'జ‌న‌నాయ‌గ‌న్' మూవీని ఎలా కాపీ చేసి లీక్ చేసారో తెలుసా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ అత్తారింటికి దారేది చిత్రం రిలీజ్‌కి ముందే స‌గం ఫుటేజ్ లీక‌వ్వ‌డం అప్ప‌ట్లో ఎలాంటి క‌ల‌క‌లం సృష్టించిందో తెలిసిందే.;

Update: 2026-04-26 18:36 GMT

ప‌వ‌న్ క‌ల్యాణ్ అత్తారింటికి దారేది చిత్రం రిలీజ్‌కి ముందే స‌గం ఫుటేజ్ లీక‌వ్వ‌డం అప్ప‌ట్లో ఎలాంటి క‌ల‌క‌లం సృష్టించిందో తెలిసిందే. ఆ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ `టాక్సీవాలా` ఫుల్ మూవీనే లీక్ చేసారు. ఇలాంటి చెదురుముదురు ఘ‌ట‌న‌లు టాలీవుడ్ లో క‌ల‌క‌లం రేపాయి. ఇటీవ‌ల అంత‌కుమించిన ఫుటేజ్ లీకేజ్ క‌ల‌క‌లం కోలీవుడ్ ని ఒణికించింది. ద‌ళ‌ప‌తి విజ‌య్, అత‌డి నిర్మాత‌లు దీనికి బ‌లిప‌శువుగా మారారు. వీట‌న్నిటికీ ఇంటి దొంగ‌లే కార‌ణ‌మ‌ని బ‌య‌టప‌డింది. అస‌లు ఘ‌ట‌న పూర్వాప‌రాల్లోకి వెళితే...

కోలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ విజయ్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `జన నాయకన్` ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. ఈ లీకేజీ వ్యవహారంపై సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ (SIFEA) అధ్యక్షుడు గోపీకృష్ణ విస్తుపోయే నిజాలను వెల్లడించారు. ఈ సినిమా ఎడిటర్ ప్రదీప్ ఇ రాఘవ్‌ను అసోసియేషన్ ఇప్పటికే సస్పెండ్ చేసింది. అసలు ఒక భారీ బడ్జెట్ సినిమా ఎడిటింగ్ రూమ్ నుండి ఎలా బయటకు వెళ్లిందనే అంశంపై విచారించ‌గా.. ఒక ఫ్రీలాన్స్ ఎడిటర్ చేసిన ఘరానా దొంగతనం వెలుగులోకి వచ్చింది.

సినిమా ఫుటేజీని దొంగిలించడానికి నిందితుడు ఎంతో పక్కాగా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఎడిటర్ ప్రదీప్ వద్ద మరో సినిమా కోసం పనిచేస్తున్న ఒక ఫ్రీలాన్స్ ఎడిటర్.. `జన నాయకన్` ఫుటేజీ ఉన్న గదిలోకి అనుమానం అన్న‌దే రాకుండా ప్రవేశించి డేటాను కాపీ చేశాడు. కేవలం ఒక్కసారిగా కాకుండా.. ఫిబ్రవరి నెలలోనే రీల్స్ వారీగా ఫుటేజీని దొంగిలించాడని విచారణలో తేలింది. చివరకు మార్చి 1న సినిమా ఫైనల్ వెర్షన్ సిద్ధమైనప్పుడు దానిని కూడా అత్యంత చాకచక్యంగా కాపీ చేసి బయటకు పంపాడు.

ఈ లీకేజీకి సంబంధించి డి. ఉమాశంకర్ అనే వ్యక్తి పేరు ప్రధానంగా వినిపిస్తోందని కోలీవుడ్ మీడియాలు పేర్కొన్నాయి. సినిమా లీక్ కావడానికి ముందే ఒక గూగుల్ డ్రైవ్ లింక్ బయటపడటంతో ప్రొడక్షన్ హౌస్ అప్రమత్తమైంది. ఆ లింక్ ద్వారా మూలాలను వెతకగా.. ఉమాశంకర్ వద్దే ఈ డేటా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ లీకేజీకి ప్రధాన కారకుడిగా భావిస్తున్న ఉమాశంకర్‌కు అసలు చిత్ర పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని గోపీకృష్ణ స్పష్టం చేశారు. ప్రస్తుతం నిందితుడు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తుండగా.. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

ఈ ఘటనతో మేల్కొన్న సినీ సంఘాలు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలకు సిద్ధమవుతున్నాయి. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, FEFSI , SIFEA కలిసి త్వరలో ఒక అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నాయి. సినిమా పవిత్రతను కాపాడటానికి యూనియన్ ప్రోటోకాల్స్ ఎంత ముఖ్యమో ఈ ఘటన నిరూపించిందని గోపీకృష్ణ అన్నారు. ముఖ్యంగా అసోసియేషన్‌లో సభ్యత్వం లేని ఫ్రీలాన్స్ ఎడిటర్లను పనిలోకి తీసుకోవడం వల్లనే ఇటువంటి భద్రతా లోపాలు తలెత్తుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

నేటి కాలంలో సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఎడిటింగ్ చేయడం సులభమైంది... కానీ అదే సమయంలో అది దుర్వినియోగానికి కూడా దారితీస్తోంది. వంద‌ల కోట్ల రూపాయల విలువైన సినిమా అవుట్‌పుట్ అనేది కేవలం హార్డ్ డిస్క్‌లలో ఉండే డేటా మాత్రమే కాదు.. అది వందలాది మంది శ్రమ. అందుకే ఎడిటింగ్ విభాగంలో నమ్మకమైన వ్యక్తులను నియమించుకోవాలని.. కట్టుదిట్టమైన సైబర్ సెక్యూరిటీ మార్గదర్శకాలను పాటించాలని SIFEA నిర్ణయించింది. ఈ లీకేజీ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమిటనేది పోలీసుల తుది విచారణలో తేలాల్సి ఉంది. జ‌న‌నాయ‌గ‌న్ రిలీజ్ అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వ్వ‌డంతో డ్యామేజ్ ఊహించ‌ని విధంగా ఉంద‌ని విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News