'జన నాయగన్'కు మరో కొత్త చిక్కొచ్చి పడిందిగా!
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించి భారీ పాన్ ఇండియా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'జన నాయగన్' చుట్టూ రోజుకో వివాదం అలుముకుంటోంది.;
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించి భారీ పాన్ ఇండియా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ `జన నాయగన్` చుట్టూ రోజుకో వివాదం అలుముకుంటోంది. సెన్సార్ వివాదం కారణంగా జనవరి 9న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అర్థాంతరంగా వాయిదాపడిన విషయం తెలిసిందే. మద్రాస్ హైకోర్టు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాల్సిందేనని తీర్పు చెప్పినా జీబీఎఫ్‌సీ వర్గాలు ఈ తీర్పుని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ని ఆశ్రయించడంతో `జన నాయగన్` సెన్సార్ వివాదం కొత్త మలుపు తిరిగింది.
రోజు రోజుకూ సమస్య పరిష్కారం అవుతుందన్న సమ్మకం మేకర్స్‌లో సన్నగిల్లుతోంది. సినిమా మా చేతులు దాటిపోయిందని మేకర్స్ బాహాటంగా వెల్లడించారంటే పరిస్థితి ఎక్కడి వరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మద్రాస్ హై కోర్టు తీర్పు అనుకూలంగా వస్తోందని ఆశగా ఎదురు చూసే లోపే అందులో ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూ వస్తోంది. ఈ నెల 20న `జన నాయగన్` సినిమాపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు సీబీఎఫ్‌సీ, కేవీఎన్ ప్రొడక్షన్స్ తరుపు న్యాయవాదుల వాదనలు విని ఫైనల్ తీర్పుని రిజర్వ్ చేయడంతో మళ్లీ కథ మొదటి వచ్చింది.
ఈ నేపథ్యంలోనే `జన నాయగన్` ఇప్పట్లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనపించిడం లేదని కోలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. దీనికి మరింత బలాన్ని చేకూరుస్తూ ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. సినిమా జనవరి 9న రిలీజ్ కావాల్సింది సెన్సార్ వివాదం కారణంగా వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ వాయిదాల వల్ల విజయ్ సినిమాకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఓటీటీ వర్గాల నుంచి మరో సమస్య తలెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది.
సినిమా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో `జన నాయగన్` టీమ్‌కు లీగల్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ఐదు భాషలకు గానూ రూ.121 కోట్లకు దక్కించుకుంది. ఈ స్థాయిలో భారీ మొత్తాన్ని దక్కించుకున్న తమిళ సినిమా ఇదే కావడం విశేషం. మార్చిలోనే డీన్‌ని పూర్తి చేశారు. అయితే జనవరి 9న రిలీజ్ అవుతుందనుకున్న సినిమా రిలీజ్ కాకపోవడంతో డిసెంబర్ 31నే అమెజాన్ ప్రైమ్ వీడియో వర్గాలు మేకర్స్‌ని హెచ్చరించాయట.
అయితే ఇంత వరకు `జన నాయగన్` రిలీజ్ విషయంలో ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో అమెజాన్ ప్రైమ్ వీడియో వర్గాలు ఈ మూవీ టీమ్‌పై లీగల్ ఫైట్‌కు రెడీ అయ్యే అవకాశం ఉందని, అదే జరిగితే విజయ్ సినిమా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతుందని కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక వేళ అమెజాన్ ప్రైమ్ వీడియో వర్గాలు కోర్టు వరకు వెళ్లకపోతే ఎలాంటి గొడవ ఉండదని, అదే వెళితే మాత్రం ఈ మూవీ మళ్లీ సమస్యల సుడిగుండంలో చుట్టుకోవడం ఖాయమని ఇన్ సైడ్ టాక్.