థియేటర్‌ దారిలో ఓటీటీ... వాళ్ల పరిస్థితి ఏంటి?

కరోనా తర్వాత థియేటర్‌కి వెళ్లే వారి సంఖ్య మరింతగా తగ్గింది. అందుకు కారణం కచ్చితంగా ఓటీటీలు అనడంలో సందేహం లేదు.;

Update: 2025-12-29 05:49 GMT

సినిమా టికెట్ల రేట్ల విషయంలో గత కొన్ని సంవత్సరాల్లోనే చాలా వ్యత్యాసం వచ్చింది. గడచిన 20 ఏళ్ల కాలంలో థియేటర్లకు జనాలు వెళ్లేందుకు భయపడే రేంజ్‌లో టికెట్ల రేట్లు పెరిగాయి. 2000 సంవత్సరానికి ముందు ఉన్న టికెట్ల రేట్లతో పోల్చితే ప్రస్తుతం సినిమా థియేటర్ల టికెట్ల రేట్లకు ఏమాత్రం పొంతన.. పోలిక కనిపించడం లేదు. పదుల రూపాయల్లో ఉన్న టికెట్‌ రేట్లు వందలు.. వేల రూపాయలకు వెళ్లిన విషయం మనం చూస్తూనే ఉన్నాం. సినిమా బడ్జెట్‌ పెరిగింది, థియేటర్ల మెయింటెనెన్స్ పెరిగింది.. ఇంకా చాలా విషయాల్లో మార్పులు వచ్చాయి కనుక టికెట్ల రేట్లు పెంచాల్సి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. కానీ ప్రేక్షకులు మాత్రం పెరిగిన రేట్ల కారణంగా థియేటర్లకు వెళ్లడం మానేస్తున్నారు. అప్పట్లో నెలకు ఒకసారి అయినా థియేటర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇప్పుడు ఏడాదికి ఒక్కసారి చాలు అన్నట్లుగా భావిస్తున్నారు అంటే సామాన్యులపై ఏ స్థాయిలో భారం పడిందో అర్థం చేసుకోవచ్చు.

ఓటీటీ సినిమాల కోసం ప్రేక్షకులు...

కరోనా తర్వాత థియేటర్‌కి వెళ్లే వారి సంఖ్య మరింతగా తగ్గింది. అందుకు కారణం కచ్చితంగా ఓటీటీలు అనడంలో సందేహం లేదు. ఓటీటీ మార్కెట్‌ గడచిన ఐదు ఏళ్లలో విపరీతంగా పెరిగింది. సాధారణంగా సినిమాలను థియేటర్‌లో చూసేందుకు ఆసక్తి చూపించే వారు, కానీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం ఎదురు చూడటం మొదలు అయింది. థియేటర్‌లకు వెళ్లాలి అంటే భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉన్న కారణంగా ఓటీటీ లో వచ్చే వరకు వెయిట్‌ చేద్దాం అనుకుంటున్న వారు ఉన్నారు. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ విషయంలో పాజిటివ్‌గా ఉన్న సామాన్యులు ఆ విషయంలోనూ భారంను మోయాల్సిన పరిస్థితి రావచ్చు అంటున్నారు. ఓటీటీ కి పెరిగిన మార్కెట్‌ కారణంగా నిర్మాతలు సినిమాలను ఆయా ఓటీటీలకు అమ్మేందుకు భారీ మొత్తంలో డిమాండ్‌ చేస్తున్నారు. దాంతో కంటెంట్‌ ను కొనుగోలు చేయడానికి ఓటీటీలు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో...

అయిదు ఏళ్ల క్రితంతో పోల్చితే ఇప్పుడు ఓటీటీ లు కంటెంట్‌ క్రియేషన్‌కి, కొనుగోలు చేయడానికి బడ్జెట్‌ ను పలు రెట్లు పెంచింది. ఖాతాదారులు పెరిగినా కూడా పెడుతున్న ఖర్చుకు, సబ్‌స్క్రిప్షన్‌తో వస్తున్న డబ్బుకు సరిపోవడం లేదు అని అన్ని ఓటీటీల వారు అంటున్నారు. అందుకే గతంలో లేని యాడ్స్ ను తీసుకు వచ్చారు. అయినా కూడా ఓటీటీలు రాబడి పెంచుకునేందుకు గాను సబ్‌స్క్రిప్షన్‌ ఫీజ్‌ను పెంచేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో ప్రముఖంగా నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌ వీడియో, జియో హాట్‌ స్టార్‌, జీ5 వంటి ఓటీటీలు రాబోయే రోజుల్లో రేట్లు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనిష్టంగా 5 శాతం నుంచి గరిష్టంగా 25 శాతం వరకు రేట్లను పెంచే యోచనలో పలు ఓటీటీలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. తమ వినియోగదారుల అవసరాలను బట్టి సింగిల్ డివైజ్‌ స్ట్రీమింగ్ ఆప్షన్‌ ఇవ్వడం కూడా కొన్ని మొదలు పెట్టాయి.

ఓటీటీ రేట్లు పెంచితే..

అలా చేయడం వల్ల ఖాతాదారులు అమౌంట్‌ తక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ ఖాతాలు తీసుకోవాల్సి ఉంటుంది. కనుక అలా ఓటీటీ యాజమాన్యం కు లాభం దక్కుతుంది. ఒకటి రెండు ఓటీటీలు తప్ప ఎక్కువ శాతం ఓటీటీలు సామాన్యులకు అందుబాటులో అన్నట్లుగానే సబ్‌స్క్రిప్షన్‌ ఫీజ్‌లను ఉంచాయి. కానీ రాబోయే రోజుల్లో అన్ని ఓటీటీల రేట్లు భారీగా పెరిగితే థియేటర్లకు సామాన్యులు ఎలా అయితే దూరం అయ్యారో అలాగే ఓటీటీలకు దూరం అయ్యే ప్రమాదం ఉందని సినీ విశ్లేషకులు కొందరు విశ్లేషిస్తున్నారు.

ఓటీటీలు తమ రేటు పెంచితే ప్రేక్షకులు ఉచితంగా వినోదాన్ని ఇచ్చే ప్లాట్‌ఫ్లామ్స్ ను వెతుక్కోవాల్సి వస్తుంది అంటూ కొందరు హెచ్చరిస్తున్నారు. అయినా కూడా పెరిగిన పోటీ, కంటెంట్‌ బడ్జెట్ నేపథ్యంలో ఓటీటీ లు రేట్లు పెంచితే సామాన్యులు ఈపాటి వినోదానికి కూడా దూరం కావాల్సి వస్తుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నట్టుండి, ఇదే ఏడాది పెంచే అవకాశం లేదు. కానీ రాబోయే రెండు మూడు ఏళ్లలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ తమ డిమాండ్ అనుగుణంగా పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది మార్కెట్‌ పరిశీలకుల అంచన.

Tags:    

Similar News