మిడిల్ ఈస్ట్ పరిస్థితులు.. ఆ తెలుగు సినిమాల సంగతేంటి?
మిడిల్ ఈస్ట్ పరిస్థితులు.. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రభావం చూపుతున్నాయి.;
మిడిల్ ఈస్ట్ పరిస్థితులు.. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రభావం చూపుతున్నాయి. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫారిన్ లొకేషన్లలో షూటింగ్స్ ను ఇప్పటికే ప్లాన్ చేసిన తెలుగు సినిమాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఏం జరుగుతుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
యుద్ధ వాతావరణం కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రయాణం సేఫ్ కాకపోవడంతో పలువురు నిర్మాతలు తమ షూటింగ్ ప్లాన్లను ఇప్పటికే
నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమా యూనిట్ జోర్డాన్, మొరాకో వంటి దేశాల్లో లాంగ్ షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ప్రాంతాలు సేఫ్ కాకపోవడంతో ప్లాన్స్ అన్నీ హోల్డ్ లోకి వెళ్లిపోయాయి.
అదేవిధంగా దుబాయ్ మార్గంగా వెళ్లే విమాన సర్వీసులకు కూడా బ్రేక్ పడటంతో షూటింగ్ షెడ్యూల్స్ పూర్తిగా మారిపోయాయి. ఇక సితార ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఓ ప్రేమకథా చిత్రానికి దుబాయ్ బ్యాక్ డ్రాప్ కీలకంగా ఉండాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆ షూటింగ్ కూడా ఇప్పుడు వాయిదా పడింది. దీంతో మూవీ టీమ్ ప్రత్యామ్నాయ లొకేషన్ల కోసం సెర్చింగ్ ప్రారంభించింది.
మరోవైపు.. మిడిల్ ఈస్ట్ దేశాల ఎడారి ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించాలని అనుకున్న పలు సినిమాలు కూడా నిలిచిపోయాయి. ఆయా ప్రాంతాల్లో షూటింగ్ చేసుకోవడానికి అనుమతులు, భద్రతా సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో దర్శకులు కథల్లో మార్పులు చేయాలా? లేక వేరే దేశాల్లో ఎడారి లొకేషన్లు వెతకాలా? అన్న దానిపై ఆలోచనలో పడ్డారు.
ఇదిలా ఉండగా, కొంతమంది నిర్మాతలు యూరప్ లో షూటింగ్లు పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ విమాన ప్రయాణ ఖర్చులు భారీగా పెరగడం మరో సమస్యగా మారింది. ముఖ్యంగా ఢిల్లీ- పారిస్ వంటి మార్గాల్లో టికెట్ ధరలు అధికంగా ఉండటం వల్ల సినిమా బడ్జెట్ పై అదనపు భారం పడుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో దాదాపు 12 తెలుగు సినిమాలు ప్రస్తుతం వేచి చూడాలనే పొజిషన్ కు వెళ్లిపోయాయి.
అంతే కాదు.. షూటింగ్లు కొనసాగించాలంటే భద్రత, ఖర్చులు, లాజిస్టిక్స్ వంటి అంశాలను నిర్మాతలు మళ్లీ పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది. ఏదేమైనా ఇంటర్నేషనల్ ఇష్యూస్.. కూడా సినీ ఇండస్ట్రీపై ఎంత మేరకు ఎఫెక్ట్ చూపించగలవో ప్రస్తుత పరిస్థితుల ద్వారా క్లియర్ గా తెలుస్తోంది. అందుకే అంతా నార్మల్ గా మారే వరకు ఆయా చిత్రాల నిర్మాతలు, దర్శకులు జాగ్రత్తగా ముందడుగు వేయాల్సిన అవసరం కనిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి మరి..