ఇప్పుడు 'మ్యూజిక్ మ్యాస్ట్రో' కాదు.. వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా?
కంపోజర్ గా తన హక్కులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో అనేక సందర్భాల్లో లీగల్ నోటీసులు కూడా పంపించారు.
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా పాటలు కొత్త సినిమాలో వాడాలంటే ఇకపై ఆయన పర్మిషన్ తీసుకోవాలా? లేక ఆ పాట హక్కులు ఉన్న మ్యూజిక్ కంపెనీని సంప్రదించాలా? ఢిల్లీ హైకోర్టు తీర్పు తర్వాత ఇదే చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఇళయరాజా స్వరపరిచిన 134 సినిమాల పాటల విషయంలో ఆ తీర్పు కొత్త చర్చలు మొదలు పెట్టింది. వాస్తవానికి.. ఇళయరాజా దాదాపు ఐదు దశాబ్దాలుగా వేలాది పాటలకు ఆయన సంగీతం అందించారు. అయితే తన సాంగ్స్ అనుమతి లేకుండా వాడుతున్నారంటూ గత కొన్నేళ్లుగా ఆయన పలువురిపై చట్టపరమైన పోరాటం చేస్తున్నారు.
కంపోజర్ గా తన హక్కులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో అనేక సందర్భాల్లో లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది. 1976 నుంచి 2001 మధ్య విడుదలైన 134 సినిమాల పాటల విషయంలో మ్యూజిక్ కంపెనీ సరిగమకే హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. నిర్మాతలు ఆడియో హక్కులు అప్పటికే సరిగమకు ట్రాన్స్ఫర్ చేశారని, అందువల్ల ఆ పాటల సౌండ్ రికార్డింగ్ లపై హక్కులు ఆ సంస్థకే ఉంటాయని కోర్టు పేర్కొంది.
అదే సమయంలో ఇళయరాజాకు తన కంపోజిషన్ పై రైట్స్ ఉన్నప్పటికీ, సినిమా కోసం రూపొందించిన సౌండ్ రికార్డింగ్లపై పూర్తి హక్కులు నిర్మాతలకు లేదా వారి నుంచి హక్కులు పొందిన మ్యూజిక్ సంస్థలకే ఉంటాయని కోర్టు వివరించింది. అయితే ఆ తీర్పు వచ్చిన వెంటనే చాలామందిలో ఒక సందేహం మొదలైంది. ఇకపై ఎవరైనా ఇళయరాజా పాటలు ఉపయోగించాలంటే ఆయన అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలా అనే ప్రశ్న వినిపిస్తోంది. కానీ ఇక్కడే అసలు విషయం ఉంది. కోర్టు తీర్పు అన్ని పాటలకు వర్తించదు.
ప్రస్తుతం వివాదంలో ఉన్న 134 సినిమాల పాటలకే ఇది పరిమితం. ఆ పాటల ఆడియో హక్కులు సరిగమ వద్ద ఉన్నందున, వాటిని సినిమాల్లో, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లేదా ఇతర అవసరాల కోసం ఉపయోగించాలంటే సంబంధిత హక్కులు సరిగమ నుంచి పొందాల్సి ఉంటుంది. ఇదే అంశంపై గతంలో కూడా ఇళయరాజా పలు వివాదాల్లో నిలిచారు. తన పాటలు కచేరీల్లో పాడటం, సినిమాల్లో మళ్లీ ఉపయోగించడం వంటి విషయాల్లో అనుమతి లేకుండా వాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో కాపీరైట్ హక్కులపై ఎన్నో చర్చలు జరిగాయి. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు తీర్పుతో మరోసారి అదే అంశం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా పాత హిట్ పాటల రీమేక్స్, కొత్త సినిమాల్లో ఉపయోగించాలని భావించే దర్శకులు, నిర్మాతలు ఇకపై ముందుగా ఆ పాటల హక్కులు ఎవరి వద్ద ఉన్నాయో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఇళయరాజా తీర్పుపై అప్పీల్ చేస్తారో లేదో కూడా ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఆ 134 సినిమాల్లోని పాటలు
ఉపయోగించాలనుకునే వారు ఇళయరాజా కంటే ముందు మ్యూజిక్ సంస్థ నుంచే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పాలి.