ఫ్రాంఛైజీల సాగ‌దీత‌: అంతం లేని కథల ప్రయాణంలో 'దురంధర్'

హాలీవుడ్ తెరపై ఒక ఫ్రాంఛైజీ సూపర్ హిట్ అయితే.. దానికి ముగింపు పలకడం అంత సులభం కాదని చరిత్ర చెబుతోంది.;

Update: 2026-05-08 06:54 GMT

హాలీవుడ్ తెరపై ఒక ఫ్రాంఛైజీ సూపర్ హిట్ అయితే.. దానికి ముగింపు పలకడం అంత సులభం కాదని చరిత్ర చెబుతోంది. టామ్ క్రూజ్ `మిషన్ ఇంపాజిబుల్` సిరీస్‌కు ఇదే ఆఖరి సినిమా అని ప్రకటించినా.. కథను ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అటు జేమ్స్ బాండ్ సిరీస్ విషయంలోనూ ఇదే పరిస్థితి. ఒక నటుడు తప్పుకున్నా.. కొత్త బాండ్ రూపంలో ఫ్రాంఛైజీని సజీవంగా ఉంచుతున్నారు. ఇక సూపర్ మ్యాన్ వంటి సినిమాలైతే ఒక ముగింపు తర్వాత కూడా `హోమ్ కమింగ్` వంటి సరికొత్త కథలతో మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ అంతర్జాతీయ ధోరణి ఇప్పుడు భారతీయ సినిమాను కూడా పూర్తిగా ఆవహించింది.

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో కొనసాగింపు భాగాల గురించిన చర్చ జోరుగా సాగుతోంది. ఒకప్పుడు బాహుబలి 2తో కథ ముగిసిందని అనుకున్నా... చాలా కాలంగా `బాహుబలి 3` వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. బాహుబ‌లి 3 ఉందా లేదా? అన్న‌ది ఎటూ తేల్చ‌కుండా రీడ‌ర్ ని ఎంగేజ్ చేసేందుకు జ‌క్క‌న్న వెన‌కాడ‌టం లేదు. అలాగే `పుష్ప 2` గ్రాండ్ సక్సెస్ త‌ర్వాత‌ `పుష్ప 3` కోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. `కేజీఎఫ్ 3` కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూడ‌టం ఆస‌క్తిని పెంచింది.. ఒక ఫ్రాంఛైజీ సక్సెస్ అయితే దానిని సాగదీయడం కమర్షియల్ గా ఎంత అవసరమో వీట‌న్నిటినీ బ‌ట్టి అర్థమవుతోంది. కేవలం సాగదీయడమే కాకుండా... కథలో పస ఉంటే ప్రేక్షకులు ఎన్ని భాగాలైనా ఆదరిస్తారని మన దర్శకులు నమ్ముతున్నారు. చ‌క్క‌ని భావోద్వేగాల‌ను పండిస్తూ అర్థ‌వంత‌మైన క‌థ‌లో అద్భుత‌మైన పాత్ర‌ల‌తో మ్యాజిక్ చేయ‌వ‌చ్చ‌ని ఫ్రాంఛైజీ చిత్రాలు నిరూపిస్తూనే ఉన్నాయి.

ఒక పాపులర్ ఫ్రాంఛైజీని నడపడంలో మన దర్శకులు కూడా హాలీవుడ్ మేధావుల‌ తరహాలో తెలివిగా ఆలోచిస్తున్నారు. కథా గమనాన్ని మార్చడమే కాకుండా.. అసలు ఆ పాత్రల మూలాల లోకి వెళ్లి కొత్త కోణాలను ఆవిష్కరిస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలు ఫ్రాంఛైజీ క్రేజ్‌ను తగ్గకుండా కాపాడతాయి. ప్రస్తుతం ఇదే తరహాలో `దురంధర్ 3` కోసం సన్నాహాలు మొదలవ్వడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. మొదటి రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు సాధించడంతో.. ఆ బ్రాండ్ ఇమేజ్‌ను మరింతగా క్యాష్ చేసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

ప్రముఖ నిర్మాత జ్యోతి దేశ్‌పాండే ఇటీవల`దురంధర్` మూడో భాగం గురించి ఇచ్చిన లీకులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూడో భాగం కథ ఉంటుందని మ‌హిళా నిర్మాత‌ స్పష్టం చేయడమే కాకుండా, ఈసారి ఫ్రాంఛైజీలో ఒక కొత్త తరహా ప్రపంచాన్ని చూపించబోతున్నట్లు హింట్ ఇచ్చారు. అంటే పాత పాత్రలనే కాకుండా సరికొత్త పాత్రలను లేదా గతంలో చూడని సరికొత్త నేపథ్యాన్ని ఈ కథలో పుట్టించే వీలుంది. ఈ వార్త బయటకు రావడంతో `దురంధర్` అభిమానులలో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ర‌ణ్ వీర్ - ఆదిత్యాధ‌ర్ జోడీ మ‌రోసారి రిపీటైతే బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భంజ‌న‌మేన‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఈ ఏడాదిలోనే `దురంధర్ 3` కి సంబంధించిన ఒక భారీ సర్ ప్రైజ్ న్యూస్ ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఆ సర్ ప్రైజ్ ఏమిటన్నది ప్రస్తుతానికి రహస్యంగా ఉంచినా.. ఇది క‌చ్చితంగా ఇండియన్ సినిమా స్థాయిని పెంచేలా ఉంటుందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఒక ఫ్రాంఛైజీ ప్రారంభమయ్యాక దానిని తెలివిగా ఎలా విస్తరించాలో `దురంధర్` టీమ్ చూపిస్తున్న తీరు మిగిలిన మేకర్స్‌కు కూడా ఒక మార్గదర్శకంగా మారనుంది. మరి ఈ ఏడాదే రానున్న ఆ అప్డేట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News