హైదరాబాద్‌లో IMAX మళ్లీ ఎప్పటికి? ఫ్యాన్స్ ఆవేదన!
అయితే హైదరాబాద్ ప్రసాద్స్ మల్లీప్లెక్స్ లో దాదాపు 10 ఏళ్లుగా ఇది అందుబాటులో లేకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది.;
ప్రపంచంలోనే నంబర్ 2 ఐమ్యాక్స్ స్క్రీన్ ఎక్కడ ఉంది అంటే.. `కేరాఫ్ హైదరాబాద్` అని గర్వంగా చెప్పుకునేవాళ్లం. ఆసియాలోనే నంబర్ వన్ స్క్రీన్ గా ఇది ఉనికిని చాటుకుంది. అయితే హైదరాబాద్ ప్రసాద్స్ మల్లీప్లెక్స్ లో దాదాపు 10 ఏళ్లుగా ఇది అందుబాటులో లేకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇటీవల హాలీవుడ్ లోనే కాదు, భారతీయ సినీపరిశ్రమల్లోను ఐమ్యాక్స్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. సాధారణ మల్టీప్లెక్స్ స్క్రీన్లకు, ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్ ఇచ్చే కిక్కు లేదనే నిరాశ అలానే ఉంది. అందుకే కొన్నేళ్లుగా ఐమ్యాక్స్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పుడు అవతార్ 3 ని ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్ లో చూడాలనుకునే భాగ్యనగర వాసులకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. మరికొద్దిరోజుల్లోనే అవతార్ - ఫైర్ అండ్ యాష్ విడుదలకు సిద్ధమవుతున్న వేళ హైదరాబాద్ లో ఐమ్యాక్స్ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుంది? అంటూ ఆరాలు మొదలయ్యాయి.
కానీ ఇది సాధ్యమేనా? అంటే... ఐమ్యాక్స్ ప్రొజెక్షన్ చాలా ఖరీదైన వ్యవహారం, పైగా సాంకేతికంగా దానికి చాలా పరిమితులు ఉన్నాయి. స్క్రీన్ పొడవు, ఎత్తు రెగ్యులర్ స్క్రీన్లతో పోలిస్తే చాలా ఎక్కువ. దీని మెయింటెనెన్స్ కూడా అతి భారీ ఖర్చుతో కూడుకున్నది. అయితే ఈ ఖర్చుకు తగ్గట్టు టికెట్ ధరల్ని నిర్ణయిస్తే, జనాలు ఆదరిస్తారా లేదా? అనేది కూడా పెద్ద సమస్య. టికెట్ ధరలు పెంచాలనుకుంటే, ఇప్పటికే ప్రజలలో చాలా వ్యతిరేకత నెలకొంది. ఇలాంటి రకరకాల కారణాలతో ఐమ్యాక్స్ నిర్వహణ నుంచి ప్రసాద్స్ ఐమ్యాక్స్ తప్పుకుంది. సదరు యాజమాన్యం లైసెన్స్ ని పునరుద్ధరించుకునే ఆలోచన చేయలేదని కూడా కథనాలొచ్చాయి. ఇటీవల చాలా మెట్రో నగరాల్లోను ఐమ్యాక్స్ స్క్రీన్లు అందుబాటులో ఉన్నా కానీ హైదరాబాద్ లో అందుబాటులో లేకపోవడం ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ముంబై, దిల్లీ, బెంగళూరు, పూణే, కలకత్తా, చెన్నై లాంటి నగరాలలో ఐమ్యాక్స్ వీక్షించే సౌలభ్యం ఉన్నా కానీ, హైదరాబాద్ కి దీనిని తెచ్చేందుకు ఎవరూ సాహసించడం లేదు.
2003 నుంచి దశాబ్ధం పాటు ప్రసాద్స్ ఐమ్యాక్స్ ఉనికిని చాటుకుంది. ఇది భారతదేశంలో మొట్టమొదటి 70 ఎంఎం ఐమాక్స్ .. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్క్రీన్. కానీ 2014-2015 నాటికి ఐమాక్స్ ఫార్మాట్ నుంచి వైదొలిగింది. డిజిటల్ - లేజర్ ఫార్మాట్‌లకు అప్‌గ్రేడ్ చేయడం ఖరీదైన వ్యవహారం కావడం.. అదే సమయంలో సినిమా పరిశ్రమ డిజిటల్ ఫార్మాట్ లో వేగంగా ముందుకు సాగడం వంటి పరిణామాలు కూడా ఐమ్యాక్స్ వెనకబాటుకు కారణమైంది. ప్రసాద్స్‌లో ఇప్పటికీ PCX అనే పెద్ద స్క్రీన్ అందుబాటులో ఉండటం కొంతవరకూ ఊరట. కానీ ఇది ఐమ్యాక్స్ ఫార్మాట్ కి భిన్నమైనది. అందుకే ఇప్పుడు నగరానికి ఐమ్యాక్స్ బిగ్ స్క్రీన్ అవసరం ఎంతైనా ఉందని అభిమానులు భావిస్తున్నారు.
మునుముందు అవతార్ రేంజ్ కాన్సెప్టులతో ఇండియన్ సినిమా కొత్త పుంతలు తొక్కబోతోంది. అత్యంత భారీ బడ్జెట్లతో నిర్మించిన సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. నితీష్ తివారీ- రామాయణం, ఎస్.ఎస్.రాజమౌళి- వారణాసి.. అవతార్ తరహాలో అద్భుతమైన విజువల్ ట్రీట్ ని అందిస్తాయని అభిమానుల్లో అంచనాలున్నాయి. ఈ రెండు సినిమాలను ఐమ్యాక్స్ 3డిలోను విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్న వేళ హైదరాబాద్ లో ఐమ్యాక్స్ లేకపోతే ఎలా? అంటూ ఆవేదన వ్యక్తమవుతోంది. టికెట్ ధర ఎంత నిర్ణయించినా అప్పుడప్పుడు కొన్ని క్రేజీ సినిమాలను అయినా ప్రజలు వీక్షించేందుకు వెసులు బాటు ఉంటుంది.
ప్రసాద్స్ నుంచి ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్ ని తొలగించాక ఏఎంబీ మాల్, ఏఏఏ మాల్ మల్టీప్లెక్స్ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చినా కానీ, వీళ్లు ఎవరూ ఐమ్యాక్స్ స్క్రీన్ ని నిర్మించాలనే ఆలోచన చేయలేదు. కాస్ట్ ఫ్యాక్టర్ తో పాటు సాంకేతికంగా ఉన్న చాలా సమస్యలు దీనికి కారణమని విశ్లేషిస్తున్నారు. అయితే థియేటర్ రంగంలో దిగ్గజాలు కనీసం ఒక్క ఐమ్యాక్స్ స్క్రీన్ ని అయినా హైదరాబాద్ కి తీసుకు రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. పంపిణీ రంగంలో దిగ్గజాలైన ఏషియన్ నారంగ్ పలువురు అగ్ర హీరోలతో కలిసి భాగస్వామ్య విధానంలో మల్టీప్లెక్స్ థియేటర్లను నిర్మిస్తున్నారు. కనీసం ఇలాంటి దిగ్గజ ఎగ్జిబిటర్లు అయినా ఐమ్యాక్స్ స్క్రీన్ ని అందుబాటులోకి తేవడంపై దృష్టి సారించాలని కోరుకుంటున్నారు.