‘నా పేరు రివీల్ చేయొద్దన్నా..’ పెద్ది టీమ్ పై జగపతి కామెంట్స్
ఈ క్రమంలో సినిమాలో అప్పలసూరి అనే కీలక పాత్రలో నటించిన జగపతి బాబు తన పాత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా పెద్ది. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రామీణ నేపథ్యంతో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతి బాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 4న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో సినిమాలో అప్పలసూరి అనే కీలక పాత్రలో నటించిన జగపతి బాబు తన పాత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
పెద్దిలో జగపతి బాబు లుక్ మొదట రిలీజైనప్పుడే సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. సాధారణంగా ఆయనను చూసిన వెంటనే గుర్తుపట్టే ప్రేక్షకులు కూడా ఈసారి మాత్రం పూర్తిగా కన్ఫ్యూజ్ అయ్యారు. అంతగా తన రూపాన్ని మార్చుకున్నానని, అదే ఈ పాత్ర ప్రత్యేకత అని జగపతి బాబు తెలిపారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే సమయంలో తన పేరుని రివీల్ చేయొద్దని తాను టీమ్‌కి చెప్పానని, సోషల్ మీడియాలో ఇది ఎవరో అని గెస్ చేసే గేమ్ మొదలైతే ఇంకా మంచి హైప్ వచ్చేదని అనిపించిందని వెల్లడించారు. కానీ నిర్మాతలు పోస్టర్‌తో పాటు తన పేరును కూడా ప్రకటించారని, దాంతో ఆ సర్‌ప్రైజ్ ఎలిమెంట్ కొంత తగ్గిపోయిందని అన్నారు.
అప్పలసూరి పాత్రలో ఆయన కనిపించిన తీరు చూసి చాలామంది ఇతర నటుల పేర్లు చెప్పారని జగపతి బాబు నవ్వుతూ గుర్తుచేశారు. కొందరు తనను బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ అనుకున్నారని, మరికొందరు నాగబాబు అని భావించారని చెప్పారు. మనల్ని ఎప్పుడూ గుర్తుపట్టే వాళ్లు కూడా కొన్ని సార్లు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ పాత్రలో అదే జరిగిందంటూ ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా తనను అత్యంత ఆశ్చర్యానికి గురి చేసిన వ్యక్తి వెంకట్ అక్కినేని అని చెప్పారు. వెంకట్ అక్కినేని మామూలుగా చాలా షార్ప్. ఆయన కూడా మొదట తన లుక్ చూసి గుర్తుపట్టలేదని, తర్వాత కళ్లజోడు తీసి జాగ్రత్తగా చూసి గుర్తుపట్టారు. పోస్టర్ మీద పేరు లేకుండా రిలీజ్ చేస్తే బావుంటుందనే ఐడియాను ఆయనే ఇచ్చారని జగపతి బాబు వెల్లడించారు.
ఇక పెద్దిలో జగపతి బాబు పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందనే సంకేతాలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రలు చేస్తూ తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఈసారి పూర్తిగా డీగ్లామర్ లుక్‌లో కనిపించనున్నారు. బుచ్చిబాబు సాన సినిమాల్లో పాత్రల డిజైన్‌కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో తెలిసిందే. అదే విధంగా అప్పలసూరి పాత్రను కూడా చాలా నేచురల్‌గా, రా స్టైల్‌లో డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ లో కనిపించిన జగపతి బాబు లుక్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. రామ్ చరణ్ కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమాగా ప్రచారం పొందుతున్న పెద్దిలో అప్పలసూరి పాత్ర ప్రేక్షకులకు ఎంతవరకు గుర్తుండిపోతుందో చూడాలి.