మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ జాకీ చాన్ క్షేమం!
చైనాకు చెందిన ఫాంగ్ షిలాంగ్ అనే అసలు పేరున్న జాకీ చాన్ తన అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్, కామిక్ టైమింగ్, సాహసోపేతమైన యాక్షన్ స్టంట్లతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు.
హాలీవుడ్ మార్షల్ ఆర్ట్స్ దిగ్గజం, నటుడు జాకీ చాన్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా తప్పుడు వార్తలు వ్యాపించాయి. 72 ఏళ్ల గ్లోబల్ స్టార్ నల్లటి-తెలుపు ఫోటోతో `1954-2026` అని రాసి ఉన్న పోస్ట్‌లు నెట్టింట వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాకీచాన్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ఇవన్నీ కేవలం అవాస్తవాలని, ఆయన పూర్తి ఆరోగ్యంతో క్షేమంగా ఉన్నారని ఫ్యాక్ట్ చెక్ నివేదికలు స్పష్టం చేశాయి.
24 గంటల్లోనే ఈ డెత్ హోక్స్ సోషల్ మీడియా వేదికలపై కార్చిచ్చులా వ్యాపించింది. కేవలం ఒక్క ఖాతా నుంచే షేర్ అయిన వైరల్ పిక్చర్‌కు 5 గంటల్లోనే దాదాపు 3.8 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం దీని తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే పరిశీలనలో ఈ ప్రచారం తప్పుడుదని తేలింది. జాకీ చాన్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా తన భవిష్యత్ సినిమా ప్రాజెక్టుల పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు నిర్ధారణ అయింది.
చైనాకు చెందిన ఫాంగ్ షిలాంగ్ అనే అసలు పేరున్న జాకీ చాన్ తన అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్, కామిక్ టైమింగ్, సాహసోపేతమైన యాక్షన్ స్టంట్లతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. దాదాపు $400 మిలియన్లకు పైగా ఆస్తులు కలిగిన హాంకాంగ్ నటుడికి దేశ సరిహద్దులతో సంబంధం లేకుండా ప్రపంచం నలుమూలలా కోట్లాది మంది అభిమానులున్నారు. అంతటి క్రేజ్ ఉన్న స్టార్ గురించి ఇలాంటి వదంతులు రావడంతో అంతర్జాతీయ మీడియా సైతం ఈ వార్తను ప్రముఖంగా ఖండించింది.
సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీల మరణంపై ఇలాంటి సైబర్ పుకార్లు రావడం కొత్తేమీ కాకపోయినా జాకీ చాన్ వంటి దిగ్గజ నటుడిపై వచ్చిన తప్పుడు వార్తలు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఆయన క్షేమంగా ఉన్నారనే నిజం బయటకు రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన త్వరలోనే సరికొత్త చిత్రాలతో వెండితెరపై అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇటీవలే జులై 2026లో జాకీ చాన్ సింగపూర్‌లోని పై చున్ పబ్లిక్ స్కూల్ ను అనూహ్యంగా సందర్శించి విద్యార్థులను, ఉపాధ్యాయులను ఆశ్చర్యపరిచారు. అక్కడ విద్యార్థులను ఉత్సాహపరుస్తూ తన పాట `హార్డ్ టు సే గుడ్ బై` పాడి వినిపించారు. ఆ కార్యక్రమంలో ఆయన ఎంతో ఉత్సాహంగా పాఠశాల పిల్లలతో సమయాన్ని సరదాగా గడిపారు.
ఆ కార్యక్రమంలో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ జాకీ చాన్ చెప్పిన స్ఫూర్తిదాయక మాటలను అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. `ఒకప్పుడు నాకు ఎలాంటి ఆశలు లేవు. రోజుకి ఒక్క పూట అన్నం తినడం, మా టీచర్ చేతిలో దెబ్బలు తినకుండా ఉండటమే నా ఏకైక ఆశగా ఉండేది. మీరు కష్టపడి పని చేయండి. కలలు ఎల్లప్పుడూ నిజం కాకపోవచ్చు. కానీ కలలు కనకపోతే విజయం సాధించడం అసాధ్యం` అని ఆయన పిల్లలకు హితవు పలికారు.