'డ్యూడ్'కు ఇళయరాజా షాక్.. మరోసారి లీగల్ చిక్కుల్లో మైత్రీ!

ఒకవైపు కలెక్షన్ల వర్షం, మరోవైపు కాపీరైట్ వివాదం.. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ పరిస్థితి ఇది.;

Update: 2025-10-22 10:44 GMT

ఒకవైపు కలెక్షన్ల వర్షం, మరోవైపు కాపీరైట్ వివాదం.. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ పరిస్థితి ఇది. వారు నిర్మించిన లేటెస్ట్ చిత్రం 'డ్యూడ్', దీపావళి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 90 కోట్లకు పైగా గ్రాస్‌తో వంద కోట్ల క్లబ్ వైపు పరుగులు తీస్తున్న ఈ సినిమాకు, ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది.

లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఇళయరాజా, 'డ్యూడ్' సినిమా మేకర్స్‌పై అధికారికంగా ఫిర్యాదు చేశారు. తన అనుమతి లేకుండా, తన పాపులర్ సాంగ్ "కరుత మచ్చాన్"ను సినిమాలో ఉపయోగించుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ వార్త ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న టైమ్‌లో ఈ వివాదం తెరపైకి రావడం గమనార్హం.

నిజానికి, మైత్రీ మూవీ మేకర్స్‌కు, ఇళయరాజాకు మధ్య ఇలాంటి వివాదం తలెత్తడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే, అజిత్ హీరోగా వారు నిర్మించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా విషయంలో ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారు. ఆ సినిమాలో తన అనుమతి లేకుండా మూడు పాటలను ("ఒత్త రూబా తారెన్", "ఇళమై ఇదో ఇదో", "ఎన్ జోడి మంజ కురువి") వాడటమే కాకుండా, వాటిని మార్చారని ఆయన ఆరోపించారు.

కాపీరైట్ ఉల్లంఘన కింద 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, పాటలను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

ఆ సమయంలో మైత్రీ మూవీ మేకర్స్ స్పందిస్తూ, తాము ఆ పాటల హక్కులను సోనీ మ్యూజిక్ వంటి సంస్థల నుంచి చట్టబద్ధంగా కొనుగోలు చేశామని, ఒక్కో పాటకు ₹15-20 లక్షలు చెల్లించామని వివరణ ఇచ్చింది. అన్ని నిబంధనలను పాటించామని వారు తెలిపారు. ఈ కేసు ఇంకా కోర్టులో నడుస్తుండగానే, ఇప్పుడు 'డ్యూడ్' విషయంలో మరోసారి అదే తరహా వివాదం మొదలైంది.

'గుడ్ బ్యాడ్ అగ్లీ' కేసు ఇంకా తేలకముందే, 'డ్యూడ్' సినిమాలో తన పాటను అనుమతి లేకుండా వాడటంపై ఇళయరాజా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తాజా ఫిర్యాదుపై మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న 'డ్యూడ్' టీమ్‌కు ఈ లీగల్ నోటీస్ ఎలాంటి తలనొప్పి తెచ్చిపెడుతుందో చూడాలి. ఒకవైపు వంద కోట్ల సంబరాలకు సిద్ధమవుతుంటే, మరోవైపు లెజెండరీ కంపోజర్‌తో న్యాయపోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో, మైత్రీ సంస్థ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News