సత్య vs యోగి బాబు.. వ్యాటే కాంబో..
లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. గ్లింప్స్ మొదలైన తీరే చాలా వెరైటీగా ఉంది.
ఈ మధ్య కాలంలో వస్తున్న కామెడీ సినిమాలన్నీ రొటీన్ ఫార్ములాతో బోర్ కొట్టిస్తున్న వేళ, సరికొత్త కాంబినేషన్‌తో ఆడియన్స్‌ను థియేటర్ల వైపు తిప్పుకునే ప్రయత్నం మొదలైంది. తెలుగులో తనదైన పక్కా లోకల్ టైమింగ్‌తో నవ్వించే సత్య, తమిళంలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న యోగి బాబు ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. రంగబలితో తన మార్క్ చూపించిన డైరెక్టర్ పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కి గోల్డెన్ భాగ్యం అనే క్యాచీ టైటిల్ ఫిక్స్ చేశారు.
లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. గ్లింప్స్ మొదలైన తీరే చాలా వెరైటీగా ఉంది. ఇద్దరి మధ్య బిర్యానీ, సాంబార్ క్లాష్ మొదలవ్వగా అంతకుమించిన కాంబినేషన్ అంటూ యోగిబాబు, సత్యను పరిచయం చేయడం హైలెట్ అయ్యింది. సాధారణంగా తెలుగు కమెడియన్ తెలుగులో, తమిళ నటుడు తమిళంలో మాట్లాడటం కామన్. కానీ ఇక్కడ మేకర్స్ రివర్స్ గేర్ వేశారు.
సత్య మొదట పక్కా మద్రాస్ బాషలో తమిళ డైలాగ్స్ విసురుతుంటే, యోగి బాబు తెలుగు డైలాగ్స్ తో ఎదురుదాడికి దిగడం హైలైట్ గా నిలిచింది. ఈ లాంగ్వేజ్ స్వాప్ కాన్సెప్ట్ వీడియోకి మంచి కిక్ ఇచ్చింది. పోస్టర్లలో కనిపించినట్టే, ఈ వీడియోలో అగ్ర కథానాయకుల స్టైల్‌ను వీరు ప్యారడీ చేసిన విధానం భలే కుదిరింది. తెల్లటి కుర్తా ధోతీలు వేసుకుని, చేతిలో గొడ్డలి, కత్తి పట్టుకుని రక్తపు మరకలతో వీరు చేసిన యాక్షన్ ఎంట్రీ కామెడీగా హైలెట్ అయ్యింది.
డైరెక్టర్ వచ్చి కథ ఏంటని అడిగితే, ముందు ప్రేమకథ అంటూ రోజా పువ్వులు పట్టుకోవడం, ఆ వెంటనే రక్తపు చిమ్మడాలు, నరుక్కోవడాలు అంటూ సీరియస్ లుక్ ఇవ్వడం వీడియోకి మెయిన్ ఎట్రాక్షన్ గా మారింది. మరీ క్లైమాక్స్‌లో వీరు వేసిన సెటైర్లు కూడా నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉన్నాయి. గట్టిగా అరిచినప్పుడు నరాలేవో కనిపించాలని దర్శకుడు చెబితే, అసలు వీడికి మెడే కనిపించదు, ఇంకా అందులో నరం ఎక్కడి నుంచి వస్తుందంటూ సత్య వేసిన పంచ్ టైమింగ్ బాగుంది.
దానికి తోడు క్లైమాక్స్ లో సిక్స్ ప్యాక్ ఉంటే చొక్కా విప్పడానికి రెడీ అన్నట్టుగా యోగి బాబు కౌంటర్ వేయడం చూస్తే, కథలో ఇలాంటి లోకల్ హ్యూమర్ గట్టిగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. తెలుగు, తమిళ సరిహద్దుల నడుమ సాగే లాంగ్వేజ్ బారియర్‌ని బేస్ చేసుకుని రాసుకున్న కథ కావడంతో, మేకర్స్ దీనికి 'తెలుమిల్ ఫిలిం' అనే కొత్త ట్యాగ్ తగిలించారు. వెన్నెల కిషోర్, సుదర్శన్ లాంటి అనుభవజ్ఞులైన నటులు కూడా ఈ సినిమాలో భాగం కావడంతో ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ భారీగానే ఉండే అవకాశం ఉంది.
పవన్ సీహెచ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రాప్ బీట్ విజువల్స్ కి మంచి పేస్ ఇచ్చాయి. లవ్, క్రైమ్, యాక్షన్ అంశాలన్నీ కామెడీ కోణంలోనే నడవడం వల్ల స్క్రీన్‌ప్లే బోర్ కొట్టకుండా సాగుతుందని గ్లింప్స్ భరోసా ఇస్తోంది. ఓవరాల్ గా చూస్తే, ఈ ప్రాజెక్ట్ పై బజ్ పెరగడానికి ప్రధాన కారణం సత్య, యోగి బాబుల క్రేజీ పెయిరింగ్ మాత్రమే. ఇద్దరికీ నవ్వించగల సత్తా ఉంది. పూర్తి స్థాయి అవుట్‌పుట్ ఎలా ఉంటుందో ట్రైలర్ వస్తే గానీ తేలదు కానీ, ప్రస్తుతానికైతే ఈ ఇంట్రో గ్లింప్స్ ఆడియన్స్‌ను కచ్చితంగా హుక్ చేసింది. కంటెంట్ బలంగా ఉండి, ఈ కాంబినేషన్ సరిగ్గా వర్కవుట్ అయితే మాత్రం రెండు భాషల్లోనూ ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించే స్కోప్ కనిపిస్తోంది.