స్టార్ హీరో విలాసాల ఫామ్ హౌస్ సీక్రెట్స్ బట్టబయలు
చాలామంది బాలీవుడ్ స్టార్లు తెలివైన పెట్టుబడులతో తమ ఆస్తులను కోట్లకు కోట్లు పెంచుకుంటున్నారు.;
చాలామంది బాలీవుడ్ స్టార్లు తెలివైన పెట్టుబడులతో తమ ఆస్తులను కోట్లకు కోట్లు పెంచుకుంటున్నారు. కేవలం నాలుగైదేళ్లలోనే తమ పెట్టుబడులపై పదుల రెట్లు లాభాలు ఆర్జించడం ఎలానో ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నారు. ఇలాంటి తెలివైన పెట్టుబడులలో బచ్చన్ ఫ్యామిలీ, ఖాన్ ఫ్యామిలీతో పాటు, కపూర్ లు, నేటితరం యువకథానాయికలు కూడా జోరు మీదున్నారు.
బచ్చన్ ఫ్యామిలీ నుంచి అమితాబ్, అభిషేక్ తెలివిగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతున్నారు. వందల కోట్ల ఆస్తులను ఈ వ్యాపారం నుంచి కూడగడుతున్నారు. వివేక్ ఒబెరాయ్ లాంటి స్టార్ తన పెట్టుబడుల పోర్ట్ ఫోలియోను రియల్ వెంచర్లలో పెంచుకుంటూనే ఉన్నాడు. వీరంతా ముంబై సబర్బన్ ఏరియాలో తక్కువ ఖరీదుతో స్థలాలను కొని అక్కడ రేంజు పెరిగాక రీసేల్ చేయడంలో, బాంద్రా, జూహూ, అంథేరి వంటి ప్రైమ్ ఏరియాల్లో అపార్ట్ మెంట్లు కొని, వాటిని భారీ లాభాలకు సేల్ చేయడంలో నిష్ణాతులుగా మారారు. డబ్బుతో జూదం ఆడినా కాసులన్నీ కలశంలో నింపుకోవడంలో ఘనాపాటీలుగా ఎదిగారు.
ఇప్పుడు వెటరన్ నటుడు జాకీ ష్రాఫ్ కూడా తన సంపాదనను తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అతడు ఇప్పటికే ముంబైలో పలు ఖరీదైన ఏరియాల్లో సొంత స్థలాలు, అపార్ట్ మెంట్లను కలిగి ఉన్నాడు. నివశించడానికి గూడు లేని స్థితి నుంచి అతడు సంపన్నుడుగా ఎదిగేందుకు నటనారంగంలో చాలా శ్రమించాల్సి వచ్చింది. అయితే అతడి కష్టం ఫలించి ఇప్పుడు పుష్కలంగా సంపదల్ని పెంచుకున్నాడు. తాజాగా అతడు తన 44,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విలాసవంతమైన ఫామ్‌హౌస్ గుట్టు విప్పాడు. ఇందులో భారీ స్విమ్మింగ్ పూల్, 700 మొక్కలు, సేంద్రీయ వ్యవసాయం కూడా ఉన్నాయి. వీటితో పాటు టైటానిక్ పాయింట్ ను ఈ స్థలంలో ఏర్పాటు చేసుకుని విజిటర్స్ ని ఆకర్షిస్తున్నాడు. జాకీష్రాఫ్ విలాసవంతమైన ఫామ్‌హౌస్‌కు ఫరా ఖాన్ సందర్శన ఒక బిగ్ సర్ ప్రైజ్.
సినీదర్శకురాలు కం వ్లాగర్ ఫరాఖాన్ ఈ అతిథి గృహంలోని అన్ని ప్రత్యేకతల గురించి అద్భుతంగా వర్ణించారు. ఈ ఖరీదైన ఫామ్ హౌస్ ముంబై- పూణే హైవేలో ఉంది. ఫామ్ ని అందమైన మొక్కలతో పచ్చదనంతో డిజైన్ చేయించిన తీరు ఆసక్తిని కలిగిస్తుంది. ఇందులో అందమైన అతిథి గృహాన్ని నిర్మించారు. అలాగే కొంత నేలలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఫామ్‌హౌస్ ఓపెన్ కిచెన్‌లో జాకీ - ఫరా సేంద్రీయ కూరగాయలతో వంటల్ని చేసి ఆస్వాధించారు. వీరిద్దరూ సాంప్రదాయ మట్టి కుండలలో ఒక గ్రామీణ స్టవ్‌పై సేంద్రీయ పట్టే కి భాజీని వండుకున్నారు.
ఈ ఫామ్ లోనే స్విమ్మింగ్ పూల్, అఖాడా-శైలి జిమ్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. దీనిని తన 25వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సెల్ఫ్ గిఫ్ట్ గా జాకీ కొనుగోలు చేసారు. అప్పటి నుంచి ఇందులో వివిధ రకాల స్థానిక చెట్లు, మొక్కలు సహా పచ్చదనంతో నింపేసాడు. మల్బరీ సహా దాదాపు 700 మొక్కలు ఫామ్‌హౌస్ లోపల ఉన్నాయి. అలాగే ఇందులో ఒక పెద్ద చేపల చెరువు.. ప్రత్యేక పౌల్ట్రీ ని కూడా ప్రారంభించబోతున్నారట.
ప్రత్యేకించి తనకు అత్యంత ఇష్టమైన వ్యవసాయంపై జాకీ దృష్టి సారించారు. సేంద్రీయ వ్యవసాయం కోసం ప్రత్యేక స్థలం కేటాయించారు. అలాగే ఫామ్‌హౌస్ సరిహద్దుల్లో భారీ స్విమ్మింగ్ పూల్, జాకుజీ, యాంఫి థియేటర్- అఖాడా-శైలి జిమ్ కూడా ఉన్నాయి. ఆసక్తికరంగా ఫరాఖాన్ గతంలో కూడా ఇక్కడికి వచ్చి వెళ్లానని తెలిపారు. ఈ ఫామ్ హౌస్ లో టైటానిక్ వ్యూ పాయింట్ నుంచి మొత్తం వ్యవసాయ క్షేత్రాన్ని వీక్షించవచ్చు. ఇక ఈ ఫామ్ హౌస్‌లోనే తన గారాల పట్టీ కృష్ణ ష్రాఫ్ గదిని కూడా ఏర్పాటు చేసాడు. అది ఓపెన్ టాప్ - ఎయిర్ తో ఎంతో అందంగా తీర్చిదిద్దిన గది. విశాలమైన ఈ ఫామ్ ఖరీదు దాదాపు 50 కోట్లు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.