌ట‌. అంతేకాదు, సినిమాను క‌మిటీకి పంపే ముందు CBFC సూచించిన అన్ని మార్పులను అమ‌లు చేయ‌డానికి కూడా మేక‌ర్స్ ఒప్పుకున్నార‌ని తెలుస్తోంది.

రీసెంట్ గా హైకోర్టు ఉత్త‌ర్వులు ఇచ్చిన త‌ర్వాత అంద‌రూ ఈ సినిమా రిలీజ‌య్యేది త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎల‌క్ష‌న్స్ త‌ర్వాతే అనుకున్నారు. కానీ జ‌న నాయ‌గ‌న్ రిలీజ్ ను ఇంకా ఆల‌స్యం చేయ‌కూడ‌ద‌ని చిత్ర బృందం ఈ నిర్ణ‌యాన్ని తీసుకుంద‌ని అనిపిస్తోంది. దీన్ని బ‌ట్టి చూస్తుంటే త్వ‌ర‌లోనే జ‌న నాయ‌గ‌న్ కొత్త రిలీజ్ డేట్ ను మేక‌ర్స్ అనౌన్స్ చేసే వీలుంది. హెచ్. వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించ‌గా, మ‌మిత బైజు, బాబీ డియోల్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

Tags:    

Similar News