ఆ హీరో పక్కన కూర్చున్న క్ష‌ణాన్ని మ‌ర్చిపోలేను

మలయాళ సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు ఇంద్రన్స్ ప్రస్తుతం తమిళ సినిమా కరుప్పులో చేసిన పాత్రకు ప్రశంసలు అందుకుంటున్నారు.

Update: 2026-06-01 09:33 GMT

మలయాళ సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు ఇంద్రన్స్ ప్రస్తుతం తమిళ సినిమా కరుప్పులో చేసిన పాత్రకు ప్రశంసలు అందుకుంటున్నారు. సూర్య హీరోగా, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటుండగా, తాజాగా ఇంద్రన్స్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ముఖ్యంగా తమిళ స్టార్ విజయ్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. చాలా మందికి కరుప్పునే ఇంద్రన్స్‌కు తమిళంలో పెద్ద అవకాశం అనిపించినప్పటికీ, ఆయన ఇప్పటికే విజయ్ నటించిన నన్‌బన్ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. ఆ సినిమా సెట్స్‌లో విజయ్, సత్యరాజ్‌లతో కలిసి నటించిన క్షణాలను ఆయన తాజాగా గుర్తు చేసుకున్నారు.

విజయ్‌తో నటించడం తనకు చాలా కాలంగా ఉన్న కోరిక అని ఇంద్ర‌న్స్ తెలిపారు. పాత్ర పెద్దదా, చిన్నదా అన్నది తనకు ఎప్పుడూ ముఖ్యం కాదని, విజయ్‌తో ఒక్క సీన్‌లో అయినా కనిపించాలని ఎప్పటి నుంచో అనుకున్నానని చెప్పారు. విజయ్ సర్ కోట్లాది మంది అభిమానించే గొప్ప నటుడ‌ని, ఆయనతో ఒక సీన్‌లో అయినా నటించాలన్నది త‌న‌ చిరకాల కోరిక అని, ఆ ఛాన్స్ నన్‌బన్ ద్వారా రావడం ఎంతో ఆనందాన్నిచ్చింద‌ని పేర్కొన్నారు. నన్‌బన్ సినిమాలో తాను గోవిందన్ పాత్ర పోషించానని, ఒక సందర్భంలో విజయ్, సత్యరాజ్‌లతో కలిసి ఒకే ఫ్రేమ్‌లో కూర్చొని నటించడం తన కెరీర్‌లో మరచిపోలేని అనుభవమని వెల్లడించారు. విజయ్‌ గారికి కేవలం తమిళనాడులోనే కాదు, కేరళలో కూడా విశేషమైన అభిమాన వర్గం ఉందని, ఆయన ప్రజాదరణ దేశవ్యాప్తంగా విస్తరించిందని కొనియాడారు. అలాగే డైరెక్ట‌ర్ శంకర్ గురించి మాట్లాడిన ఇంద్రన్స్, తనకు శంకర్ సినిమాల్లో నటించాలనే కోరిక చాలా ఏళ్లుగా ఉందని చెప్పారు. ముఖ్యంగా తాను ప్రధానంగా కామెడీ పాత్రలు చేస్తున్న టైమ్ లోనే శంకర్ తన యాక్టింగ్ ను గమనించి మెచ్చుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వెల్లడించారు.

ఇక ప్రస్తుతం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న కరుప్పు సినిమా గురించి కూడా ఇంద్రన్స్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో ఆయన మట్టాంచెరి సుకుమారన్ అనే పేద కేరళ తండ్రి పాత్రలో కనిపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించేందుకు చెన్నైకి వచ్చే వ్యక్తిగా ఆయన పాత్ర సాగుతుంది. అయితే ట్రీట్‌మెంట్ కోసం తెచ్చిన బంగారం దొంగిలించబడటంతో అతని జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది. అవినీతి న్యాయవ్యవస్థలో చిక్కుకుని ఎన్నో కష్టాలు ఎదుర్కొనే వ్యక్తిగా ఇంద్రన్స్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. మరోవైపు సూర్యతో కలిసి నటించేటప్పుడు మొద‌ట తాను చాలా భయపడ్డానని కూడా ఆయన అంగీకరించారు. సాధారణంగా ఇతర భాషా సినిమాల్లో నటించే టైమ్ లో కొంత ఆందోళన ఉంటుందని, అందులోనూ సూర్యలాంటి స్టార్ యాక్ట‌ర్ తో స్క్రీన్ పంచుకోవడం వల్ల మరింత టెన్షన్ అనిపించిందని చెప్పారు. అయితే పాత్రను మలయాళీ వ్యక్తిగా రూపొందించడం వల్ల తనకు సౌకర్యంగా అనిపించిందని, అదే ఈ సినిమాను అంగీకరించడానికి ప్రధాన కారణమని వెల్లడించారు. మొత్తంగా విజయ్, శంకర్‌లతో పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకుంటూనే, కరుప్పు ద్వారా మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఇంద్రన్స్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News