ఆస్కార్ బరిలో భారత్: నామినేషన్లు తగ్గే ప్రమాదం ఉందా?

ఇండియా నుంచి ఆస్కార్ రేసులో నిలిచే సినిమాల సంఖ్య .. నామినేషన్లు సాధించే అవకాశాలు తగ్గుతాయా అనే చర్చ అంతర్జాతీయ సినీ వర్గాల్లో ఎప్పుడూ నడుస్తూనే ఉంది.

Update: 2026-06-24 05:57 GMT

ఇండియా నుంచి ఆస్కార్ రేసులో నిలిచే సినిమాల సంఖ్య .. నామినేషన్లు సాధించే అవకాశాలు తగ్గుతాయా అనే చర్చ అంతర్జాతీయ సినీ వర్గాల్లో ఎప్పుడూ నడుస్తూనే ఉంది. గత 55 ఏళ్లలో కొన్ని సినిమాలు మాత్రమే బెస్ట్ ఇంట ర్నేషనల్ ఫీచ‌ర్ ఫిల్మ్ కేటగిరీలో తుది నామినేషన్ల వరకు వెళ్లడం దేశ సినీ విస్తృతికి చాలా తక్కువనే చెప్పాలి. అయితే ఆస్కార్ అకాడమీ ఇటీవల తీసుకొచ్చిన సరికొత్త నిబంధనల ప్రకారం ఒక దేశం నుంచి ఒకే సినిమాను పంపాలనే పాత నిబంధనను కొంతవరకు సడలించారు. కాన్స్, బెర్లిన్, వెనిస్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో టాప్ అవార్డులు గెలుచుకున్న సినిమాలు ఇప్పుడు నేరుగా ఆస్కార్‌ రేసుకు అర్హత సాధించొచ్చు. దీనివల్ల సాంకేతికంగా నామినేషన్ల అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో భారతీయ సినిమాలు వెనుకబడటానికి, నామినేషన్ల రేటు తగ్గడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి.

ఆస్కార్ బరిలో నిలవడానికి కథలో ప్రతిభ ఉంటే సరిపోదు. అంతకుమించి భారీ మార్కెటింగ్ బడ్జెట్ అత్యంత ముఖ్యం. ఆస్కార్ ఓటర్లకు సినిమాను చేరవేయడానికి ..ప్రత్యేక స్క్రీనింగ్‌లు ఏర్పాటు చేయడానికి..అంతర్జాతీయ మీడియాలో టాక్-షోలు నిర్వహించడానికి మిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చవుతాయి. దేశం నుంచి అధికారికంగా వెళ్లే చిన్న బడ్జెట్ చిత్రాలకు అంత భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసే ఆర్థిక వ్యూహం గానీ, సపోర్ట్ గానీ లభించకపోవడం పెద్ద మైనస్. ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలు సొంతంగా భారీ బడ్జెట్‌తో గ్లోబల్ ప్రమోషన్స్ చేయడం వల్లే `నాటు నాటు` పాట ఆస్కార్ కు వెళ్లింది. అవార్డు అందుకుంది. కానీ ప్రతి సినిమాకు అది సాధ్యపడటం లేదు.

ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) సెలెక్షన్ ప్రాసెస్ ..అంతర్గత నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాలను పక్కన పెట్టి, దేశీయంగా ఉండే కొన్ని లెక్కల ప్రకారం చిత్రాలను ఆస్కార్‌కి పంపడంపై విమర్శలున్నాయి. గతంలో `ది లంచ్ బాక్స్` లేదా ఇటీవల అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన `ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్` లాంటి చిత్రాలను కాదని వేరే సినిమాలను అధికారిక ఎంట్రీలుగా పంపడం వల్ల కొన్ని అవకాశాలను చేజేతులా కోల్పోతున్నామనే వాదన ఉంది. అకాడమీ ఓటర్ల పల్స్ తెలిసిన సినిమాలను గుర్తించడంలో మన కమిటీలు విఫలమైతే నామినేషన్ల సంఖ్య తగ్గడం ఖాయం.

గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ లేకపోవడం. ఆస్కార్ రేసులో చివరి వరకు నిలవాలంటే హాలీవుడ్‌లో పట్టున్న టాప్ అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్ల అండ ఉండాలి. వీరు అకాడమీ సభ్యులతో నిరంతరం టచ్‌లో ఉంటారు. కాబ‌ట్టి సినిమా విజిబిలిటీని పెంచగలరు. దేశీయ సినిమాలకు ఇలాంటి బలమైన అంతర్జాతీయ పంపిణీ వ్యవస్థల మద్దతు దొరకడం చాలా అరుదుగా మారుతోంది. కథా శైలి ... కమర్షియల్ ఫార్మాట్ కూడా అంతే కీల‌కం.

మెయిన్‌స్ట్రీమ్ సినిమా ఎక్కువగా పాటలు, ఫైట్లు, సుదీర్ఘమైన రన్ టైమ్‌తో సాగుతుంది. ఇది గ్లోబల్ ఆడియన్స్‌కు విభిన్న అనుభూతిని ఇచ్చినప్పటికీ ఆస్కార్ అకాడమీ సంప్రదాయ ఓటింగ్ ప్యాటర్న్ సాధారణంగా రియలిస్టిక్, సామాజిక అంశాలు లేదా నూతన శైలితో కూడిన పీరియాడిక్ డ్రామాలను ఎక్కువగా ఇష్టపడుతుంది. మన కమర్షియల్ మేకింగ్ స్టైల్‌కి.. వారి అవార్డుల క్రైటీరియాకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అధిగమించలేకపోవడం కూడా నామినేషన్ల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగకపోవడానికి ప్రధాన కారణంగా క‌నిపిస్తోంది.

Tags:    

Similar News