రణ్‌వీర్ వివాదంపై రియాక్ట్ అయిన రిషబ్
కాంతార సినిమా భారత దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద హిట్టైందో అందరికీ తెలిసిందే. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా కన్నడ ఆడియన్స్ కు ఒక ఎమోషన్.;
కాంతార సినిమా భారత దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద హిట్టైందో అందరికీ తెలిసిందే. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా కన్నడ ఆడియన్స్ కు ఒక ఎమోషన్. అలాంటి కాంతార మూవీలోని దైవారాధన సీన్స్ ను స్టేజ్ పై ఇమిటేట్ చేయడం తనను తీవ్రంగా బాధిస్తోందని హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి అన్నారు. రీసెంట్ గా చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ, ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
మొన్నామధ్య గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా క్లోజింగ్ ఈవెంట్ లో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ కాంతార మూవీలోని దైవం ఆవహించిన సీన్స్ ను అనుకరించారు. ఐఫీలో రణ్‌వీర్, రిషబ్ యాక్టింగ్ ను పొగుడుతూనే దైవం పాత్రను ఇమిటేట్ చేయగా ఆ వీడియో వైరల్ అవడంతో పవిత్రమైన దైవ సంప్రదాయాన్ని అపహాస్యం చేశారంటూ ఆయనపై నెట్టింట విమర్శలొచ్చాయి.
అంతేకాదు, కాంతార నెక్ట్స్ పార్ట్ లో యాక్ట్ చేయాలని ఉందంటూ రణ్‌వీర్ చేసిన కామెంట్స్ పై కూడా కన్నడిగులు ఫైర్ అయ్యారు. అయితే ఈ కాంట్రవర్సీ బాగా ఎక్కువ అవడంతో రణ్‌వీర్ దీనిపై తన ఇన్‌స్టాలో స్పందిస్తూ క్షమాపణ చెప్పారు. రిషబ్ యాక్టింగ్ ను పొగడటమే తన ఉద్దేశమని, ఈ దేశంలోని ప్రతీ సంస్కృతి, సంప్రదాయంపై తనకు ఎంతో గౌరవముందని, తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమించమని కోరారు.
అయితే దీనిపై రిషబ్ రెస్పాండ్ అవుతూ, సినిమాలో చేసింది ఎక్కువ శాతం యాక్టింగే అయినప్పటికీ, అందులో దైవానికి సంబంధించిన సీన్స్ తమకు చాలా పవిత్రమైనవని, దాన్ని స్టేజ్‌పై ప్రదర్శించడం, జోక్ చేయడం లాంటివి చేయొద్దని అందరినీ కోరుతున్నానని, అది తమతో ఎమోషనల్ గా కనెక్ట్ అయుందని రిషబ్ చెప్పారు. ఆచారాల ప్రాముఖ్యతను అందరికీ తెలపాలనే ఉద్దేశంతోనే కాంతారలో ఎంతో కేర్ తీసుకున్నామని రిషబ్ క్లారిటీ ఇచ్చారు.