మరో సారి పోలీస్ కస్టడీకి ఐబొమ్మ రవి.. ఎన్ని రోజులంటే..!
పైరసీ భూతంతో సినిమా ఇండస్ట్రీని ముప్పుతిప్పలు పెట్టి ఐ బొమ్మరవి నన్ను పట్టుకోలేరంటూ పోలీసులకే సవాల్ విసిరి అనూహ్యంగా అరెస్ట్ కావడం తెలిసిందే.;
పైరసీ భూతంతో సినిమా ఇండస్ట్రీని ముప్పుతిప్పలు పెట్టి ఐ బొమ్మరవి నన్ను పట్టుకోలేరంటూ పోలీసులకే సవాల్ విసిరి అనూహ్యంగా అరెస్ట్ కావడం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఐబొమ్మరవి అరెస్ట్ ఇప్పటికీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగానే నిలుస్తోంది. కొంత మంది అతన్ని అభినవ రాబిన్ హుడ్‌గా అభివర్ణిస్తుంటే సినిమా వాళ్లు మాత్రం ఓ చీటర్‌గా చూస్తూ అతన్ని కఠినంగా శిక్షించాల్సిందే అంటున్నారు.
అనూహ్యంగా అతన్ని పట్టుకున్న పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరు పరచడం, వాదనలు విన్న కోర్టు ఇమంది రవిని పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. అనంతరం మాస్టర్ మైండ్ ఐబొమ్మ రవిని విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టడం తెలిసిందే. ఆరేళ్ల పాటు సినీ రంగాన్ని, పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టిన ఇమంది రవిని విచారించిన పోలీసులు కస్టడీ ముగియడంతో తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించారు.
అయితే ఇమంది రవిపై పోలీసులు మూడు కేసుల్ని నమోదు చేసి విచారించారు. తాజాగా మరోసారి అతన్ని కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టుని ఆశ్రయించడంతో ఇమంది రవికి షాక్ ఇస్తూ 12 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రెండు సార్లు పోలీస్ కస్టడీలోకి వెళ్లిన ఇమంది రవి పలు కీలక విషయాల్ని వెల్లడించాడట. అయితే తాజాగా మరోసారి అతన్ని మూడు కేసుల్లో నిజా నిజాలు నిగ్గుతేల్చడం కోసం మరో సారి పోలీసులు విచారించబోతున్నారు.
మూడు కేసుల విచారణ కోసం 12 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి జిల్లా కోర్టు ఉత్వర్వులు జారీ చేసింది. అంతే కాకుండా మూడు కేసులకు గానూ ఒక్కో కేసు కోసం నాలుగు రోజుల పాటు విచారించాలని పోలీసులకు సూచించింది. దీంతో ఎల్లుండి నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు మాస్టర్ మైండ్ ఇమంది రవిని విచారించనున్నారు. ఇటీవల అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నాడు. పలు దఫాలుగా రవిని విచారిస్తున్న పోలీసులు ఈ సారి 12 రోజుల పాటు విచారించి మరెన్ని రహస్యాన్ని రవి నుంచి రాబట్టబోతున్నారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.