వ్యభిచారం "కూల్ ప్రొఫెషన్"... చిక్కుల్లో స్టాండప్ కమెడియన్!

ఈ వీడియోలో విదుషి స్వరూప్ స్టాండప్ కామెడీ పేరు చెప్పి మైకందుకుని... వ్యభిచారం చక్కని వృత్తులలో ఒకటి అని పేర్కొంది.;

Update: 2023-10-24 06:57 GMT

ఇటీవల కాలంలో దేశంలో స్టాండ్ అప్ కామెడీ స్పేస్ భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ కామెడీ బిట్లను చాలా మంది తమ ఖాళీ సమయంలో మొబైల్స్ లోనూ, టీవీలలోనూ చూస్తుంటారు. మరికొంతమంది ఈ షోలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆఫ్‌ లైన్ టిక్కెట్లను కూడా బుక్ చేసుకుంటారు. అయితే ఈ స్టాండప్ కామెడీ షోలలో కొంతమంది కమెడియన్స్ అని చెప్పుకునే వారు చేసే కామెడీ నవ్వు తెప్పించకపోగా చికాకు కలిగిస్తుందనే కామెంట్లు కూడా వినిపిస్తుంటాయి.

అవును... కొన్నిసార్లు, హాస్యనటులు చేసే జోకులు ప్రేక్షకులకు అంతగా నచ్చవు సరికదా కొంతమంది ప్రజలను కించపరిచేలా కూడా ఉంటుంటాయి. మరికొంతమంది చిల్లర చేష్టలు, వెకిలి మాటలు, డబుల్ మీనింగ్ డైలాగులను కూడా స్టాండప్ కామెడీ అని పేరు పెట్టుకుని పేరు, డబ్బు సంపాదించేస్తూ పబ్బం గడిపేస్తుంటారు. ఈ సమయంలో స్టాండ్ అప్ కమెడియన్ విదుషి స్వరూప్ వ్యభిచారాన్ని "కూల్ ప్రొఫెషన్" అని సంబోదించిన వీడియో వైరల్ కావడంతో ఆన్‌ లైన్‌ లో విపరీతంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ వీడియోలో విదుషి స్వరూప్ స్టాండప్ కామెడీ పేరు చెప్పి మైకందుకుని... వ్యభిచారం చక్కని వృత్తులలో ఒకటి అని పేర్కొంది. ఇదే సమయలో... అనుభవజ్ఞుల కంటే ఫ్రెషర్లకు ఎక్కువ డిమాండ్ ఉన్న ఏకైక వృత్తి ఇదే అని చెప్పుకొచ్చింది. అదేవిధంగా... ఈ వృత్తిలో కంపెనీ సీఈవో కంటే ఇంటర్న్ ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారని చెప్పుకొచ్చింది. దీంతో ఆమె వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

ఇందులో భాగంగా ఈ వ్యాఖ్యలపై ప్రముఖ కవి, రాజకీయ నాయకుడు కుమార్ విశ్వాస్ ఆమెను తీవ్రంగా విమర్శించారు. ఇందులో భాగంగా.. వాస్తవానికి, ఇది అసంబద్ధం మాత్రమే కాదు, అమానుషం మరియు క్రూరమైనది కూడా అని అన్నారు. అది భారతదేశ సంస్కృతిని నాశనం చేస్తోంది అని తెలిపారు! ఇదే సమయంలో... "ఇందులో కామెడీ ఎక్కడ ఉంది? నాకు అసహ్యం తప్ప మరేమీ అనిపించలేదు" అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో... "చదువుకోని మూర్ఖులు మాత్రమే వ్యభిచారాన్ని జోక్ చేయగలరు. ఆమెకు యాదృచ్ఛికంగా పిల్లల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, పేదరికపు విష వలయం గురించి తెలుసుకునే అవకాశం వస్తే, ఆమె తన గురించి చాలా సిగ్గుపడుతుంది" అని ఒక నెటిజన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అదేవిధంగా... "నవ్వుతున్న ప్రేక్షకుల కోసం నేను కొత్త పదాలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాను" అని మరో నెటిజన్ స్పందించారు.

మరోపక్క పలువురు నెటిజన్లు ఈ వ్యాఖ్యలను సమర్ధించారు. ఇందులో భాగంగా... "ఇది అందమైన డార్క్ కామెడీ. కొంచెం అసౌకర్యంగా ఉంటుంది కానీ మీకు మంచి అనుభూతిని కలిగించేలా ఉంటుంది" అని కామెంట్ చేశారు.

Tags:    

Similar News