జగ్గూభాయ్.. మరోసారి ఇచ్చిపడేశారుగా!

ఆ విషయంపై పెద్ది పోస్ట్ ప్రమోషన్స్ లో మాట్లాడిన జగపతి బాబు, ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉంటుందని చెప్పారు.

Update: 2026-06-11 09:15 GMT

బాక్సాఫీస్ వద్ద పెద్ది మూవీ దూసుకుపోతున్న వేళ టాలీవుడ్ సీనియర్ యాక్టర్ జగపతి బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారాయి. సోషల్ మీడియాలో సినిమాలపై జరుగుతున్న నెగిటివ్ ట్రోలింగ్‌ పై ఆయన మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యంగా పెద్ది సినిమాను టార్గెట్ చేస్తూ కావాలనే కొందరు చేస్తున్న పోస్టులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ల సాధిస్తోంది. మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిన ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్న వేళ, సోషల్ మీడియాలో మాత్రం నెగిటివ్ ప్రచారం కొనసాగుతుందనే చర్చ జరుగుతోంది.

ఆ విషయంపై పెద్ది పోస్ట్ ప్రమోషన్స్ లో మాట్లాడిన జగపతి బాబు, ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉంటుందని చెప్పారు. ఒక సినిమా నచ్చితే ప్రశంసించడం, నచ్చకపోతే విమర్శించడం కామన్ అని తెలిపారు. కానీ కొందరు మాత్రం కావాలనే ఒక సినిమాను ఇబ్బంది పెట్టాలని చూస్తుండడం ఎప్పుడూ సరైన పద్ధతి కాదన్నారు.

"కొంతమందికి సినిమా దెబ్బతింటే ఆనందం కలుగుతుంది. అది ఒక రకమైన తప్పుడు ఆనందం. సినిమా బాగా ఆడకూడదనే ఉద్దేశంతో ఏదో ఒకటి చేస్తుంటారు. సోషల్ మీడియాలో నెగిటివ్ పోస్టులు పెడతారు. ట్రోలింగ్ చేస్తారు" అంటూ జగ్గూభాయ్ అసహనం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ పెద్ద స్టార్ కావొచ్చు, ఫైనాన్సియల్ గా స్ట్రాంగ్ బలమైన వ్యక్తి కావొచ్చు, కానీ ఒక సినిమా వెనుక హీరో ఒక్కరే ఉండరని జగపతి బాబు గుర్తు చేశారు.

నిర్మాత పెట్టిన బడ్జెట్, దర్శకుడి కష్టం, టెక్నీషియన్స్ శ్రమ, వందలాది మంది వ్యక్తుల కష్టం కూడా ఒక సినిమా విజయంపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. "వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తారు. ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అభిమానులు కూడా ఆ సినిమా కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి సమయంలో కావాలని సినిమాను దెబ్బతీయాలనుకోవడం సరికాదు" అని ఆయన అన్నారు.

ఇక డబ్బుల కోసం కొందరు ట్రోలింగ్ చేస్తున్నారని కూడా జగపతి బాబు ఆరోపించారు. కోట్ల రూపాయలతో తెరకెక్కిన సినిమాలను వేల రూపాయల కోసం టార్గెట్ చేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం బాధాకరమన్నారు. అలాంటి వారిని ఉద్దేశిస్తూ పనిలేని వెదవలు, గుంటనక్కలు అంటూ ఇచ్చిపడేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

ఒకవైపు జగపతి బాబు చేసిన కామెంట్స్ లో నిజం ఉందని, ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కరి కష్టాన్ని గుర్తించాలని కొందరు అభిప్రాయపడుతుంటే.. మరోవైపు విమర్శించే హక్కును ట్రోలింగ్‌ తో కలిపి చూడకూడదని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా, సినిమా రివ్యూ ఇవ్వడం వేరు.. కావాలని దాని విజయాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో నెగెటివిటీ స్ప్రెడ్ చేయడం వేరు.. అని జగపతిబాబు వ్యాఖ్యల్లో క్లియర్ గా తెలుస్తోంది.

Tags:    

Similar News