మహిళా నటుల పాత్రల చిత్రణపై తీరుపై మండిపడిన సీనియర్!
బాలీవుడ్ లో గూఢచారి థ్రిల్లర్ సినిమాల సంఖ్య అంతకంతకు పెరుగుతోన్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ లో గూఢచారి థ్రిల్లర్ సినిమాల సంఖ్య అంతకంతకు పెరుగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జోరన్ చిత్రాలను ఉద్దేశించి నటి హుమా ఖురేషీ కీలక వ్యాఖ్యలు చేశారు. యాక్షన్ సినిమాల్లోని మహిళా హంతకులు లేదా గూఢచారి పాత్రలను చూపిస్తున్న విధానంపై ఖురేషీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఫీమేల్ అసాసిన్‌లను హైపర్-సెక్సువలైజ్డ్ పద్ధతిలో చూపించడం పట్ల నిరసన తెలియజేశారు.ఇటీవలే విడుదలైన 'ఆల్ఫా' స్పై థ్రిల్లర్ సినిమాల్లో మహిళా పాత్రలను బిగుతుగా ఉండే దుస్తుల్లో గ్లామర్ కోణంలోనే ప్రదర్శించడం వెనుక పితృస్వామ్య భావజాలం ఉందని హుమా విమర్శించారు.
గూఢచారిగా చేసే పనికి, వేసుకునే దుస్తులకు సంబంధం ఉండకూడదని కానీ బాలీవుడ్ ఇప్పటికీ అలాంటి పాత చింతకాయ పచ్చడి ఆలోచనలనే అనుసరిస్తోందని ఆరోపించారు. స్త్రీలను కేవలం ఆకర్షణీయమైన బొమ్మలుగా కాకుండా బలమైన యోధులుగా చూపించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. పురుష గూఢచారులను చూపేటప్పుడు వారి యాక్షన్ , మేధస్సుకు ప్రాధాన్యత ఇస్తారు. మహిళల విషయంలో మాత్రం శరీర ఆకృతికి ప్రాధాన్యత ఇవ్వడం సమంజసం కాదని హుమా వాదించారు. ఇది కళాత్మకత కంటే మార్కెటింగ్ వ్యూహం అని అభిప్రాయపడ్డారు.
సినిమాల్లోని పాత్రల రూపకల్పన అనేది నటీమణులపై భారాన్ని పెంచుతుందన్నారు. నిజమైన పోరాట పటిమ కంటే మేకప్, కాస్ట్యూమ్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పాత్రలోని లోతు తగ్గుతుందన్నారు. ప్రస్తుతం ప్రేక్ష కులు మరింత పరిణతి చెందారని గ్లామర్ కోసం కాకుండా వాస్తవికతకు దగ్గరగా ఉండే పాత్రలను చూడాలని కోరుకుంటున్నారన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. గూఢచారి చిత్రాల్లో నటీమణుల పాత్రల పరిధిని పెంచాలని, వారికి కూడా పురుష పాత్రలకు సమానమైన గౌరవం, స్వేచ్ఛా దుస్తులు ఉండాలని పలువురు నెటిజన్లు హుమా అభిప్రాయాలను సమర్థిస్తున్నారు. బాలీవుడ్ గూఢచారి సినిమాల రూపురేఖలను మార్చాల్సిన సమయం ఆసన్నమైందని దీనిని బట్టి అర్థమవుతోంది.
మహిళా పాత్రల పట్ల పరిశ్రమలో ఉన్న పక్షపాత వైఖరిని హుమా ఖురేషీ ప్రశ్నించిన తీరు, భవిష్యత్తులో వచ్చే సినిమాల్లో మార్పుకు ఆస్కారం కల్పిస్తుంది. కమర్షియల్ హంగుల కంటే పాత్ర హుందాతనానికి ప్రాధాన్యత ఇవ్వడమే నిజమైన సినీ విప్లవం. నిజానికి అంతర్జాతీయ చలనచిత్ర పరిశ్రమలో గూఢచారి పాత్రల చిత్రీకరణ ఇప్పటికే పరిణతి చెందిన దశకు చేరుకుంది. అక్కడ మహిళా ఏజెంట్లు వారి తెలివితేటలు, శారీరక దృఢత్వం ..క్లిష్టమైన వ్యూహాలకు ప్రాధాన్యత ఇస్తూ కనిపిస్తారు. బాలీవుడ్ కూడా అలాంటి వాస్తవిక దృక్పథాన్ని అలవ రచుకోవడం ద్వారా గ్లామర్ కోణాన్ని దాటి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించగలదు.
హుమా ఖురేషీ లేవనెత్తిన ఈ అంశం మేకర్స్ తమ కథా దృక్పథాన్ని మార్చుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. భవిష్యత్తులో వచ్చే స్పై థ్రిల్లర్లు కథా పరంగా ఎంత బలపడితే నటీమణులపై అలాంటి అనవసరమైన గ్లామర్ ఒత్తిడి తగ్గుతుంది. యాక్షన్ సన్నివేశాలలో కష్టపడే యోధురాలికి, సౌకర్యవంతమైన దుస్తులు , వాస్తవిక రూపకల్పన తోడైతే ఆ పాత్ర తీవ్రత ప్రేక్షకులకు మరింత బలంగా చేరుతుంది. బాలీవుడ్ గూఢచారి సినిమాలలో ఇలాంటి మార్పులు వస్తే అవి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లుగా మాత్రమే కాకుండా సమానత్వం వైపు అడుగులు వేసే సంకేతాలుగా నిలుస్తాయి.